Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 53

పట్నంలో వున్న ఒక పెళ్ళిళ్ళ పేరయ్య ధర్మమా అని కొత్తగా ఆయన తెచ్చిన సంబంధం కుదిరేటట్లు అనిపించింది. ఫోటోలు తప్ప పిల్లనీ, పిల్లవాడినీ ఒకరినొకరు చూసుకోలేదు. ఫోటోలు చూసుకుని పరస్పరం ఒకరినొకరు నచ్చటం జరిగింది. పిల్ల లావుగా వున్నంత మాత్రాన నాకేమీ అభ్యంతరం లేదని చెప్పాడు పెళ్ళికొడుకు.
మధ్యవర్తి అయిన పెళ్ళిళ్ళ పేరయ్య ఆ తరువాత ఒక కబురు అందించాడు. అబ్బాయికి శలవు లేనందువల్ల పిల్లను చూడటానికి పెళ్ళి విషయాలు మాట్లాడటానికి కుదరదుట. అతనికి ఒక ముసలి తల్లి తప్ప ఎవరూ లేరుట. మీరు అమ్మాయిని పట్నం తీసుకువస్తే అక్కడ మీరంతా ఒకరినొకరు చూసుకోవటం, పెళ్ళి మాటలు మాట్లాడుకోవటం అంతా ఏకకాలంలో పూర్తి అవుతుంది. ఖాయంగా ఈ పెళ్ళి కుదురుతుంది... ... ...
ఆ మాట పెళ్ళిళ్ళు పేరయ్య గట్టిగా చెప్పటంతో వీళ్ళ నలుగురూ పట్నం బయలుదేరటం జరిగింది. మధ్యలో అనుకోని ఈ ఆపద వచ్చి పడింది.
ఇప్పుడు పట్నం వెళ్ళి చేసేదేమీ లేదు.
చూస్తూ చూస్తూ వెనుతిరిగి వెళ్ళలేరు.
ఇక్కడే వుండాలి.
ఇక్కడే వుండాలి అంటే ఎక్కడ వుండాలి? ఏం చెయ్యాలి?
శ్రీమహాలక్ష్మిని ఎలా వెతకాలి.
శ్రీమహాలక్ష్మి కనపడుతుంది అన్న గ్యారంటీ ఏముంది?
అప్పటికి శ్రీమహాలక్ష్మి కనపడకుండా పోయి రెండు గంటలయింది.
వకుళాంబ పయికే ఏడిస్తే రామానుజాచారి లోలోపలే ఏడుస్తున్నాడు.
ఇంత వరకూ ఆందోళన వుండటం వలన, అసలు విషయం గుర్తుకు రాలేదు రామానుజాచారికి.
"నేనేం తప్పు చేశాను భగవంతుడా! నాకీ శిక్ష విధించావు!" అని వాపోతూంటే, అప్పుడు ఆయనకి అసలు విషయం గుర్తుకి వచ్చింది.
"దీనికంతా కారణం నువ్వు!" అరిచినట్లే అన్నాడు రామానుజాచారి.
"నేనా! నేనేం చేశాను?" తెల్లబోయింది వకుళాంబ.
"నువ్వే చేశావు! మన శ్రీమహాలక్ష్మి కనబడకుండా పోవటానికి కారకురాలివి నువ్వే! నీదొక్కటే కన్న కడుపు. వూళ్ళో వాళ్ళని కడుపులు కావు ఎండిన చెరువులు. పిల్లవాడి ప్రాణం మీదకి వస్తే, మోహనరావు అయిదువందలూ తీసి యిచ్చి 'అర్జంట్ గా వెళ్ళి, బాబును రక్షించే ప్రయత్నం చెయ్యండి' అని చెప్పాడు. సరేనని మాట యిచ్చాను. నీవేమో ఆ అయిదు వందలూ పుచ్చుకుని,
నారు పోసినవాడు నీరు పొయ్యడా....ప్రాణం రక్షించేది భక్షించేది ఆ భగవంతుడే అని__ ఆ పిల్లవాడికి ఆయుష్షు వుంటే ఎలాగో అలా బ్రతుకుతాడు__ మనం ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళినా ఈ సరికే ఆ పిల్లవాడు హరీ అని వుంటే టాక్సీకి డబ్బు తగలెయ్యటం తప్పించి మనం తొందరగా వెళ్ళి చెయ్యగలిగింది ఏమీలేదు.... అని ఏమేమో అన్నావు. టాక్సీలో వెళ్ళనివ్వకుండా చేశావు.
ఆ పాప ఫలితం వూరికినే పోతుందా! ఇదిగో ఇపుడు ప్రత్యక్షంగా కనపడుతున్నది. మన అమ్మాయి మనకి కనపడకుండా పోతేనే ఇంత బాధగా వుందే! ఒక్కగానొక్క బిడ్డ, ఆ అబ్బాయి మరణిస్తే ఆ దంపతుల బాధ మానవ మాత్రులం కాదు కదా! ఆ దేముడు కూడా తీర్చలేడు.
టాక్సీ ఎక్కినట్లయితే ఈ సరికి పట్నం వెళ్ళిపోయేవాళ్ళము. ఆ అబ్బాయికి వార్త అందించేవాళ్ళం. మన అమ్మాయి పెళ్ళిచూపుల తతంగం పూర్తి అయ్యేది. దీనికంతటికీ కారణం నువ్వు. నీ మాటకి తాన తందానా అన్నందుకు, కారణం నేను కూడా. ఎంతో కొంత నేనూ తప్పుచేశాను.
ఇంక మనమంటూ చేసేదేమీ లేదు. ఇలాగే ఎదురు బొదురుగా కూర్చుని ఏడుద్దాము. ఈ వూళ్ళో చాలామంది మంచివాళ్ళు కాదుట. మన అమ్మాయిని మోసగించి అమ్మేసి ఉంటారని ఇందాక ఎవరో అన్నారు. ఇంక మన శ్రీమహాలక్ష్మి మనకు కనపడదే" అంటూ అంతవరకూ పెద్ద కంఠంతో అరచిన రామానుజాచారి, చివరమాటలు అంటూండగా తగ్గిపోయి, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS