నేను రాంసింగ్ కొన్ని టైమింగ్స్ గుర్తులు కోడ్స్ గుర్తుపెట్టుకోటానికి అనుకున్నాము. ఎవరిదోవన వాళ్ళం బైటికి వెళ్ళినప్పుడు అనుకున్న టైముకి మళ్ళీ కలవాలి. లేకపోతే ఒకరం ప్రమాదంలో చిక్కుకున్నట్లు అర్థం. బైటికి వెళ్ళేముందు ఎవరం ఏ పనిమీద ఎక్కడికి వెళుతున్నాము. టైము...వగైరాలు, చెప్పుకొని వెళ్ళటం...ఆపై తూచ తప్పకుండా అనుకున్నది పాటించటం.
సరీగ ఏడు గంటలకి రాంసింగ్ మేమున్న హోటల్ రూమ్ కి రావాలి. ఏడుకి కాస్త అటు ఇటు అయినా ఫరవాలేదు.
ఏడున్నర.
రాంసింగ్ రాలేదు.
రాంసింగ్ రాక ఎందుకు ఆలశ్యం అయింది? రాంసింగ్ తెలివితక్కువగా ఏదన్నా ప్రమాదంలో పడలేదుకదా?
పదినిమిషాలు తక్కువ ఎనిమిది రాంసింగ్ రాలేదు. "ఏమయిపోయావు యార్!" అని బేర్ మనేలా నా మనసు మారిపోయింది. ఇంక ఆగలేక రాంసింగుని వెతకటానికి బైలుదేరే వుద్దేశ్యంతో డ్రస్ మార్చుకోటం మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడు భళ్ళున తలుపు తోసుకుని పరుగులాంటి నడకతో రాంసింగ్ లోపలికి వచ్చాడు.
ఎన్నో ఏళ్ల తర్వాత విడిపోయిన ప్రాణ స్నేహితులు కల్సుకున్నట్లు ఇరువురం వక్క ఉదుటున బిగి యార కౌగిలించుకున్నాము. పట్టరాని ఆనందంతో "లలలా లలలా, లులులూ లులులూ" అని పాడుతూ గిరగిర తిరిగాము.
కాసేపాగి.
"ఇంతాలశ్యం అయిందేం భాయ్?" అడిగాను రాంసింగ్ ని.
"చెపుతాను చెపుతాను. నువ్వు వెళ్ళిన పని ఏమయింది? కాయా పండా?"
"ఇప్పుడే పండటం ప్రారంభిస్తున్నది. కావాల్సిన విషయాలు సేకరించుకు వచ్చాను. మరి నువ్వు వెళ్ళిన పని?"
"ఒక పనికోసం వెళ్ళి మరోపని సాధించుకు వచ్చాను."
"ఏమిటది?" ఆతృతగ అడిగాను.
"నీవు చెప్పింది ఆరా తియ్యటానికి వెళుతూంటే రంగురంగు దుస్తులు ధరించిన వాళ్ళు యిద్దరు కనిపించారు. వకడు పొడుగు మరొకరు లావుగ వుండి పక్కపక్కన నడుస్తుంటే వాళ్ళని పరీక్షగా చూడమని చెప్పావు కదా! వాళ్ళలా వుండేసరికి కళ్ళార్పకుండా వాళ్ళనే చూస్తూ రెండడుగులు వేశానో లేదో లావుపాటి వాడి విగ్గు జారిపోయింది. అంతే యింక అనుమానం వేసి వాళ్ళని ఫాలో అయ్యాను. ఆ మారు వేషగాళ్ళు ఎవరో తెలుసా?"
"అక్కరలేదు భాయ్! నాకర్థమైంది ఇన్ స్పెక్టర్ వర్ధనరావు దిగ్రేట్. అహోబిలం దిహెడ్" అంటూ పక్కున నవ్వాను.
"అరె యార్ ఎలా తెల్సుకున్నావు?" ఆశ్చర్యపోయాడు రాంసింగు.
"పొట్టిపొడుగు పక్కపక్కన వుండబట్టి. సరే వాళ్ళ మాటలు ఏమన్నా విన్నావా? ఎక్కడినుంచి వస్తున్నారు ఎక్కడికెళ్ళి ఆగారు... ఊ...క్విక్ వివరంగా చెప్పు."
"వాళ్ళిద్దరూ వకింటి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఆ తర్వాత వేషాలు తీసేసి మామూలు దుస్తులతో బైటికి వచ్చారు. "రేపు తొమ్మిది గంటలకు వెళ్ళాలి గుర్తుపెట్టుకో!" అనటం విన్నాను. ఎక్కడికో ఏమిటో తెలియదు." రాంసింగు వివరించాడు.
"తెలుస్తుంది." తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాను.
"ఎలా?" రాంసింగ్ అడిగాడు.
"రేపుదయం తొమ్మిది గంటలకి మనం వాళ్ళని ఫాలో అయి వెళదాం. వాళ్ళు మారువేషాలతో ఎక్కడికి వెళుతున్నది తెలుస్తుంది."
"ఈ ఐడియా బాగుంది. ఇంత చిన్న ఆలోచన నాకు రాలేదు. వాళ్ళు మారు వేషాలలోనే ఉన్నారు. మనమూ మారువేషాల్లోనే వున్నాం. కాబట్టి వేషాల సమస్యే లేదు. రేపు సరదాగా ఇన్ స్పెక్టర్ గారి వెనకనే వెళ్ళొద్దాం అరె యార్! నేనెక్కడికి వెళ్ళింది, ఏం చేసుకొచ్చింది చెప్పాను. మరి నీసంగతేంటి? ఎక్కడికెళ్ళావ్? ఏం సాధించుకొచ్చావ్? అర్జెంట్ గా చెప్పు" నా భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగాడు రాంసింగ్.
"9696 కారు నెంబర్ గురించి ఎంక్వయిరీ చేస్తూ ఆ కారు నెంబర్ ఎవరిదో తెలుసుకున్నాను. జాన్ అండ్ జాన్సన్ కంపెనీ పొప్రయిటర్ జాన్ డేవిడ్ ది ఆ కారు. ఆరోజు ఆ కారులో వున్నది జాన్ డేవిడ్. జాన్ డేవిడ్ కి, సుస్మితకి ఎలా పరిచయమో నాకర్థం కాలేదు. ఎలాగూ మారువేషంలో వున్నా కదాని జాన్ అండ్ జాన్సన్ కంపెనీకి వెళ్ళాను. సుస్మిత కోసం వచ్చానని చెప్పాను. జాన్ డేవిడ్ దగ్గర ఆమె స్టెనోగ వుంటున్నదని, వాళ్ళింట్లోనే గెస్ట్ హౌస్ లో వుంటున్నదని...ఆమెకెవరూ లేరని... ఇలాంటి విషయాలు కొన్ని ఆఫీసులోనికి ప్యూన్ ద్వారా తెలుసుకొన్నాను. సుస్మిత ఇక్కడ ఉండటమేమిటో నాకేమీ అర్థంకావటం లేదు. అంతవరకు తెలుసుకొని వచ్చేశాను. సుస్మితని కలుసుకుంటేగాని అసలు విషయం తెలీదు. కాని దానికో అడ్డంకి వుంది." అంటూ ఆగిపోయాను.
"ఏమిటా అడ్డంకి?"
"అది అంత తేలిగ్గా చెప్పేదికాదు. ఇప్పుడు నన్నేమీ అడక్కు. చెప్పాలి అంటే చాలా కథ చెప్పాలి." అన్నాను.
"చెపితే మనసులో బాధ తగ్గుతుంది. నీకు రాని ఆలోచనలు నాకేమైనా రావచ్చు. నాకు చెప్పటంవల్ల నష్టం అనుకుంటే చెప్పొద్దు యార్! రాంసింగు చిన్నబుచ్చుకొన్న మొహంతో అన్నాడు.
