Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 52

"ఛీ! ఛీ! నేను వచ్చింది సాని కొంపకా! నేను మా అమ్మాయి కోసం వెదుకుతూ వుంటే మీ అందరికీ ఆటలుగా వుందా! మీరసలు మనుషులేనా!" అంటూ విసురుగా బయటకి వచ్చాడు రామానుజాచారి.
"అదేమిటి పంతులుగారూ! వెళ్ళిపోతున్నారు? మీ దగ్గర అయిదు రూపాయలు కూడా లేవా!" గుమ్మం దగ్గర వున్న ఆమె అరిచి మరీ అడిగింది.
మారు పలక్కుండా ఇవతలకి వచ్చేశాడు రామానుజాచారి.
ఆ తరువాత ఇద్దరు ముగ్గురిని తప్పించి ఇంకెవరినీ అడగలేదు తన కూతురి గురించి.
అలా అలా నాలుగు వీధులూ తిరిగి, మళ్ళీ పెళ్ళాం దగ్గరకి వచ్చాడు.
ఒక ప్రక్క ఎండ మండి పోతున్నది. మరోప్రక్క ఖాళీ కడుపు ఈ రెండూ కాక కూతురు కనపడలేదన్న ఆవేదన. వీటన్నింటితో ఆయనకి పిచ్చి పట్టినట్లయింది.
"ఇదంతా నీ వలనే వచ్చింది. ఎప్పుడూ పట్నం ముఖం ఎరుగని దానికి హోటలు కూడు దేనికి? పోనీ నలుగురితో పాటు ఇదే హోటల్లో తిని చావక ఆ మారుమూల హోటల్ దాకా పోవాలా? పెళ్ళి కావలసిన పిల్ల, వయస్సులో వున్న పిల్ల అది ఏమయిందో ఎక్కడికి వెళ్ళిందో! దీనికంతటికీ కారణం నీవు కాదా!" రామానుజాచారి కోపంతో ఎగిరిపడుతూ అన్నాడు.
"ఉరిమి ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదే! దానిని ఎక్కడకన్నా వెళ్ళమని నేను చెప్పానా! ఇక్కడ నుంచువే హోటల్లోకి వెళ్ళి వస్తాను అన్నాను. నేను హోటల్లోంచి బయటికి వచ్చేసరికి అది కనపడకుండా పోయె! అసలు మిమ్మల్ని అనాలి, హోటల్ లోకి వాళ్ళ నలుగురితో పాటు భోజనం చేద్దామండీ అంటే బిగుసుకు పోయి కూర్చున్నారు. మీరు మాతో పాటు వస్తే ఈ అగచాట్లు వుండేవికాదు కదా! తప్పంతా నాది అన్నట్లు మాట్లాడతారేమిటి?" ఖయ్యిమంది వకుళాంబ.
"అక్కయ్య కనపడకపోతే మనవూళ్ళో వాళ్ళు అక్కయ్య గురించీ అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలే!" అమ్మా!" సందులో సందుచేసుకుని సుందరాచారి తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.
"నువ్వు నోర్ముయ్" ఒక్క కసురు కసిరింది ఆమె.
వీళ్ళిలా వాదులాడుకుంటూంటే అటుగావచ్చిన ఒకాయన వీళ్ళనడిగి జరిగినదంతా తెలుసుకుని, "పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే మంచిది" అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు.
ఆ తరువాత.
పోలీస్ స్టేషన్ ఎక్కడ వుందో కనుక్కుని, అక్కడికి వెళ్ళి కూతురు కనపడలేదని ఫిర్యాదు చేసి వచ్చాడు రామానుజాచారి.
వాళ్ళు,   
"మీ అడ్రస్ యిచ్చి వెళ్ళండి! మీ అమ్మాయి కనపడంగానే మీకు తెలియచేస్తాము! వచ్చి తీసుకు వెళుదురుగాని. మేం కేసు విచారిస్తాం, మీరు ఇక వెళ్ళవచ్చు!" అని చెప్పి రామానుజాచారిని పంపించారు.
మళ్ళీ భార్య దగ్గరకి వచ్చాడు రామానుజాచారి.
వాళ్ళ మాటలూ, వాళ్ళ ఫార్సూ చూసిన మరో పెద్దమనిషి.
"ఇలాంటి విషయాల్లో స్థానిక ఎమ్మెల్యేని కానీ, బాగా పలుకుబడి వున్న ఓ పెద్ద మనిషిని కాని పట్టుకోవాలి. అలా చేస్తే మీ అదృష్టం వుంటే అయిదు నిమిషాల్లో పని అయిపోతుంది. మీరు వెళ్ళీ వెళ్ళీ పోలీస్ స్టేషన్ లో రిపోర్టు ఇస్తిరి. మీ రిపోర్టు ఆధారంతో వాళ్ళు మీ అమ్మాయిని వెతకవచ్చూ వెతకపోవచ్చు. ఓ వేళ వారు నిజంగా గాలించినా... ...మీ అమ్మాయి వాళ్ళకంట పడినా... ...మీ అమ్మాయి మీకు దక్కుతుందని మీరు అనుకోకండి. పోలీసులు కన్నా దొంగలు నయం. వయస్సులో వున్న మీ అమ్మాయిని వాళ్ళు... ... అయినా నాకెందుకు రెండి! ఏదెలా జరగాలని వుందో! మీ అదృష్టం ఎలా వుందో! కానీండి కానీండి! "అంటూ ఆ పెద్ద మనిషి ఓ అనుమాన బీజాన్ని వీళ్ళలో నాటి చక్కా పోయాడు.
దాంతో రామానుజాచారికి వకుళాంబకి క్రొత్త అనుమానాలు వచ్చాయి.
ఏవేవో వూహించుకుంటూ వకుళాంబ ఏడ్వటం మొదలుపెట్టింది.   
తనదాకా వస్తే కాని తలనొప్పి బాధ తెలియదంటారు. అలా తయారయింది ఆమె పరిస్థితి.
వాళ్ళున్న పల్లెటూరిలో కూతురికి ఎన్నో పెళ్ళి సంబంధాలు చూశారు. శ్రీమహాలక్ష్మి ముఖం ముద్దుగా వున్నా శరీరం మరీ బొద్దుగా వుండటం వల్ల ఒక్క సంబంధమూ కుదరలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS