Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 53


    క|| శాస్తుర్లట యీనీఁచుఁడు
        పాస్తొత్తులమగఁడు వీనిపరువేమో కా
        కాస్తంత నస్య మడిగిన
        నాస్తే యని పలుక వీనినాలుక పీఁకా.        567
    
    ఇట్టి చెట్టఱికమునకు నేవగించి వేఱొకకవి దూణి చెప్పిన పద్యము-
    
    గీ|| అహహ తిరుమలవంశంబు నడవిఁ గలిపి
        బుక్క పట్టణ మంతయు బూది చేసి
        కొంటెకూఁతలు నేరుచుకొంటి వౌర
        కుటిలతిరుమలతాతన్న! కొంటెదున్న.        568
    
    తాతాచార్యుఁడు వైద్యము చేయునఁట! రోగము కుదుర్చుకొన్నవాఁడై యచ్చన్న యనునొకఁడు తా నిచ్చెద నన్న యీవి యీయకపోఁగా నీ పద్యము నీ యాచార్యుఁడు చెప్పెను-
    
    క||  పచ్చడము దుప్పటాయెను
        విచ్చలవిడి తులసిపత్రి విడియం బాయె
        ఱచ్చల నగుబా టాయెను
        అచ్చన్నా! నీదుకీర్తి యట్టిట్టాయె.            569
    
                        తురగా - వెంకమరాజుగారు
    
    ముదిసి ముప్పునఁ బడినప్పు డీపద్యము చెప్పుకొన్నాఁడఁట! ఈయన స్వర్ధస్థుఁ డయి యిప్పటికి  నిర్వది యేండ్లు కావచ్చినది.
    
    ఉ|| దార యడంగెఁ బిమ్మట నుదారుఁడు రెండవపట్టి తీఱె దృ
        క్పారము దూర,మయ్యె నధికం బగుదేహవటుతవ మాఱె నా
        హారము వండిపెట్టుటకు నాఁడదియుం గఱవయ్యె నేఁటి కీ
        దారుణకష్ట ముంచితిగదా నతలోకవిపన్ని నారకా!        570
    
                   మాడభూషిప-వేంకటాచార్యుఁడు    
    
    ఈయన యిప్పటికి ముప్పదియేండ్లకు ముందు వైకుంఠవాసియయ్యెను. 'విద్యా నభినవపండితరాయ'లని యీయన బిరుదనామము. ఈయన తర్క వ్యాకరణములందు గొప్ప పండితుఁడు. సంస్క్రుతాంధ్రములందు గొప్పకవి. శతావధానా ష్టావధాన చాతుర్యమం దీయన జగజెట్టి. ఏకసంధాగ్రాహి. పనప్పాకం అనంతాచార్యులుగా రీయన ప్రాణమిత్రము. అనంతాచార్యులుగారి దగ్గర కొకప్పు డవలిప్తుఁ డగు నొక యరవదేశపు విద్వాంసుఁడు వచ్చి స్వర చితము లయినశ్లోకములను జదువుచు నర్దసారస్యము వివరించుచుఁ బ్రశంసించుకొనుచు నుండఁగా వేంకటాచార్యులుగారు వినుచునుండిరి. పదిశ్లోకము లయినవి. ఆత్మౌత్కృష్ట్య ప్రశంసావరాయణుఁడుగా నున్న యాపండితునితో "నయ్యా! యీ శ్లోకములు పిన్ననాఁడు మానాయనగారు నాకుఁ జెప్పిరి. ప్రాచీన కవికృతములయిన యీశ్లోకముల ననంతాచార్యులుగా రెఱుఁగరుగదా యని యాత్మీయములుగాఁ జదువ నారంభించితిరా?" యని యడ్డు పలికిరఁట. కుపితుఁడై వెడనవ్వు నవ్వి యా యరవదేశపుఁ బండితుఁడు వేంకటాచార్యులు గారి నెఱుఁగక "యేది నీకు వచ్చునేని చదువుము. రచించినవాఁడను నేనే యిక్కడ నుండఁగా నాతోనే యిట్లు పలికెద వేమయ్యా! ఎవ్వరవు నీవు" అని తుటారించెనఁట! 'ఇదిగో చదువుచున్నా'నని వేంకటాచార్యులుగా రన్నింటిని నేకసంధాగ్రహణమున నప్పగించిరి. వెల్లబోయి యా పండితుఁడు వేఁడుకొనెనఁట! 'మీ మహాత్మ్యము నెఱుఁగనైతిని మన్నింపుఁ'డని. ఈ విషయ మనంతాచార్యులుగారివలననే నేను విన్నాఁడను. వేంకటాచార్యులుగారు రచియించిన రామావధూటి తారావళినుండి కొన్ని పద్యములు --
    
            రామావధూటి తారావళి
    
    సీ||  శ్రీరాధాకాకుచాశ్లేషసంతోష
            వివశుఁడౌ శ్రీకృష్ణవిభువ కెరఁగి
        సకల విద్యావ్యాప్తిసాధనభూత యౌ
            శారదాంబకు నమస్కారము లిడి
        యైహికానంద ప్రవాహపూరక మైన
            శృంగారరస మాత్మ నిరవుకొలిపి        
        మదనసామ్రాజ్య సింహాసనారూడులై
            పురణించురసిక శేఖరుల నెంచి
    
    గీ|| వివిధరతితంత్ర పాండిత్యభవమహాను
        భవములె పదార్ధములుగ నేర్పణిచి సీస
        పద్యనక్షత్రమాలిక భావవిదుల
        మనము లలరంగఁ గూర్తు రామావధూటి.        571
    
    సీ||  చక్కని కెమ్మోవి సరసంపుఁబలుకులు        
            బారైనకురులు పొల్పారు బొమలు    
        సొగసైనచూపులు సోగకన్నులు తళ్కు
            దేరుచెక్కులు కాంతు లూరునొసలు
        తీరైనచుబుకంబు దిద్దినశ్రీచూర్ణ
            లేఖయు మృదువైన లేఁతనగవు
        కుదురైనరదనముల్ గుమ్మబుగ్గలు నంద
            మగునాస నాసికామండనములు
    
    గీ||  కలిగి చెలువొందునీమోముఁ దలఁచి వలచి
        తాల్మి చెడి బెట్టుకై కొంతధైర్య మూని        
        గుట్టు చెడకుండఁ గాలంబు నెట్టుచుంటి
        మరునిరతనాల పేటి రామావధూటి.        572
    
    సీ||  కనుమూసినంతలోఁ గలకల నవ్వుచు
            వచ్చి కౌఁగిటఁ జేర్చి  ముచ్చటాడి
        మోము మోమునఁ జేర్చి ముద్దుల నూరార్చి
            సారెసారెకు మోవి చప్పరించి
        నన్నిట్టు లెడబాయ నాయమా మీకని
            యతినిష్టురము లాడునంతలోన
        మేల్కని నలుదెసల్ మిఱుకుచుఁ జూచి క
            న్నీరు మున్నీరుగా నెగడఁ బ్రతిది
    
    గీ||  నంబు రాత్రులు నిటులుండె నా యవస్థ;
        యిట్లు కలలోన నన్నలయించకుంటె
        వారిజాతాక్షి నాతోడ వచ్చి యిట్లనె
        మమతతో నుండరాదె రామావధూటి.        573
    
    సీ||  నీమోము నీగోము నీమోవి నీతావి
            నీసౌరు నీతీరు నీకుఁ దగును
        నీ చనుల్ నీకను ల్నీకౌను నీమేను
            నీతొడ ల్నీనడల్ నీకుఁ దగును
        నీగుట్టు నీబెట్టు నీకురుల్ నీమరుల్
            నీచెల్మి నీతాల్మి నీకుఁ దగును
        నీతళ్కు నీబెళ్కు నీనీటు నీగోటు    
            నీహొయల్ నీలయల్ నీకుఁ దగును
    
    గీ||  నీకుఁ దగినట్టిపురుషుఁడ నేన నాకుఁ
        దగినసుందరి వీవ కాఁదలఁచి చాల
        వలచి యన్యోన్య మతనుని గొలిచి మిగుల
        మంచితో నుంటిమిగదె రామావధూటి.        574
    
    సీ||  ఒకనాఁటికలలోన సకియ నీ కాలిపా
            జేబులో జందెంబు చిక్కినట్లు
        ఒకనాఁటికలలోన సకియ నీ చేతిపో
            చీలోన నాకురుల్ చిక్కినట్లు
        ఒకనాఁటికలలోన సకియ మెల్లన నాదు
            గూబలో కొక్కొరో కూసినట్టు    

    గీ||  లిన్ని విధముల నచ్చట నున్న నాఁటి
        వన్నె లన్నియుఁ గలలోన వచ్చి యిచట
        గాసి గూర్చుచున్నవి నిన్నుఁ బాసి యెట్లు
        మరులు నిల్పఁగనేర్తు రామావధూటి.        575


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS