Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 52


    "శిష్యగా! ఊళ్ళోకి నీవెళ్ళి బేగి ఇవన్నీ తీసుకురా! నేను సామి దగ్గర కూకొని కబుర్లాడుతుంటాను" వర్ధనరావు అన్నాడు.


    ఇదేదో కొత్తకేసు దొరికిందనే ఆనందంతో శాల్యూట్ చేయబోయి అంతలోనే తెలివి తెచ్చుకుని అనుమానం రాకుండా వుండటానికి నాలుగు మెలికలు తిరిగి "వెళుతున్నాను గురువా! ఈ పూటకి కడుపునిండుగా కూడు తిని చినిమా చూడొచ్చు అబ్బో అబ్బో" అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ అహోబిలం వెళ్ళిపోయాడు.


    ఆ వ్యక్తితో వర్ధనరావు కబుర్లు ఆడుతూ కూర్చున్నాడు.


    అహోబిలం తొందరగానే ఆ వ్యక్తి చెప్పిన అన్నీ తెచ్చాడు. వెంటనే ఆ వ్యక్తి యాభై రూపాయల నోటు తీసి ఇచ్చాడు.


    "మళ్ళీ రేపు ఉదయం పదిగంటలలోపు రండి. ఈ విషయం ఎవరితోనన్నా చెపితే మాత్రం నా పెళ్ళాంచేత ప్రాణం తీయిస్తాను" అన్నాడు.


    "ఎవరితోనన్నా చెప్పి యాభై రూపాయలు పోగొట్టుకుంటామా సామీ! ఊరంతా తిరిగి పచ్చబొట్లు పొడిచి పదిరూపాయలు కూడా సంపాదించలేని మాకు మీరు డబ్బులిచ్చే దేముడిలా కనిపించారు. రేపు ఉదయానే వస్తాం సామీ!" అని చెప్పి అహోబిలంతో సహా ఊళ్ళోకి బయలుదేరాడు వర్ధనరావు.


    దారి మధ్యలో_


    "ఈ కేసు చూస్తే నీకేమనిపిస్తుంది శిష్యగా!" వర్ధనరావు ఖుషీగ అడిగాడు.


    "ఏముంది గురువా! వీడో పెద్ద నక్సలైట్ అయివుంటాడు. పోలీసులకంట పడకుండా తాటి తోపులో దాక్కున్నాడు" తాపీగ చెప్పాడు అహోబిలం.


    "శిష్యగా! నీ తెలివి తెల్లారినట్లే వుందని చెప్పటానికి నేనేమీ చింతించటంలేదు. నీవు కానిస్టేబుల్ వి. నేను ఇన్ స్పెక్టర్ ని ఎందుకయ్యామో తెలుసా! అదృష్టంకొద్దీ కాదు తెలివికొద్దీ అన్నమాట... అసలు వాడెవడో తెలుసా? చూశావా?"


    "తెలీదు గురువా! నేను చూడలేదు" అహోబిలం అర్థరూపాయి అంత ముఖం చేసుకుని చెప్పాడు.


    "ఆరోజు ఆ ముఠామీద మనం రైడ్ చేసినప్పుడు...నీవు పక్క గదిలో వాళ్ళని వేటాడుతూ వున్నావు. నేను పక్క గదిలోకి వెళ్ళి "మీ బాస్ ఏడి?" అని అడిగితే "ఆ గదిలో వున్నాడని" చెప్పాడు. అక్కడికి పరుగు తీద్దునుకదా ఆ గదిలో ఎవరూ లేరు. మళ్ళీ ఈ గదిలోకి వచ్చి చూద్దునుగదా వీడులేడు. ఆనాటి వాడేవీడు వీడేవాడు. విజయ్ మనకి గుర్తులు చెప్పాడు కదా!"


    "అంటే...అంటే...వీడు_బాస్ గాడు. కోటీ యాభై లక్షల రూపాయల ఖరీదు చేసే వజ్రాలు దాచినవాడు" ఆశ్చర్యంగా అడిగాడు అహోబిలం.


    "య్యా" అన్నాడు వర్ధనరావు.


    "అయ్యొయ్యో! చేతికి చిక్కిన దొంగని వదులుతారా సార్! వాడు ఆ వజ్రాలతో మాయం అయితే! పదండి సార్! పట్టుకుందాం" కంగారుగా అన్నాడు అహోబిలం.


    "గాలానికి చిక్కిన చేప ఎక్కడికి పోదు. గబుక్కున మనం పట్టుకుంటే వాడు టోకరా కొట్టి పారిపోవచ్చు. విజయ్, రాంసింగ్ వాడిదగ్గర బందీగ వున్నారు. కోటీ యాభయ్ లక్షల రూపాయల విలువగల వజ్రాలు ఎక్కడ పారేశాడో తెలియదు. పైగా వాడిని పట్టుకోవాలంటే సమయానికి మనదగ్గర ఆయుధాలు లేవు. చాలా లోతు, చాలా దూరం ఆలోచించి వాడిని తాటితోపులోనే వదిలేశాను. వాడు అక్కడ దాక్కున్నాడు ఎక్కడికి పోడు." వర్ధనరావు ధీమాగా చెప్పాడు.


    "మీ బుర్ర అమోఘం సార్!" పొగిడాడు అహోబిలం.


    వర్ధనరావు గర్వంగా ఫీలవుతూ గట్టిగ బుర్ర తడుముకున్నాడు. దాంతో విగ్గు కదిలి తలమీంచి సగం జారింది. వెంటనే తెలివిగ సర్దుకుని సరీగ పెట్టుకున్నాడు.


    వర్ధనరావు తలమీద విగ్గు జారటం అది మళ్ళీ సరీగ పెట్టుకోటం ఓ వ్యక్తి చూడనే చూశాడు. తలపంకించి ఏదో ఆలోచన చేసి దూర దూరంగా వాళ్ళిద్దరిని అనుసరిస్తూ రాసాగాడు.


    తమనో వ్యక్తి ఫాలో అవుతున్నాడని ఏమాత్రం పసిగాట్టని దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు హెడ్ కానిస్టేబుల్ అహోబిలంతో సీరియస్ గ కోటీ యాభై లక్షల విలువగల వజ్రాలు గుర్తుకు రాగానే ఆనందంగా కబుర్లు చెపుతూ ముందుకు సాగుతున్నాడు.


    ఆ వ్యక్తి వాళ్ళని ఫాలో అవుతూనే వున్నాడు.


                                           24


    రాంసింగ్ కోసం ఎదురుచూస్తున్నాను.


    నేను కనుక్కున్న విషయం ఎప్పుడెప్పుడు రాంసింగ్ కి చెపుదామా అని ఓపక్క నేను ఆతృత చెందుతుంటే రాంసింగ్ రాక ఆలశ్యం అయింది. సంతోషం అయినా దుఃఖం అయినా ఆప్తులతో పంచుకుంటే ఆ యిదే వేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS