Previous Page Next Page 
ఆగ్నిశ్వాస పేజి 53


    "హలో" అవతలివేపు నుంచి వినిపించింది.


    "నాకు జయచంద్ర కావాలి"


    "ఎవర్నువ్వు?"


    "శశాంక"


    కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దం.


    "స్పీకింగ్" అక్కడ జయచంద్ర ఉద్వేగాన్ని ఎంతో నిగ్రహించుకుంటూ మాటాడుతున్నదీ శశాంకకి తెలీదు. "గుడ్... బలంగా దెబ్బతీసావు"


    "ఇంకా ఎక్కడ... ఇది ప్రారంభం మాత్రమే"


    "ఎవర్ని ఢీకోవాలని ప్రయత్నిస్తున్నావో తెలుసా... ఒక చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న తిరుగులేని చక్రవర్తిని నేను."


    "ఈ రోజుతో నీ దశ తిరిగిందిగా"


    "అంటే నీకు మూడిందీ అని అర్థం"


    "మొండివాడ్ని. కాబట్టే రాజుకన్నా బలవంతుడ్ని"


    "రోజులు లెక్క పెట్టుకుంటూ గడుపు"


    "మిస్టర్ జయచంద్రా" శశాంక కంఠంలో చెక్కు చెదరని నిశ్చంత... "లెక్కపెట్టి కూడికలు చేయాల్సింది నీవా లాభాన్ని ఆశించేవాడు. నాలా ఏ నష్టానికైనా సిద్ధపడినవాడికి నిన్నా_ఈ రోజు - రేపూ... అన్నీ ఒక్కటే"


    "అంటే ముందే ప్రిపేరయ్యావన్నమాట"


    "ప్రిపేరయ్యాను కాబట్టే ముందు సాధ్యమైనంతగా నిన్ను చావుదెబ్బ తియ్యాలనుకున్నది. చూడు జయచంద్రా... బ్రతకాలి... బ్రతుకుతూ క్షణం క్షణం పెరిగిపోవాలీ అనుకునే నీలాంటి వాడికి బ్రతుకు తీపి తప్ప_ నన్ను నీ బెదిరింపులేమీ చెయ్యలేవు. చెప్పు... నా భార్యని ఎందుకు చంపించావు" శశాంక కంఠం క్రమంగా కఠినంగా మారిపోయింది. "ఏం తప్పు చేసిందని... నీ ప్రపంచంతో ఏ సంబంధమూ లేని నా భార్య మీద ఎందుకలా కక్ష తీర్చుకున్నావు"


    జయచంద్రలాంటి ఓ మాఫియా లీడర్ మాట్లాడుతూ కూడా ఆలోచిస్తాడని, ఆలోచిస్తూనే అనుకున్నది ఆచరణలో పెడతాడని వూహించని శశాంక అప్పటికే ఓ గేంగు తన ఇంటిని చుట్టుముట్టిందని తెలుసుకోలేకపోయాడు.


    ఆవలి వేపు నుంచి 'క్లిక్' మన్న చప్పుడు...


    ఆ చప్పుడ్ని అధిగమిస్తూ అతడి సమీపం నుంచి ఓ తూటా దూసుకు పోయింది.


    మరుక్షణం కిటికీ అద్దం పగిలింది.


    అంతే! ప్రమాదాన్ని పసిగట్టిన శశాంక నేలపైకి దొర్లాడు.


    రెండు నిమిషాల పాటు ఆ భవంతి తుపాకీ మోతతో దద్దరిల్లింది.


    మెరుపు వేగంతో తనను తాను రక్షించుకుంటున్న శశాంక మరో నిమిషం ఆలస్యమైతే ఏమయ్యేవాడో.


    అప్పటికే అవినాశ్ తన సిబ్బందితో అక్కడకు వచ్చాడు. వచ్చింది అక్కడ జరుగుతున్న పోరాటం గురించి తెలిసి కాదు.


    నిన్నటి నుంచే తప్పించుకుంటున్న శశాంకని అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని ఓ కానిస్టేబుల్ ని మఫ్టీలో ఆ ఇంటి సమీపంలో కాపు వేయించాడు. అతడే శశాంక రాక గురించి ఫోన్ చేసి తెలియపరిచింది.


    పోలీసుల్ని చూసి గేంగ్ మొత్తం పారిపొయినా దొరికింది ఒకే ఒక వ్యక్తి. అతడి పేరు సాగర్. కుమార్ దాదా అనుచరుడు... కృప హత్యలో దాదాని అనుసరించి వెళ్ళినవాడు కూడా.


    సర్కార్, కుమార్ దాదాలు తప్పించుకు వచ్చి ఈ విషయం చెప్పగానే జయచంద్ర మామూలుగా తీసుకోలేదు.


    కొద్దిగా జంకాడు.


    అసలు అలాంటి చిన్న విషయాలలో ఏనాడూ శ్రద్ధ చూపించని జయచంద్ర ఇప్పటికే చాలా ఆందోళనలో మునిగి వుండడంతో "బాస్టర్డ్స్" అరిచాడు సర్కార్ ని చూస్తూ.


    SWOT ఎనాల్సిస్ మొదలైంది జయచంద్ర మెదడులో.


    O - అపర్ట్యూనిటీ అవినాశ్ దైంది.


    T - థ్రెట్ మొదలు కాబోతూంది.


    W - వీక్ నెస్ తనది కాబట్టి అది అవినాశ్ కి తెలిసిపోతుంది.


    S - స్ట్రెంగ్త్ చూపాల్సిన మరో ముఖ్యమైన సమయం వచ్చింది.


    మూడక్షరాలు అటువేపు అనుకూలంగా వుంటే, తనకు మిగిలింది ఒకే ఒక్క అస్త్రం 'S' స్ట్రెంగ్త్.


    జయచంద్ర సాగర్ అనబడే ఒక వ్యక్తి గురించి అంతలా కంగారుపడటానికి కారణం_


    కృప హత్యకు కారణం సాగర్ కి తెలుసు...


    గేంగులో అందరికన్నా పిరికివాడైన సాగర్ నుంచి అవినాశ్ ఆ వాస్తవం తెలుసుకుంటే తన భవంతిలో మరో 'పిల్లర్' కదిలిపోతూంది.


    సాలోచనగా చూసాడు.


    అంతే...


    సాగర్ ని అడ్డం పెట్టుకుని అవినాశ్ పునాదిని కూల్చే ఓ పథకానికి అంకురార్పణ జరిగిపోయిందక్కడే.


                                                    *    *    *    *


    "నన్ను కస్టడీలోకి తీసుకోవడంలో మీ ఉద్దేశం" అడిగాడు శశాంక అవినాశ్ ని తదేకంగా చూస్తూ.

    
    అయిదు నిమిషాల క్రితమే అవినాశ్ తోపాటు ఆ ఏరియా స్టేషన్ కి వచ్చాడు శశాంక.


    "యూ ఆర్ థరోలీ మిస్టేకెన్" ఎదురుగా కూర్చున్న శశాంకని చూస్తూ - "మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవడమే జరిగితే మీరు అదిగో వాడితో బాటు సెల్ లో వుండేవారు" అన్నాడు అవినాశ్ సేల్ లోని సాగర్ ని చూపిస్తూ. "మిమ్మల్ని ఇలా స్టేషన్ కి తీసుకురావడంలో నా ఉద్దేశ్యం_దారి తప్పుతున్న మిమ్మల్ని హెచ్చరించాలని. ఇప్పటికి ఇంత మర్యాదగా ప్రశ్నించ బడుతున్న మీరు మరోసారి తప్పటడుగు వేస్తే అక్కడి దాకా వెళ్ళే అవకాశముందని చెప్పాలని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS