Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 54


    రౌడీ


    ఆఖరికి.....


    ఆఖరికి


    అవంతి కూడా చెప్పింది.


    అతనికి తనతో సంబంధం వుందని. అలాంటి మనిషి గురించి అసలు తనెందుకు ఆలోచిస్తూ వుందో భారతికే అంతు చిక్కడం లేదు.


    కానీ...... కానీ..... అవంతి మరో మాట కూడా చెప్పింది.


    "అతను చాలా మంచివాడు. మనిషిలో చెడు త్వరగా చూడగలం, కానీ మంచినే చూడలేం" అని.


    అక్కడ భారతికి అవంతిలోని నిజాయితీ కనబడుతోంది.


    అతనితో ఆమెకి గల సంబంధం గురించి తనకు చెప్పడంలో ఆమె నిజాయితీ, ధైర్యం మెచ్చుకోదగిందే. అలాగే అతను చాలా మంచివాడని చెప్పడంలో కూడా ఆమెలో గల ఔచిత్యానికి మరో నిదర్శనం. అతను తన వెంట పడుతున్నాడని చెప్పినప్పుడు అవంతి -


    అలా చెప్పడం చూస్తే మనోహర్ గురించి ఏమనుకోవాలి?


    భారతి ఆలోచనలు మరో పక్కకి దారితీశాయి. ఆరోజు బోసుగాడి దుర్మార్గం నించితనని కాపాడినందుకు తనలో అతనిపట్ల కృతజ్ఞత కావచ్చు. ఏదేమయినా ఆరోజు అతను చేసింది మాత్రం మహోపకారం.


    ఆడపిల్లగా తనేం పోగొట్టుకోకూడదో దాన్ని కాపాడిన మనిషి మనోహర్.


    ఇదిమిద్దంగా సాగుతున్నాయి ఆమె ఆళోచనలు.


    కానీ అవి ఓ సరైన దారిలోకి మాత్రం రావడం లేదు.


    మనోహర్ చదువు పూర్తయిన కారణంగా యూనివర్శిటీ వైపు రావడం లేదనుకుంది. అసలు ఊళ్ళో వున్నాడో లేదో కూడా ఆమెకి తెలీదు.


    అతని గురించి తెలుసుకోవాలని లోపల వుంది.


    కాని ఎవర్ని అడుగుతోంది.


    ఏమని అడుగుతుంది?


    అవంతి కూడా లేదు.


    ఆమె మనసులో ఏదో సన్నని బాధ కలిగింది. అతన్ని చూడాలని మాత్రం బాగా అనిపిస్తోంది?


     ఓపక్క అతన్ని ద్వేషిస్తూనే, మరో పక్క అతన్ని గురించి ఆలోచిస్తూ అతనికి దగ్గరైపోతున్న మనసుని అదుపు చేయాలనుకొంది.


    ఆమె హృదయంలో సంచలనాన్ని కలిగిస్తోన్న ఆలోచనలు కెరటాల్లా కదులుతున్నాయి.


    ఆమెకి పది గజాల దూరంలో కారాపి దిగి నడిచి వస్తున్న మనోహర్ని ఆమె చూడలేదు.


    అతను ఆమె ముందు నించున్నాడు. ఆమె చూపులు నేలపైన వున్నాయి.


    తనముందు ఎవరో నించున్నారని తన కళ్ళకి కనబడ్డ బూట్ కాళ్ళని చూసి ఉలిక్కిపడి తలెత్తి చూసింది.
    ఎదురుగా మనోహర్ నించుని వున్నాడు. ఆ క్షణంలో అతను కనబడేసరికి ఆమె అంతరంగాల్లో సంతోషం కలిగినా ఒక్కసారిగా నిరసన భావం కలిగింది.


    అంతవరకూ ఆమె ఆలోచించిన ఆలోచనల సరళి మారిపోయింది.


    "హలో" అన్నాడు మనోహర్.


    భారతి లేచి నుంచుంది.


    అతనికేసి ఓసారి చూసి మాట్లాడకుండా వూరుకొంది.


    "హౌ ఆర్ యు!" అన్నాడు.


    "ఫైన్. సో ఫైన్?" అని చెప్పాలనుకుంది.


    కానీ కానీ అతనిముందు తన భేషజాన్ని సడలిపోనీకుండా నిగ్రహాన్ని కూడదీసుకుని నిర్లక్ష్యంగా చూసింది.


    మనోహర్ మనోహరంగా నవ్వాడు.


    "నిన్ను చూసి చాలా రోజులైంది?" అన్నాడు.


    "సోవాట్!" అంది కోపాన్ని చూపిస్తూ.


    "ఏమో, నాకే తెలీదు కానీ నిన్ను చూడాలని నాకెప్పుడూ అనిపిస్తుంది. అంతేకాదు, అసలు ఎప్పుడూ నీ ఎదురుగానే వుండిపోవాలనిపిస్తుంది" అన్నాడు మనోహర్.


    "మీకనిపిస్తే నేనేం చెయ్యాలి! ఆ తప్పు నాది కాదు" అంది.


    "అయినా ఇలా ఎంతమందికిలా చెప్పారు" అడిగింది భారతి.


    "అఫ్ కోర్స్, నన్ను అనుమానించడంలో నీ తప్పులేదు. కానీ ఒక్కమాట చెప్పనా?"


    "అవసరంలేదు"


    "నీకు అవసరం లేకపోయినా చెప్పుకోవలసిన అవసరం నాకుంది" అన్నాడు మనోహర్.


    "వినవలసిన అవసరం నాకు లేనప్పుడు మీరు చెప్పి ప్రయోజనమేమిటి! నేను ఏమీ వినాలనుకోవడం లేదు" అంది.


    మనోహర్ సిగరెట్ వెలిగించాడు.


    అతన్ని విసిగించాలనిపిస్తోంది భారతికి.


    కానీ అలాంటి చొరవ చేయలేకపోతోంది.


    "ప్లీజ్. నన్నీవేళ కాదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు?" అన్నాడు.


    భారతి చివ్వున తలెత్తి చూసింది.


    "బెదిరింపా!" అడిగింది.


    "కాదు. ఇదివరలో అయితే ఇది బెదిరింపుగానే నేనలా భావించేవాడిని. కానీ ఇప్పుడు నన్ను నేను శిక్షించుకొంటాను.


    భారతీ ఒక్కమాట నిజం.


    నువ్వు నన్ను గురించి ఎలాంటి అభిప్రాయంతో వున్నావో నాకు పూర్తిగా తెలుసు. కానీ ఆ మనోహర్  ఎప్పుడో చచ్చిపోయాడు. నేను కేవలం నీకోసం మారిపోయాను."


    "దేనికి?"


    "ఐ లైక్ యు, అండ్ ఐ లవ్ యు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS