దభేలున తలుపు తెరుచుకుంది.
ఆ గదిలోని చీకటి ఉలికి పడింది. తొట్రుపాటున ముందుకు కదలిన ఓ వృద్ధుడి ఆకారం గదిలోకి ప్రాకుతున్న సన్నని వెలుగు రేఖను దాటి నాగులా బుస కొడుతూ నిలుచున్నా సోఫియాని చూసి ఎండుటాకులా వణికాడు.
"వీ...ర...య్యా" సోఫియా కర్కశంగా పిలిచింది.
"వీరయ్య కదల్లేదు. కాని సోఫియా ముందు దూసుకుపోయి ఆవేశంగా అతడి కంఠాన్ని పట్టుకుంది. "చెప్పు. బ్రతకాలనుంటే నిజం చెప్పు. నా చేతుల్లో చావకూడదనుకుంటే వెంటనే చెప్పు" ఆమె రెచ్చిపోతూంది.
కాదు... ఆ వృద్ధుడి కళ్ళు బయటికి ఉబికేట్టు కసిగా వేళ్ళను పులి పంజాలా కంఠంలో గుచ్చుతూంది. "ఎవరు నీకు నన్ను అమ్మింది. నా మూడేళ్ళ వయసులో నా తల్లి నుంచి నన్ను దూరంచేసిన నా తండ్రెవడు.. ఎక్కడున్నాడు. వాడి పేరేంటి" ప్రశ్నలను వాడి బాణాల్లా విసురుతూంది.
వయసుడిగి పోయిన వీరయ్య ఊపిరందనట్టు విలవిల్లాడిపోతున్నాడు తప్ప, జవాబు చెప్పడం లేదు.
సుమారు పధ్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని ఖైదులో గడిపిన వీరయ్య బయట ప్రపంచంలో అడుగుపెట్టింది నిన్ననే...
పెంచిన తండ్రి సామ్రాజ్యాన్ని తన సొంతం చేస్తూ అయిదేళ్ళ క్రిందటే కన్నుమూస్తూ తను జన్మ రహస్యాన్ని వీరయ్య నుంచి తెలుసుకొమ్మని చివరి మాటగా చెబితే - ఇన్నాళ్ళు ఎదురు చూసింది. వీరయ్య నుంచి వాస్తవం తెలుసుకోవాలని జైలు గోడలు దాటి వచ్చిన మరుక్షణం బంధించి ఓ చీకటి గదిలోకి నెట్టింది.
ఏదీ... ఇరవై నాలుగు గంటల చిత్రహింసల తర్వాత కూడా నిజం చెప్పడేం... చంపేయాలన్నంత ఉక్రోషాన్ని నిభాయించుకోవడం కష్టంగా వుందామెకు.
"వీరయ్య"... విడిచిపెట్టింది. తమాయించుకుంటూ "నీకు మందంటే చాలా ఇష్టంకదూ. ఒక్క విస్కీ బాటిల్ కోసం నా తండ్రిచేత అమ్మబడిన నేను బ్రతికినంతకాలం సరిపోయినంత ఎక్కువ సప్లయి చేస్తుంటానురా. కాని నువ్వు నాకు చేయాల్సిన సహాయం_అదిగో నా తండ్రి ఎవడో చెప్పడం_అంతే... వాడు బ్రతికున్నాడా, పోయాడా నాకు అవసరం లేదు. ఆ నిజం తెలియాలి_అంతే" మరుక్షణం ఓ బాటిల్ తెప్పించింది. అతడి సమీపంలో కూచుని బిరడా తీసి అతడి నోటికి అందించింది.
వీరయ్య వారించలేదు. వయస్సులో అతడికున్న అపురూపమైన అలవాటది. అక్కడి చీకటి గోడలు సరిహద్దులు మరిచేట్లు గడగడా తాగేసాడు. ఇన్నాళ్ళు ఆర్తినీ, నిస్త్రాణనీ వదిలించుకునేట్టు ఆగకుండా తాగాడు.
మరో బాటిల్ అందించింది.
తాగాడు_తూలిపోతున్నాడు_తడబడుతున్నాడు.
అప్పుడు పెగిలింది వీరయ్య గొంతు "అమ్మా... నేను..." వెక్కిపడుతున్నాడు... కళ్ళ నుంచి ధారగా నీళ్ళు కారుతున్నాను. "నేను దుర్మార్గుడ్ని తల్లీ. అందుకే పసి గుడ్లుని, ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి నిన్ను పెంచాను. పెద్దయ్య డేవిడ్ కి అమ్ముతుండేవాడ్ని. చెప్పకపోవడమేం... నీ మూడేళ్ళ వయస్సులో నిన్ను అలాగే తీసుకొచ్చాను. కాకపోతే ఎత్తుకు రాలేదు. నీ తండ్రి ఓ విస్కీ సీసా కోసం నిన్ను అమ్మేశాడు."
"అది నాకు తెలుసు..." అసహనంగా పలికిందామె. "ఆ తర్వాత నన్ను పెంచిన తండ్రి అందరి అమ్మాయిల్లా నాకు అన్యాయం చేయకపోవడం, నన్ను తన కూతురుగా పోషించడం అవన్నీ నాకు తెలుసు వీరయ్యా. అసలు నన్ను నీకు అమ్మిన నా తండ్రి గురించి చెప్పు."
మత్తులో నేలకి వాలిపోతున్న వీరయ్య తలపైకెత్తుతూ అంది- "చెప్పు"
"షె...ప్ప...లే...ను"
"ఏం... ఎందుకని" ఆమె అరుపుకి ఆ గది ప్రతిధ్వనించింది.
వీరయ్య అది పట్టించుకునే స్థితిలో లేడు.
"నిన్నే..." జుట్టు పట్టుకుని విదిలించింది_ "చెప్పు... నా తండ్రెవరు?"
"షె...బి...తే... షంపేస్తాడు"
"...ఎ...వ...రు"
"జయచంద్ర"
ముందు సరిగా వినలేదేమో అనుకుంది. వెంటనే తేరుకుని "నిజం చెబితే జయచంద్ర నిన్ను చంపుతాడా" అడిగింది ఉద్వేగంగా "అంటే...ఇందులోనూ జయచంద్రకి భాగముందా"
ఆమె నిశ్చేష్టత నుంచి ఇంకా తేరుకోలేదు.
కాని వీరయ్య అప్పటికే సొమ్మసిల్లిపోయాడు.
"జ...య...చం...ద్ర"
ఎక్కడో మానుతున్న నిన్నటి గాయాన్ని ఇక్కడ వీరయ్య మొన్న కథతో రేపి రెచ్చగొట్టాడు. ఆమె కళ్ళిప్పుడు వర్షించడం లేదు. కాని కసిగా ఎరుపును పుంజుకున్నాయి. మరో మానని గాయానికి సంకేతాలా.
* * * *
సుమారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వినీల ఇంటికెళ్ళిన శశాంక తలుపు తాళం వేసి వుండడంతో ఓ పది నిమిషాలదాకా వెయిట్ చేశాడు.
ఒకవేళ కారిడార్ లో పగిలి వున్న కిటికీ అద్దాల్ని చూసినా అనుమానించేవాడేమో కాని చీకటి మూలంగా గమనించక సరాసరి ఇంటికి వచ్చేసాడు.
రాగానే ముందు ఫోన్ రిసీవరు అందుకున్నాడు.
రిలాక్సింగ్ గా సోఫాలో కూర్చుని ఒక్కో నంబరూ డయల్ చేశాడు.
