Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 53

అందరికన్నా ఎక్కువగా సంతోషించి ఎగిరి గంతేసింది అతని ప్రియురాలు రజని మాత్రమే!
తనపై పడిన నిందను రూపుమాపుకోవడానికే జైలు నుంచి పరారు అయ్యాననీ... అసలు హంతకుడు జయచంద్రేనని, తను ఎలా బతికి బయటపడిందీ, రణధీర్ విషయం ఇంటర్వ్యూను ప్రచురించింది ధీరజ.
వాస్తవం ఏమిటో తెలియడంతో ప్రజలు హోం డిపార్ట్ మెంట్ ను దుయ్యబట్టారు.
ఆ అంశం గురించి అసెంబ్లీ లో నానా రభస అయింది. ప్రతిపక్షాలవాళ్ళకు మంచి మేత దొరికినట్టయింది.
ఆనందరావు, రవితేజలు వాడవాడలా తిరుగుతూ జయచంద్ర అక్రమాలను ఎండగట్టసాగారు. రవితేజ కోసం పోలీసులు వెళ్ళేసరికి అతనిని దాచివేస్తున్నారు ప్రజలు.
నగరంలోనే వీధివీధిలోనూ అతను ప్రచారం చేస్తూనే వున్నాడు. అయినా రవితేజను కస్టడీలోకి తీసుకోలేకపోతున్నారు పోలీసులు.
ముఖ్యమంత్రి వెంటనే ఢిల్లీకి లైట్నిం గ్ కాల్ బుక్ చేశాడు.
రాష్ట్రంలోని శాంతిభద్రతలను పధానమంత్రికి వివరించారు.
కేంద్రపరిశీలికుల బృందం రాష్ట్రానికి బయలుదేరుతుందని ప్రధానిమంత్రి చెప్పడంతో ప్రస్తుతం తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయనకు వివరించాడు.
ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాడో ఆయనకు చెప్పి ఒప్పించాడు. వెంటనే తనకు అనుకూలురయిన మంత్రులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి కొన్ని ముఖ్యమయిన నిర్ణయాలను తీసుకున్నాడు ముఖ్యమంత్రి.
జయచంద్రపై తీసుకునే చర్యలు అన్నింటినీ మంత్రివర్గ సహచరులు అమోందించారు
క్షణాలమీద సంభందిత అధికారులను ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
   
                                                    *    *    *    *
నగరంలో నడిబొడ్డున వున్న ఒక ఆధునిక భవంతి....
అందులో రహస్య సమావేశం జరుగుతుంది.
అక్కడ దాదాపు అరవైమంది వున్నారు. వాళ్ళ ముందు గంభీరంగా ఉపన్యాసం చెబుతున్న సత్యమోహన్.
"జెంటిల్ మెన్....ఈ సమావేశం ఆంతర్యం ఏమిటో మీకు తెలుసు. మనం ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు వున్న ముఖ్యమంత్రిని అవిశ్వాస తీర్మానం పేరిట గద్దె దించే సమయం ఇదే. మా బావ సి.ఎమ్ కావాలని ఉవ్విళ్ళూరుతున్న విషయం మీకు తెలిసిందే. అలాగేనని కాగితాలు వ్రాయించి మీకు డబ్బు ఇప్పించాను. కానీ ముఖ్యమంత్రిగా మీరు ప్రపోజ్ చేసే వ్యక్తిని నేనని చివరిక్షణం వరకూ తెలియకూడదు. అర్దమయిందా?"
అందరూ గొర్రెల్లా తలలు ఊపారు.
"గుడ్... నన్ను నమ్మి చెడినవాళ్ళు ఎవరూలేరు. నేను సి.ఎం అయితే ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలనుకుంటున్నానో లిస్టు తయారు చేసి వుంచుకున్నాను" అంటూ వరుసగా వాళ్ళ పేర్లు చదివి వినిపించాడు.
మంత్రిపదవులు, చైర్మన్ పదవులు... అలా అందరూ తాము అప్పుడే ఆయా పదవులను అలంకరించినట్టుగా సంబరపడి పోయారు.
"జయచంద్రగారికి ఈ విషయం తెలిస్తే..."
అంటున్న వ్యక్తి వైపు సత్యమోహన్ ముఖం చిట్లించి చూశాడు.
"ఎలా తెలుస్తుంది... నువ్వు చెబితే తెలుస్తుంది. ఇప్పటికే అతని మీద  ప్రజలలో దుమారం బయలుదేరింది. అతని కొడుకే హంతకుడు అని పత్రికలూ ఘోషిస్తున్నాయి.
పార్టీ ప్రముఖంలో అతనిపట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఏ క్షణములోనయినా అధిష్టాన వర్గం అతనిని పార్టీనుంచి సస్పెండ్ చేయవచ్చు. పోలీసులు క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేయవచ్చు. అందుకే ముందుచూపుతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా బావ పరువు ప్రతిష్టలు ఈ విధంగా దిగజారిపోవడం నాకూ బాధగానే వుంది" సత్యమోహన్ మొసలి కన్నీరు కార్చి బాధ నటించాడు.
సరిగ్గా అదే క్షణంలో స్ప్రింగ్ డోర్స్ తెరుచుకుని రజని... ఆమె వెనుకనే ధీరజ లోనికి వచ్చారు. వాళ్ళిద్దరనీ చూడగానే సత్యమోహన్ ఖంగుతిన్నాడు.
"ఆశ్చర్యపోవద్దు డాడీ...నువ్వు ఏదో కుట్ర చేయబోతున్నావని పసిగట్టి ధీరజకు ఫోన్ చేసి పిలిపించి నీ కారు డిక్కీలోనే ఇక్కడకు వచ్చాం. ఇంతవరకూ నువ్వు మాట్లాడిన ప్రతిమాటా రికార్డ్ చేయబడింది"
రజని మాట్లాడుతుండగానే ధీరజ చకచకా కొన్ని ఫోటోలను తీసింది.
వాళ్ళవైపు సత్యమోహన్ చిరునవ్వుతో చూశాడు. ఎంతో సేపు గడవకముందే నల్లటి దుస్తులు ధరించిన ఐదుగురు వ్యక్తులు వచ్చారు అక్కడకు. వాళ్ళ చేతులలో మెషిన్ గన్స్ వున్నాయి.
"వీళ్ళను ఇబ్బంది పెట్టకుండా మన పని పూర్తి అయ్యేంతవరకూ బంధించి వుంచండి"
ఆజ్ఞను అమలులో పెట్టారు బ్లాక్ కమెండోలు.
కెమేరా లాక్కుని... రజని, ధీరజలను అక్కడనుండి తెసుకు వెళ్ళారు.
"వాళ్ళు నేను స్వంతంగా తయారు చేసుకున్న బ్లాక్ కమెండోలు. నన్నూ, నా రహస్యాలనూ కాపాడడంలో ప్రాణాలను కూడా లెక్క చేయరు. తుపాకులను గురి తప్పకుండా పేల్చడంతో నిష్ణాతులు..." సత్యమోహన్ చిరునవ్వు నవ్వాడు.
అతని మాటలకు జీవంలేని నవ్వు ఒకటి నవ్వారు అక్కడ చేరిన ఎమ్.ఎల్ ఏ.లు అందరూ!
   
                      *    *    *    *
ప్రభుత్వ హాస్పిటల్...
వి.ఐ.పి.స్పెషల్ రూమ్__
అభినయ్ తల్లినే అంటిపెట్టుకుని వున్నాడు.
రవితేజ తన తోడబుట్టినవాడు.... తన అన్నయ్య... ఆ నిజం ఏమిటో... అది ఎలా జరిగిందో తల్లినోట వినాలనే తపన అతనని నిలువనీయడం లేదు.
కానీ, ఆమె మాట్లాడడంలేదు. ఆమెలో నిర్లిప్తత, నైరాశ్యం చోటుచేసుకున్నాయి.
ఆమె చూపులు ఎటో దిగంతాలలోకి చూస్తున్నాయి. అనుబంధాల పుటలు ఆమె కళ్ళ ముందు రెపెరెపలాడుతున్నాయి.
అమ్మా.... రవితేజ బతికే వున్నాడమ్మా ... చనిపోలేదు..."
ఆమె కళ్ళల్లో వెలుగు....       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS