సీ|| కృతకాద్రు లాయెనా కీలో గ్రఫణిఫణా
నేకపూత్కారవల్మీకచయము
విరిదోఁట లాయెనా కఱకుకంటకకంట
కాంకురవిస్ఫురితాగచయము
పుపుఁబాన్పు లాయెనా నవమంజుల శ్వేత
లవణాలవాలమౌ చవుటినేల
బొమ్మరిం డ్లాయెనా భూరిభేకాండజా
ధారమైతనరుకేదారచయము
గి|| నీకు విహరింప వసతులై నివ్వటిలెనె
చిన్ని పొలములు; బ్రాహ్మణ క్షేత్రమునకు
ఘాతుకత్వంబు దేయుముష్కరులు గలరె?
కథలు మిట మాని దివిజగంగాభవాని! 556
ఆడిదము రామకవి పైవిషయమునుగూర్చి పూసపాటి విజయరామ రాజుగారి కిచ్చుకొన్న యర్జీపద్యములు --
సీ|| అవధారు! దేవ! మహాప్రభూ! విన్నపం
బాశ్రితోత్తముఁడ శుద్దాంధ్రకవిని
పేరు రామస యింటిపే రడిదమువారు
మాజాగ భూపాలరాజురేగ
నల్లకృష్ణక్షమానాయకాగ్రేసరుఁ
డెఱ్ఱకృష్ణక్ష్మాతలేంద్రు లచటఁ
గరణికధర్మంబు గల్పించి మాన్యంబు
దయచేసి రది యాస్పదంబు మాకు
గీ|| నదియు నీయేఁడు దంతులూరన్న నృపతి
సత్తముఁడు గ్రామ మెల్లను గుత్తచేసి
చెఱువు బిగఁగట్టి ప్రజలు జేజేపడంగ
ముంపుగట్టించె వరిపొట్ట ముంపఁదలఁచి 557
సీ|| విన్నవించెద నాదువృత్తాంత మది కొంత
చిత్తగింపు పరాకు సేయకుండఁ
బొలములో నొకఁ డేరుపూన్పంగఁ జాలఁడు
గంగాభవాని ఢాకకును జడిసి
దుక్కి టెడ్లను గొని దున్నుకుంద మటన్న
బదులియ్యఁ డెవ్వడు పాఁతనేబు
ఏజోలియును లేక యింట నుండెద మన్న
సాలుకు వచ్చు గంటాలపన్నుఁ
గీ|| దేశమునవారు పొన్నూరు తెన్ను గాదు
వంట పస లేదు గంటాలపన్ను పోదు
మీకు దయరాదు మునుపటిమిసిమి లేదు
ఆతులగుణదీప! విజయరామావనీప! 558
సూరకవి ప్రపౌత్త్రుఁడు బాలభాస్కరకవి చల్లా పట్టాభిరామాయ యను వానిఁగూర్చి చెప్పిన పద్యము.
సీ|| విజయరామక్ష,మావిభు మెచ్చి భాసిల్లె
ధరణిలో మాప్రపితామహుఁడు
గంగాభవానిని గడుదిట్టరై తిట్టి
ఖ్యాతిఁ జెన్నొందె మాతాత యొకఁడు
వెలయంగమగటిపల్వెంకనుబడఁ దిట్టి
తగఁ దెగటార్చె మాతండ్రిగారు
ఆరీతిగాఁ దిట్టి యమపురంబునకును
నిన్నుఁబంపదలంచి యున్నవాఁడఁ
గీ|| గాచుకొ మ్మిటు మీఁద నఖండచండ
దారుణోద్దండకవితాగభీరశక్తి
నీతరముగాదు కలహించి నిర్వహించ
చల్లపట్టాభిరామ! నీచగుణధామ! 559
కృష్టిపాటి - వెంకటసుబ్బకవి
ఈయన కర్నూలు మండలవాసి. ఇప్పటికి డెబ్బదియేండ్లకుఁ బూర్వ మున్న వాఁడు. మహానందిక్షేత్రమున జగద్గురు శ్రీ (పుష్పగిరి) శంకరభారతీ స్వామిసన్నిధిని బ్రాహ్మణసమారాధనము జరుగుచుండువేళఁ గుంభవర్షము గురియ నారంభింపఁగాఁ గవిత్వమహత్త్వముచే నా వర్షబాధఁ దొలఁగించి శ్రీవారిచే గొప్ప సన్మానముఁ బడసినాఁడట! అప్పటి పద్యము లివి:
ఉ|| గోండ్రలు పెట్టి మేఘుఁ డతికోపమున గురియంగఁ జొచ్చె మా
తండ్రి! మరుత్తన్నూజ! నను దబ్బఱకాఁడని యెంచకుండ నీ
వేండ్రము నీవె మాన్పవలె వేయువిధంబులఁ గాక యున్న మీ
తండ్రికినైనఁ జెప్పి జలదప్రతిబంధము మాన్పు మారుతీ! 560
శౌ|| విద్యుత్పింగళ మంగళేక్షణకృపావిర్భూత శ్రీకృష్టిపా
డ్విద్వ ద్వేంకటసుబ్బ సూరికవితో ద్వృత్తత్వ మాలించి నీ
విద్యుద్గర్జనభర్జనాదు లడర వేమారు వర్షింపకే
విద్యాశంకరభారతీయము విక్రాంతి వాటిల్లఁగా! 561
నశ్యమునుగూర్చి యీయనకును ఉయ్యాలవాడ నారసింహారెడ్డిగారి యాసానపండితుఁడగు నోబళాచార్యులకును జరిగిన సంభాషణ పద్యము లివి--
ఉ|| నస్యము లేదుగా! పవననందనదివ్యకటాక్షవీక్షణా
వశ్యవర ప్రభావవిభ వానుభవాద్భుతభూమిభృద్దనుః
కైశ్యఘుమంఘుమంఘుమితగాంగఝరీవిలుఠ త్తరంగసా
దృశ్యకవిత్వతత్త్వముఖరీకృతవేంకటసుబ్బ సూరికి. 562
శా|| కోకో! నస్య మవశ్య మీశ్వరజటాకోటీరటద్ద్యోధునీ
ప్రాకాశ్యోర్మిసకాశ పేశలసుశబ్దప్రక్రియోపక్రమా
నేకగ్రంథనిబంధనార్జితసమున్ని ద్రప్రతావప్రథా
స్రోకశ్రీకర కృష్టిపాటికులసింధుస్వచ్చ చంద్రోదయా! 563
అల్లమరాజు - సుబ్రహ్మణ్యం
ఈయన యిప్పటికి ముప్పదేండ్లకు ముందున్న గొప్పకవి. బహుగ్రంథ కర్త. పీఠికాపురాధీశ్వరుఁడగు రావువేంకటమహీపతి గంగాధరరామారాయ ప్రభునిచే సమ్మానితుఁడు. ప్రభునామమును బొందించి యాశువుగా నీకవి చెప్పిన పద్యము.
క|| శ్రీధర శౌరీ వైకుం
ఠాధర శ్రీరావువేంకటమహీధరగం
గాధరరామారాయ
క్ష్మాధరునిం బ్రోవు మెపుడుఁ గరుణాదృష్టి. 564
కాట్రావులవల్లె యుప్పునీటి నూతులఁ గూర్చి చెప్పిన పద్యము-
క|| దేవాసుర లబ్దిఁ దరువ
నావిర్భూత మయి హాలహల మపుడు మహా
దేవునకు భీతిలి కా
ట్రావులపలినూతులందు డాఁగెను జుండీ. 565
వైదికుని కవిత్వము నాక్షేపించువారిఁగూర్చి చెప్పినది -
ఉ|| చందనశాఖికన్న విరసం బగుబూరుగు మేలటన్నఠీ
విం దగినట్లు వైదికకవిత్వసుధారసధార లెల్లఁ జె
ల్వొందఁగ భూతలంబున నియోగికవిత్వముతోడ సాటిరా
దందురు బెట్టిదం బగు నటందురు కొందఱు మూఢమానవుల్. 566
బుక్కపట్నం తిరుమల తాతాచార్యులు
తెల్గు విశ్వగుణాధర్మకర్త యీతఁడు రోఁతగా బూతుఁ బద్దెములను జెప్పుచుండువాఁడఁట! మతుకుమల్లి -శాస్త్రులను నస్య మడిగి యాయన లేదనఁగాఁ గోపించి యీ క్రింది పద్యము చెప్పెను:
