Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 52


    ఆ ఇంటి పరువు ప్రతిష్టల్ని కాపాడుకోడానికి గానూ అప్పుడే పుట్టిన నిన్ను ఎక్కడైనా పారేయమని నాకిచ్చారు.


    నేను చేతుల్లోని ఆ పసిగుడ్డుని చూస్తూ ఏమీ చేయడానికి తోచక అల్లాడిపోయాను.


    అప్పటికే ఏనాడో చేసుకున్న పాపమో కానీ మాకు పుట్టిన నలుగురు బిడ్డలు పురిటిలోనే పోయారు.


    అందుకే దేవుడిచ్చిన బిడ్డగా నిన్ను పెంచుకోవాలనిపించింది. రావు బహదూర్ గారికి తెలీకుండా కొంతకాలం నా భార్యతోపాటుగా నిన్ను వాళ్ళ అన్నగారింటికి పంపాను. ఓ సంవత్సరం తర్వాత తీసుకొచ్చి నిన్ను మా బిడ్డగానే పెంచుకున్నానమ్మా. నేను నీ కన్నతండ్రిని కాదని చెప్పడానికి నాకు నోరు రావడంలేదు. కానీ నిన్ను అంతకంటే ఎక్కువగానే పెంచుకొన్నాడమ్మా ఆ తండ్రీ.


    నీ మనసుకు కష్టం కలిగించాలని కాదు, నీ జన్మ రహస్యం నీకు తెలియజేయడం నా ఆఖరిక్షణాల్లో ధర్మంగా భావిస్తున్నాననే తప్ప మరో కారణం లేదు తల్లీ.


    నీ జన్మకి కారణం అయిన డ్రైవర్ పరశురామ్ ఎదురు తిరగడంతో అతన్ని ఓ క్రిమినల్ కేసులో ఇరికించి జీవితఖైదు చేయించాడమ్మా నీ తాతగారు. ఆఖరికి తన పరువు కాపాడుకోడానికిగానూ తన దగ్గరే జూనియర్ గా పనిచేస్తున్న లక్ష్మీపతికి నిజాన్ని చెప్పి కూతుర్నిచ్చి పెళ్ళిచేసి హైదరాబాద్ కి పంపేశాడు.


    నేను గానీ, నిన్ను పెంచిన తల్లిగానీ నిన్నేనాడు పరాయి పిల్లగా భావించలేదమ్మా.


    నీ మనసులో నీ కన్నతండ్రిలా నాకున్న స్థానాన్ని అలాగే ఉంచాలి తల్లీ.


    ఈ ముసలివాడి ప్రపంచమే నువ్వు తల్లీ.

                                                                         .....నాన్నా

                                                                         గోవిందరాజులు.


    ఆ ఉత్తరం చదవడం పూర్తిచేసిన అవంతి కళ్ళనిండా నీరునిండింది. రోషంతో గుండెలు ఎగిరిపడినాయి.


    వళ్ళు తెలీని కామాంధకారంలో తను చేసిన నేరానికి భూమ్మీదపడ్డ తనని కనికరం లేకుండా అవతల పారేయడానికి తలపడిన ఆ ఆడదితల్లేనా!


    పుట్టిన క్షణంలోనే పరువు ప్రతిష్టలకి భయపడి చెత్తకుండీలోకి విసిరి కొట్టబోయిన ఆ తల్లి, తను బతికి బట్ట కట్టిందని తెలిస్తే ప్రాణంతో ఉండనిస్తుందా!


    పెళ్ళికాకుండా పిల్లల్నికంటే ఆ పిల్లల్ని చెత్తకుండీల్లో పారేయాలా!


    అంత పరువుకోసం పాకులాడే మనిషి ఒళ్ళు బలిసి ఎవడి దగ్గరో ఎందుకు పడుకోవాలి!


    అలా పడుకొని చల్లార్చుకున్న కామానికి ఫలితంగా పుట్టిన శిశువుని చెత్తకుప్పల్లో పారేయడానికి, ఆ శిశువు తప్పేం చేసింది!


    సమాజానికిలాంటివి పట్టవా!


    చేసిన నేరానికి శిక్షగా ఆ శిశువుని పెంచి పెద్ద చెయ్యమని సమాజం అలాంటి వాళ్ళనెందుకు శాసించదు.


    పెళ్ళికాని తల్లికి పుట్టి అవతలకి విసిరేయబడిన తను ఆ తల్లికి పాఠం చెప్పాలి.


    పెళ్ళి ఎలాగూ చేసుకోబోవడం లేదు తను.


    ఆ తల్లికి పిల్లల్ని కని పెంచి చూపించి ఓ గుణపాఠం చెప్పాలి.


    మాతృత్వం ఆడదానికి దేవుడిచ్చిన వరం దాన్ని పొందడానికో ఓ మొగుడూ, తాళిబొట్టూ అవసరంలేదు.


    ఆ సత్యాన్ని ఎంత కఠినమైనదే అయినా తను నిరూపించాలి.


    పిల్లల్ని దొంగచాటుగా కనిపారేసి తల్లులకీ, ఆ తల్లుల తల్లిదండ్రులకీ బుద్ది చెప్పాలి??!


    అవంతికి ఆవేశం ఒక్కసారిగా తగ్గిపోయింది?


    చెప్పరాని దిగులు కలుగగా.....


    "నాన్నా?" అంటూ బావురుమన్నది.


    ఆమెని ఓదార్చడానికి ఎవరూ లేరక్కడ.


    ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది.


    తన పుట్టుక రహస్యం తెలిశాక ఆమెలో ప్రతీకారజ్వాల చెలరేగుతోంది. ఆమె కళ్ళెర్రబడినాయి.


    అవంతి కింద పెదిమని పై పెదిమతో నొక్కిపట్టింది.


    తనని కని అవతల పారేసిన తల్లి వుందని ఆమెకి తెలిసినా ఆమెని కలుసుకోవాలనిగానీ, చూడాలనికానీ అనిపించడం లేదు.


    పెంచిన తండ్రి ప్రేమని మరచిపోనూ పోలేకపోతోంది.


    తను అతని కన్నబిడ్డ కాకపోయినప్పటికీ తన భవిష్యత్తుకోసం ఆరాటపడిపోయి, తననో ఉన్నత స్థానంలో చూసుకొని గుండెలనిండా ఆనందాన్ని నింపుకొన్న ఆ ముసలి మనిషిని జీవితంలో మరిచిపోలేదు.


    ఏదో ఒక రోజున తల్లి తారసపడుతోంది. ఆనాడు ఖచ్చితంగా ఆమెకు తానెవరో చెప్పి కనువిప్పు కలిగించాలి.


    ఇలాంటి తల్లులు, అలాంటి దొంగతండ్రులు వుండబట్టి అనాధలు తయారవుతున్నారు. దిక్కులేకుండా పెరిగి సమాజంపాలిట సంఘవిద్రోహ శక్తులుగా తయారవుతున్నారు. గత జన్మలో చేసుకొన్న ఏపాటి కొద్ది పుణ్యమో కారణం ఆధారంతో గోవిందరాజులు చేరదీశాడు. ఆయనే తనని పట్టించుకొని వుండకపోతే ఎప్పుడో తను మట్టిలో కలిసిపోయి ఉండేది.


    ఆ ఊహ కలిగేసరికి ఆమె శరీరం పైన రోమాలు నిక్కబొడుచుకున్నాయి.


    "ఛీ, పాడు మనుషులు" అనుకొంది అలా అనుకొన్నప్పుడు గుండెలో గుబులుగా అనిపించింది.


    పది రోజులు గడిచినాయి.


    అవంతి ఇంట్లోనే వుండిపోయింది. తండ్రిపోయిన ఆ ఇంట్లో ఒంటరిగా గడపడం భయం వేసింది. ఇంటి పక్కన ముసలామెవచ్చి "అవంతి"కి తోడు పడుకుంటోంది.


    ఓసారి సూర్యారావుగారొచ్చి ఆమెని ఊరడించి....." ఇంట్లో ఇలా ఒంటరిగా కూర్చుని ఏం చేస్తావు ఆఫీసుకొస్తే కాస్త మరచిపోయే అవకాశం వుంటుంది. ఆయన ఎప్పుడో పోవాల్సిన వాడు. నిన్ను బార్లో చూడాలనే ఇంతకాలం బతికేడమ్మా, నేను నీ తండ్రి లాంటివాడ్ని, నీకు నేనున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకొని, రేపటి నించి ఆఫీసుకొచ్చేయ్" అన్నాడు సూర్యారావు.


    అవంతి మెల్లగా తల వూపింది. ఆయన వెళ్ళిపోయాక అదేరోజు సాయంత్రం చైర్మన్ కృష్ణమూర్తిగారు వచ్చాడు. ఆయనతో పాటుగా ఓ పద్నాలుగేళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి లంగా, జాకెట్ వేసుకొని వుంది.


    ఆయన చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS