Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 54

    జరిగిన సంఘటనలవల్ల  నాస్తికత్వం మీద నా నమ్మకం మరింత  బలపడుతోంది.నువ్వుత్త పిరికిదానివి. భయమనేది మానసికరోగం. ఎన్నెన్నో జబ్బులు పడ్డానుగానీ భయమనే  ఈ జబ్బు  మాత్రం  నా మీద పడడానికి భయపడుతూనే వుంటుంది" అన్నారు.

    "అబ్బా! హైదరాబాద్ లో  ఏం జరిగిందో  చెప్పండి" అన్నాను.

    "చెప్తాను సరోజా!" అని ప్రారంభించి  అంతా  వివరించారు.

    నాకు చెప్పలేనంత ఆశ్చర్యం, ఆవేశం కూడా కలిగింది.

    "అంత దారుణమా?" అన్నాను.

    "అవును సరోజా! అంతే. చేసేవి మాఘపు ఆదివారాలు, దూరేవి దొమ్మిరి గుడిశెలు  అన్నట్టే. మన దేశనాయకులు  కూడా వాళ్ళు అనుకున్నది అక్షరాలా చేసేస్తారు. పైకి  మాత్రం శ్రీరంగనీతులు  చెప్తారు.

    నేరం ఎదుటివాడిదేనని నిరూపించే శక్తివారి కుంది. అది ఏ శక్తి అంటావు? అధిరాకశక్తి. చెయ్యకూడని పనులు చేసెయ్యడం, అడ్డమైన దేవుళ్ళకీ మొక్కేయడం, ఆ మొక్కులతో వాళ్ళ సకల పాపాలూ  తీరిపోతాయనే మూఢవిశ్వాసం. అందుకనే చేస్తున్న పన్లకి  భయపడి, దేవుళ్ళని  ఆరాధించడం. అదే వాళ్ళలో ఆవరించిన పిరికితనం అంటాన్నేను.

    ఏం చెయ్యగలిగారు  నన్ను? అతి కష్టంమీద 36 గంటలు  జైల్లోవుంచారు. ఉంచిన ఆ కొద్ది సమయంలోనైనా  ఒక్కచోట వుంచలేక పోయారు.

    ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇంకోచోట  ఇలా తిప్పలుపడ్డారు. వాళ్ళు చేస్తున్నది అన్యాయం అని వాళ్ళకి తెలుసు. ఆ అన్యాయాన్ని  ఖండించడం కోసమే మా పోరాటం అని కూడా తెలుసు.

    ఒకవేళ  నన్ను వాళ్ళు సంవత్సరాల  తరబడి  బంధించినా నాకేమీ  బాధలేదు. కారణం నా ఒంటెత్తు  గుణం  జగద్విదితం.

    నేను నేను. నేను నాస్తికుణ్ణి. అంటే దేవుడనే  భావానికి  బానిసని కాను. స్వతంత్రుడ్ని. దోపిడీ దొంగల ప్రభుత్వం  జరుపుతున్న  తెలుగు మహాసభల్ని బహిష్కరించండని  బాహాటంగా  చాటినందుకు నన్ను అరెస్టు చేశారు. నా విరసం జెండాను దొంగిలించారు.

    నాతోపాటు నా సహచరుల్నీ, విద్యార్దుల్నీ కూడా  కస్టడీలోకి  తీసుకున్నారు. చెరబండరాజు, రంగనాధంలను  కొట్టారు. పైగా నేను నక్సలైట్ నని కూడా అన్నారు.'కాదు. నక్సలైట్ల కవిన'ని అన్నారు.

    'నువ్వు నాస్తికుడవ'ని అన్నారు. కాబట్టే హాయిగా  బతుకుతున్నాన'న్నాను" అని చెప్పారు.

    "అది సరేకానీ. వాళ్ళు జైల్లో మిమ్మల్ని ఏమైనా చేశారా?" అని అడిగాను.

    "అంత దైర్యం వాళ్ళకి వుంటే ఇప్పుడు  నన్ను విడుదల చేసి వుండేవారు కారు సరోజా! పైగా ఒక జైల్ ఆఫీసరు నాకు డ్రింక్ ఆఫర్ చేశాడు. థాంక్స్ చెప్పి వద్దన్నాను.

    భారతదేశ చిత్రపటంలో  ఆంధ్ర విప్లవ రచయితల  సంఘం  ఇప్పటికే ఒక ప్రముఖ స్థానం సంపాదించింది" అన్నారు.

    "అవచ్చండి. కాదని  నేను అనలేదు. మీ రొక్కరేనా  పేరుపడిన  కవి. ఇంకా  ఎంతమందిలేరు? వాళ్ళంతా  మీలాగే ప్రభుత్వాన్ని  ఎదిరిస్తున్నారా?" అని అడిగాను.

    "నాతోపాటు ఎదిరిస్తామనే అన్నారు సరోజా! తర్వాత వాళ్ళకి ధైర్యం చాలలేదు. అయినా నీకెందుకీ గొడవలన్నీ చెప్పు. నేను వచ్చేశానుగా. నీకు ఇంటిమీదా, పిల్లల మీదా, నా మీదాకంటే  రాజకీయాల మీదా, ఇలాంటి విషయాలమీద ఇంట్రస్ట్ ఎక్కువ. అదేవద్దు. నీ పిల్లల్ని చూసుకొని నువ్వు హాయిగా వుండు. నా తిప్పలేవో నేను పడతాను" అన్నారు.

    "మీ తిప్పలు  మీరు పడుతూనే వున్నారు. నేను ఏనాడైనా కాదని కానీ, వద్దనికానీ  అన్నానా? అడ్డుతగిలానా? ఒకటి మాత్రం  మరిచిపోతున్నారు. తిప్పలు పడుతూన్నది  మీరే అయినా, బాధ మాత్రం నేను కూడా పడుతున్నాను. మళ్ళీ మీరు కంటపడేవరకూ  నరక బాధ అనుభవించాను" అన్నాను.

    "నరకం ఎలా ఉంటుందో నీకు  తెలుసా ఏమిటి?" అని అడిగారు.

    "ఇంతకన్నా  వేరే నరకం వుందనీ, వుంటుందనీ  అనుకోనక్కర్లేదండీ.

    మీ మొండితనంతో  చస్తున్నాను.

    భయమనేది  ఏ కోశానాలేదు. ఐనా మీరొక్కరు కంకణం కట్టుకున్నందు వల్ల  జరిగే  పన్లా అండీ ఇవి" అని అడిగాను.

    "నూతిలో  కప్పలావున్న  నీకు నే ఒక్కణ్ణో  లేక  ఎందరమో  ఏం తెలుసు సరోజా!" అన్నారు.

    "సరే. నాకేమీ తెలీదండి. తేసుకుననీ, నేను తెలివైన దానిననీ ఎప్పుడూ అనలేదు. ఏ విషయమైనా తెలుసుకోవడంలో  తప్పులేదని మాత్రం అంటాను. అందులోనూ మీ విషయాలు  తెలుసుకోవడం  నా ధర్మం.

    ఆంధ్రదేశ ప్రజలకి  మీరు  మహాకవి కావచ్చు. నాకు మాత్రం మొగుడే. ఆ సంగతి మరచిపోకండి. మీ మంచిచెడ్డలూ, క్షేమం  నాకు ముఖ్యం. మిమ్మల్నలా  వదిలేసి  వుండమంటే నేను వుండలేనండీ.

    ఇక మీద మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోపాటు  నేను కూడా వుండాల్సిందే. ఇంట్లోకూర్చొని, మీరు ఏమైపోయారో, లేక ఏమైపోతారో అన్న బెంగతో నేనీ బాధపడలేను. మీతో వస్తానని  అంటున్నానే కానీ, నావల్ల మీకేమిటి కష్టం చెప్పండి.

    మీ పన్లకీ, మీ ఆదర్శాలకీ, మీ అభిప్రాయాలకీ నేను ఏనాడైనా అడ్డు తగిలానా?

    మీ విషయంలో ఏమీ పట్టించుకోకుండా  ముక్కు  మూసుకొని  కూర్చోమంటే  ఒప్పుకోను" అంటూ ఏడ్చేశాను.

    "చెప్పిందే పదే పదే  ఎన్నిసార్లు చెప్తావు సరోజా! నువ్వు ఏ పనయినా చెయ్యి, ఏమైనా అను. కానీ ఏడవకు. ఆ ఏడుపంటే  నాకు పరమ అసహ్యం. వెళ్ళి కాఫీ  తీసుకురా. ఒకసారలా వీధిలోకి వెళ్ళివస్తాను" అన్నారు.

    కాఫీ తాగాక, "నేనొచ్చేసరికి  ఆలస్యం అయితే కావచ్చు. బెంగపెట్టుకోకు. ఎక్కడున్నానా  అని ఫోనుల వర్షం కురిపించెయ్యకు" అన్నారు.

    "ఫలానా చోట  వుంటానని  చెప్పే వెళ్ళొచ్చుగా" అన్నాను.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS