Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 53


    "ఈ అమ్మాయి పేరు లక్ష్మి. మీరు ఒంటరిగా వుంటున్నారని ప్లీడరుగారు చెప్పారు. అందుకని తోడుగానూ, ఇంట్లో పనికి వుంటోందని తీసుకొచ్చాను."


    అవంతికి నిజమేననిపించింది.


    తను ఒంటరిగా వుండేకన్నా ఇంట్లో పనులకి ఓ మనిషి అవసరం.


    "శ్రమ తీసుకొని తీసుకొచ్చారు చాలా థాంక్స్" అంది అవంతి.


    "దీనికి అన్ని పనులు వచ్చు. అంచేత మీ ప్రాక్టీస్ కి అంతరాయం అంటూ ఏమీ కలుగదు." అన్నారు చైర్మన్ కృష్ణమూర్తిగారు.


    "మీలాంటి పెద్దల అండదండలుంటే నాకే చింతా వుండదు" అంది అవంతి.


    ఆయన నవ్వాడు.


    ఆయనకేసి చూసింది. మనిషి నల్లగా వున్నా ఆకర్షణగా వున్నాడు. దానికి తోడు మంచితనం కూడా వున్నట్టుగా గ్రహించింది.


    ఆయన వెళ్ళిపోబోయే ముందు లక్ష్మిని హెచ్చరించాడు.


    "జాగ్రత్త. అమ్మగారు చెప్పినట్లుగా వినాలి. ఇంటిని కనిపెట్టుకొని వుండాలి" అని.


    లక్ష్మి తలూపింది.


    ఛైర్మన్ గారు వెళ్ళిపోయారు. ఊళ్లో పెద్దమనుషుల దగ్గర తండ్రికి గల పరువు మర్యాద ఎలాంటివో అర్థం చేసుకుంది.


    లేకపోతే అలాంటి ఉన్నతమైన స్థానంలో వున్నవాళ్ళు తన ఆలనా పాలనా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది!


    ఇప్పుడు అవంతికి తృప్తిగా అనిపించింది.


    తనకంటూ ఓ ఆడపిల్ల తోడుగా ఉంటుంది. కనక బిక్కు బిక్కుమంటూ ఆ ఇంట్లో ఒంటరిగా గడపాల్సిన అవసరం తప్పిపోయింది.


    ఆ మర్నాటినుంచి సూర్యారావుగారి ఆఫీసుకు రెగ్యులర్ గా వెళ్ళడం మొదలెట్టింది. కోర్టుకి కూడా పదకొండు గంటలకల్లా వెళ్ళి సాయంత్రం అయిదువరకు వుండి జరిగే ఆర్గుమెంట్స్ ట్రయిల్స్ అన్నీ గమనిస్తోంది.


    చైర్మన్ కృష్ణమూర్తిగారు మధ్య మధ్య పరామర్శచేస్తున్నారు.


                                             32


    భారతి అడుగులో అడుగువేస్తూ మెల్లగా నడుస్తోంది.


    ఈ మధ్యకాలంలో ఆమెలో నిర్లిప్తమైన ధోరణి చోటు చేసుకుంది.


    ఇదివరకులా చలాకీగానూ తిరగలేకపోతోంది.


    బోసుగాడు కనబడినప్పుడల్లా వెకిలి వేషాలు వేస్తూనే వున్నాడు.


    వాడికి వార్నింగ్ ఇవ్వమని తండ్రి చెప్పాడు. దానితో ధైర్యం తెచ్చుకొని "పిచ్చివేషాలేస్తే చెప్పుదీసి కొడతాను" అంది అయినా వాడు లక్ష్యపెట్టడంలేదు.


    ఉదయం కాలేజీ కొచ్చేముందు కనబడ్డాడు. వాడి పక్కనే మరో వెధవ ఎవడో ఉన్నాడు.


    "ఆల్ దట్ గ్లిట్టర్స్ ఆల్ నాట్ గోల్డ్ రా బేటా. ముందు బ్రహ్మాండంగా కొడుతుంది" అన్నాడు బోసు.


    పక్క వెధవ ఆశ్చర్యంగా చూశాడు. ఆ మాటలింకా భారతి మనసుని ముల్లుతో గుచ్చుతూనే వున్నాయి.


    వాడిమీద పోలీస్ కంప్లయింట్ ఇచ్చి జాయింట్లు విరగొట్టించాలనుంది.


    ఎంత వెధవ, మరెంత దుర్మార్గుడు కాకపోతే ఆ రోజెంత దారుణానికి తెగించాడు.


    పరువుకోసం తలవంచడమే కానీ లేకపోతే వాడు ఓ లెక్కలో మనిషికాదు. ఆ సంగతి భారతికి బాగా తెలుసు.


    అదంతా జరిగి కొన్ని నెలలైనా నిన్నకాక మొన్న జరిగినట్టుగా వుంది భారతికి.


    బస్టాపు దగ్గరవున్న గట్టుమీద కూర్చుంది భారతి.


    చుట్టు పక్కలెవరూ లేరు. బ్యాగ్ లోంచి చూయింగ్ గమ్ తీసి నములుతూ కూర్చుంది.


    మనోహర్ మాత్రం మళ్ళీ కనబడలేదు.


    అతను భారతికి ఏ మాత్రం అర్థం కావడంలేదు. చాలా చిత్రమైన మనిషిలా అనిపిస్తున్నాడు.


    అవంతిని గురించి ఏమనుకోవాలో కూడా భారతికి అర్థంకావడంలేదు.


    అతని మాటతీరుచూస్తే మంచివాడిలా కనిపిస్తాడు. బోసులా వెకిలి పనులు చేయడు. రోడ్డుసైడు రోమియోలా తన వెంట పడ్డంలేదు. రోజు ఆ సంఘటన తర్వాత మళ్ళీ కనబడనేలేదు.


    ఎందుకని?


    తనలా ప్రవర్తించడం చూసి అసహ్యించుకున్నాడా?


    అయినా తనేం చేసింది?


    ఏమి చేసినా అతన్నించి తప్పించుకోవడానికేనని అతనికి మాత్రం తెలీదా?


    తను అతన్ని అనుమానించడం సబబు కాదనిపిస్తోంది. ఏవో కారణాలని భూతద్దాల్లో చూసి అతన్ని అకారణంగా అసహ్యించుకుంది. ఎవిడెన్స్ లేని మాటల్ని నమ్మి అతని 'అహం' దెబ్బతినేలా తనే మాట్లాడింది.


    అతనొక్కసారి కనబడితే బావుండుననిపించింది భారతికి.


    అలా అనుకొన్న మరుక్షణంలో బావుండుననిపించింది భారతికి.


    అలా అనుకున్న మరుక్షణంలో ఎక్కడో చెట్ల కొమ్మలు చాటునుంచి ఓ కోయిలమ్మ మధురంగా 'కుహు' మని కూసింది.


    భారతి సిగ్గుపడింది.


    అలా ఎందుకనిపించింది తనకి.


    ఆమె చెక్కిళ్ళు ఎర్రరంగుని పులుముకొన్నాయి.


    ఈ మధ్య తరచుగా ఆమె ఆలోచనలు మనోహర్ వైపు పోతున్నాయి.


    కానీ అతనంటే ఓ ఖచ్చితమైన అభిప్రాయం మాత్రం ఆమెకి కలగడం లేదు.


    అతను తాగుబోతు.


    వ్యభిచారి


    విలాసపురుషుడు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS