Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 54

చివ్వున తలఎత్తి నిజమేనా అన్నట్టు చూసింది.
"నా మాట నమ్మమ్మా... నేను చెప్పేది నిజమే"
ఆమెలోని ప్రతిస్పందన గమనించి ఆ విషయాన్నే మరలా చెప్పాడు అభినయ్.
"బాబూ... నువ్వు చెప్పేది నిజమేనా... పోలీసులు కాల్చి చంపారుగా...."
"లేదమ్మా....రవితేజను అన్నలు రక్షించారు. అతనికోసం మరో కామ్రేడ్ బలి అయ్యాడు"
"నమ్మలేకపోతున్నాను బాబూ..."
"నిజమమ్మా.... నామాట మీద నమ్మకం లేకపోతే పేపర్లో అన్నయ్య ఫోటో వేశారు. అంతేకాదు... జరిగింది కూడా వ్రాశారు"
ఆమె పేపరు అందుకుని చూసింది.
అమ్మా...నువ్వు బాధపడను అంతే..."
చెప్పు బాబు..."
"రవితేజ నాకు అన్నయ్య అయితే ఆనందరావుగారి దగ్గర ఎందుకు పెరిగాడు.... ఆయనకూ నాన్నగారికీ పచ్చగడ్డివేస్తె భగ్గుమని మండిపోయేటంతా శత్రుత్వం వుంది కదా"
వసుమతి అంతరంగం మూగదానిలా మారిపోయింది మనసు బాధతో మూలిగింది.
ఏ  విధంగా తన గతాన్ని కన్న కొడుక్కు చెప్పుకోవాలి? కట్టుకున్న భర్త ద్వారా మోసపోయానని చెప్పాలా? అదివిని తన కొడుకు తనను క్షమిస్తాడా?
గుండెను ఎవరో నలిపివేస్తున్నంత బాధ...
"బాబూ... నన్ను క్షమించరా.... ఏ తల్లికీ ఇటువంటి పరిస్టితి రాకూడదు. దోషిగా నీ ముందు తలదించుకుంటున్నాను. ఈ తల్లిని క్షమించగలవా?"
ఆ మాటలతో అతని హృదయం వేయి శకలాలు అయింది.
పిడికిళ్ళు బిగుసుకున్నాయి...
ఇప్పుడు ఆ భయంకర నిజాన్ని విన్న తను ఆవేశపడి ప్రయోజనం ఏముంది? తన తల్లి సహృదయురాలే కావచ్చు. కానీ తన తల్లి జయచంద్ర చేత తాళి కట్టించుకున్న ఇల్లాలు. మరి అతనిలో కాకుండా మరెవరితోనో వున్న సంబంధం వలనే రవితేజ పుట్టాడా ? తన తల్లి సచ్చీలతనే ఏ కొడుకయినా కోరుకుంటాడు.... మరిప్పుడు తనేంచేయాలి? తన తల్లిని ద్వేషించాలా!
గుండెలో రగులుతున్న అగ్నిజ్వాలలను అదుపుచేసుకొనలేక అభినయ్ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
"బాబూ... ఆగరా.... నామాట వినరా"
ఆమె పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.
వసుమతి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పోయింది. మానసిక వత్తిడికి గురి కావడం వలన మరలా ఆమె స్పృహ కోల్పోయింది.
 
                       *    *    *    *
వసుమతి హాస్పిటల్ పాలైందని తెలిసిన ఆనందరావు కొడుకుతో కలసి ఆమెను చూడడానికి వచ్చాడు. అపస్మారక స్థితిలో బెడ్ మీదనున్న ఆమెను చూసి అతని మనసు విలవిల్లాడింది.
డాక్టర్ ఆమెకు ట్రీట్ చేస్తున్నాడు.
ఆమెలో రక్తహీనత హెచ్చుగా వుంది. రక్తం ఎక్కించడానికి బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేశారు. జీరో పాజిటివ్ వచ్చింది. ఆమె గ్రూప్ రక్తం రెండు బాటిల్స్ మాత్రమే వుండటంవల్ల ఫ్రెష్ బ్లడ్ సెల్స్ వున్న బాటిల్స్ కోసం బ్లడ్ బ్యాంకు ఫోన్ చేశారు.
తండ్రి పడే వ్యధను చూస్తూ రవితేజ ఉండబట్టలేక అడిగాడు.
"ఆమెకోసం నువ్వు ఎందుకు మధనపడుతున్నావో నా  కర్ధం కావడంలేదు. న ప్రాణం కాపాడింది అని మానవతా దృష్టితో చూడడానికి వచ్చాం. డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారుగా... ఇక ఆమెను భగవంతుడే కాపాడాలి. మనం వెంటనే వెళ్ళిపోకపోతే ఏ క్షణానయినా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. మీమాట కాదనలేక వచ్చాను... వెళ్ళిపోదాం పదండి నాన్నా"
"అలాగే వెళదాం కానీ... ఈ తండ్రి మాట కాదనకుండా ఒక పని చేయగలవా?"
"ఏమిటో చెప్పండి"
"నీ బ్లడ్ గ్రూప్ టాలీ అయితే నీ రక్తదానంతో ఈ తల్లిని బతికించు బాబూ."
తండ్రివైపు విచిత్రంగా చూశాడు.
"నా శత్రువు తల్లిని నా రక్తంతో బతికించమంటున్నారు. మీ మాటలు నాకేమీ అర్ధం కావడంలేదు. ఇది మీరు కని పెంచిన శరీరం. నా తల్లి ఎవరో నాకు తెలియదు. తల్లి ప్రేమకు దూరమయిన దురదృష్టవంతుడిని. ఒకసారి నన్ను కాపాడటానికి తన ప్రాణాలను అడ్డుపెట్టింది. ఈ తల్లి అందుకోసం అయినా మీ కోరిక నెరవేరుస్తాను. ఈ తల్లికి సాయపడి వచ్చే జన్మలో అయినా నాకు తల్లి ప్రేమను ప్రసాదించమని దేవుణ్ని ప్రార్దిస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS