Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 54


    "నేనేం తప్పు చేయలేదే"


    "మరి ఎందుకు కుమార్ దాదా 'అడ్డ' నుంచి తప్పించుకున్నారు"


    "పరుగెత్తే ప్రతివాడూ నేరస్థుడు కాడు"


    "కాని నేరస్థుడైన ప్రతి వ్యక్తీ పోలీసుల్ని చూసి పరుగు లంకించుకుంటాడు"


    శశాంక మరేదో చెప్పబోతుంటే "మిస్టర్ శశాంక" అరిచాడు అవినాశ్ సహనాన్ని కోల్పోతున్నట్టు - "నాకు జవాబు కావాలి"


    "ఏ విషయంలో" శశాంక తొట్రుపడటం లేదు. చాలా నిర్లిప్తంగా అడిగాడు.


    "కుమార్ దాదాతో మీకు గొడవేంటి"


    "వెళ్ళింది గొడవ పడటానికి కాదు"


    "మరి"


    "నా భార్యని ఎందుకు హత్య చేసాడో తెలుసుకుందామని"


    "వ్వాట్" అవినాశ్ భృకుటి ముడిపడింది.


    "యస్ మిస్టర్ అవినాశ్. నా భార్యని హత్య చేయించింది ధనుష్కోటి కాదు_జయచంద్ర"


    "మీకెలా తెలుసు"


    "దయుంచి ఆ వివరాలు నన్నడగొద్దు" శశాంక ఉద్విగ్నంగా అన్నాడు. "మీకు సాధ్యమైతే తెలుసుకోండి. లేకపోతే నన్ను తెలుసుకోనివ్వండి"


    ఇక్కడ నేర పరిశోధనలో ఎంతో అనుభవం గల అవినాశ్ తొలిసారి ఎంతగా తొట్రుపడ్డాడూ అంటే_ మొత్తం ఇన్వెస్టిగేటివ ప్రాసెస్ దిక్కునే మళ్ళించిన శశాంకని విభ్రమంగా చూస్తూ వుండిపోయాడు.


    "శశాంకా. అదే నిజమైతే..."


    "అది నిజం కాకపోతే ఈ రోజు జయచంద్ర ముఠా నా మీద ఎందుకు దాడి చేసిందంటారు."


    అవినాశ్ నోటు టక్కున మూత పడిపోయింది. వెంటనే తేరుకుని "అది కాదు శశాంకా. ఒక నిజం తెలిసినప్పుడు మా సహాయాన్ని తీసుకుని లోతుగా వెళితే మీకు భద్రత కదూ" అన్నాడు మాటల్ని కూడగట్టుకుంటూ.  


    "భద్రత" ఒత్తి పలికాడు శశాంక. "1983లో మీరు బాంబేలో వున్నారు కదూ"


    "అవును"


    "అదే ఏడాది సెప్టెంబర్ ఆరో తేదీన బాంబే సెషన్స్ కోర్టులో షబీర్ హత్య విషయంలో కోర్టుకి రప్పించబడిన అమీర్ జాదా మీ అందరి సమక్షంలోనే కోర్టు హాల్లో షూట్ చేయబడ్డాడు..."


    అవినాశ్ అనుభవంలో మర్చిపోలేని అతి క్రూరమైన సంఘటనది.


    "ఇదంతా చెబుతున్నది మిమ్మల్ని కించపరచాలని కాదు అవినాశ్ గారూ... మీకు తెలిసిన మాఫియా గేంగ్స్ వ్యవహారాల్ని మరోమారు గుర్తు చేస్తున్నాను... కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సాంఘికంగా, ఆర్థికంగా... ముఖ్యంగా రాజకీయ పరంగా విస్తరించిన జయచంద్ర లాంటి గాడ్ ఫాదర్స్ ని ఈ చట్టాలు ఏమీ చెయ్యలేవు. కాబట్టే నేను స్వయంగా రంగంలోకి దిగింది"


    "అప్పుడు మీరు నేరస్థులౌతారు."


    "కానివ్వండి" ఆవేశంగా లేచాడు "పోయిన భార్యని గుర్తుచేసుకుంటూ మానసికంగా చచ్చేకన్నా శతృవు బలవంతుడని నేనూ చట్టంలాగే నోరు మూసుకుని క్షణక్షణమూ జవాబు దొరకని ప్రశ్నలతో వేదనపడేకన్నా, ఆ ప్రపంచంలో పోరాడి ప్రాణాలు వదలడం నయం మిస్టర్ అవినాశ్. ఇది నా నిర్ణయం ఇది మారాలీ అంటే మీరు నేరస్థుడ్ని పట్టుకోవాలి. నా భార్యని హత్యచేయాల్సిన అవసరమేమొచ్చిందీ తెలుసుకోవాలి. ఇది శాశింపు కాదు... నా అభ్యర్ధన. అది చేయండి... ఆ తర్వాత మీరు చూపించిన తోవలో ప్రయాణం చేస్తాను"


    చాలా సహజమైన శశాంక మానసిక స్థితిని అర్థం చేసుకున్న అవినాశ్ ఏ ధైర్యంతో హామీ ఇవ్వాలనిపించిందో ఆత్మీయంగా అతడి భుజాల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ అన్నాడు_


    "ఇంత కాలం ట్రేక్ తప్పాను శశాంకా! పన్నెండు గంటల వ్యవధి చాలు... నేరస్థుడెంత బలవంతుడైనా సరే మీ కళ్ళ ముందే కటకటాల వెనక్కి రప్పిస్తాను"


    శశాంక వెళ్ళిపోయాడు.


    అక్కడితో తన పని ముగిసిపోలేదనిపించిన అవినాశ్ శశాంక కివ్వాల్సిన రక్షణ విషయంలో ఆదేశాలు జారీచేసి నెమ్మదిగా తల తప్పి చూశాడు.


    అక్కడ సెల్ లోని సాగర్ భయంతో ప్రకంపించి పోతున్నాడు.


    ఇప్పుడు అవినాశ్ జూలు విదిలించుకున్న సింహంలా వున్నాడు.


    బిగుసుకున్న పిడికెళ్ళతో సెల్ వేపు నడుస్తున్న అవినాశ్ కు తెలీదు_ సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తూ బయట ఓ ఆకారం నిలబడి వుందని.


    "సాగర్!" చతుర్విధోపాయాలలో మొదటి ప్రయత్నంగా మృదువుగా పిలిచాడు అవినాశ్.

    
    "చెప్పు... శశాంక భార్యని కుమార్ దాదా ఎందుకు హత్య చేశాడు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS