"మీ వెంట ఎవరూ రాలేదా?" అంత పరధ్యానం ప్రొఫెసర్ ని ఒంటరిగా పంపినవారు ఎవరా అని తలపోసుకుంటూ అడిగింది.
"అమ్మా! ఇది రైలు ప్రయాణం పక్కన ఎవరుంటే వారే ఆత్మీయులు అనుకోవాలి ఈ కాస్సేపు ప్రయాణం అయిపోయిందాకా. ఆ తరువాత ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోతారు. ప్రస్తుతం నా బంధువు అనుకోవాలంటే నువ్వే.
నీ అంత వయసున్న మనుమరాలు నాకుంది కాని నా వెంటరాలేదు.
నన్ను చేయిపట్టి నడిపించాల్సిన అవసరం లేదులే! వెళ్ళి చూచివద్దాం పద చాలా భయంకరమయిన ఆఫ్రికా అడవులు, అమెజాన్ నదీ తీరపు అరణ్యాలలో కూడ నేను పరిశోధనలు చేశాను. అడవులలో తిరగటం నాకు అలవాటే!" అన్నాడాయన.
ఇద్దరు ఒంటరివారు ఒకరికొకరు తోడు అయినారు.
కాస్సేపు అడవిలో తిరిగిన తరువాత అడిగింది గాయత్రి.
"ఆఫ్రికా అమెజాన్ తీర అరణ్యాలలో మీరెందుకు తిరిగారు."
"గ్రీన్ మంకీస్ మీద నేను చాల పరిశోధనలు చేశానమ్మా! వాటి అలవాట్లు చాల విచిత్రంగా ఉంటాయి" అంటూ తన పరిశోధన వివరాలు చెప్పటం మొదలెట్టాడు.
ఆఫ్రికా పచ్చ కోతులలో మనుషుల వ్యక్తిత్వం పోలికలు కన్పిస్తాయి.
మనుషులు కొన్ని రకాల పనులు చేసినప్పుడు కోతి చేష్టలు అంటారు. అలాంటి పనులు అన్నీ ఆఫ్రికా పచ్చకోతులు చేస్తుంటాయి. వాటిలో లెస్ఫియన్స్, హోమోస్ ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధి మొదటిసారి వాటినుంచే పుట్టిందని కొందరు పరిశోధకుల అభిప్రాయం. ఇలాంటి సైన్సు అద్భుతాలు వివరించాడాయన.
అప్పటికే అడవిలో చాల దూరం నడిచారు. రైలుదిగి ఎనిమిది గంటల తప్పనిసరి కాలక్షేపాన్ని వెతుక్కుంటున్న మరికొందరు కూడ అక్కడ తచ్చాడుతూ కన్పించారు.
అంతా రైలు యాత్రికులే! ఒకరికొకరు తోడు అయారు.
ఒక కొమ్మమీద రెండు కోతులు కిచకిచలాడుకోవటం వారికి కన్పించింది.
"అవేం చేస్తున్నాయి ప్రొఫెసర్!" అని అడిగింది గాయత్రి.
ఆయన చాలాసేపు వాటివంక చూచాడు. ఒక కోతి రెండవదాన్ని కవ్విస్తోంది. రెండు కొమ్మల మీద గెంతుతూ తిరుగుతున్నాయి. ఒక కోతి అక్కడనించి వెళ్ళిపోయింది.
"అమ్మా! అవి రెండు ప్రేమికులు. మగకోతి బాగా ఆరోగ్యంగా ఉంది.
ఆడకోతి దుర్వ్యసనాలకి బానిస! దానికి మాలిగ్నంటేలింపోమా అనే తీవ్రమయిన కాన్సర్ వ్యాధి ఉంది. ఆ వ్యాధిని గుర్తించేందుకు దాని అవయవాలలో కొన్ని గుర్తులున్నాయి.
మగ కోతి దాంపత్య సుఖానికి టెండర్ వేస్తోంది.
రెండవది ఆడ కోతి అనారోగ్యం వల్ల తిరస్కరించింది. అది వెళ్ళి పోయిందనుకుంటున్నావా?మళ్ళీ తిరిగి వస్తుంది చూడు" అన్నారాయన. వారు కొద్దిసేపు ఎదురు చూచారు.
ఆయన చెప్పినట్టు నిజంగానే ఆ కోతి తిరిగి వచ్చింది.
ఒంటరిగా రాలేదు. వస్తూ మరో ఆడకోతిని వెంటతెచ్చింది. తనను ప్రేమించాలనుకున్న మగకోతికి రెండవ ఆడకోతిని పరిచయం చేసింది. అవి రెండూ కొమ్మల గుబుర్ల చాటున జీవితానందాన్ని అనుభవిస్తూ ఉంటే కొమ్మలమీద గెంతి కేరింతలు కొట్టింది.
గంటసేపు మూడుకోతుల క్రీడను వారు తిలకించారు.
"అమ్మా! కోతులనించి వారసుడుగా వచ్చినవాడు మనిషి! కాని వాటినించి వారసత్వంగా వచ్చిన హృదయ వైశాల్యాన్ని వదిలేశాడు" అని కామెంట్ చేశాడు ప్రొఫెసర్.
"సో! యిట్ బి సర్౧ అవేం చేస్తున్నాయి. మాలాంటి వాళ్ళకి కేవలం గెంతులాటలా ఉంది. పూర్వం జానపద కధల్లో జంతువుల భాష అర్ధం చేసుకొనే కొందరు కనిపిస్తారు. అలాంటి మహనీయులు మీరు.
ఆ గెంతులాట మీకు అర్ధమయింది. మనం వాటినించి నేర్చుకోవలసిందేమిటి?" అని ప్రశ్నించింది గాయత్రి. ప్రొఫెసర్ గారే కళ్ళద్దాలు సవరించాడు.
"బేబీ! ఆడకోతి అనారోగ్యం కారణంగా మగకోతి కోర్కెను తీర్చలేని నిస్సహాయురాలు! మాలిగ్నంట్ లింఫోమా అనే తీవ్రమయిన వ్యాధి వల్ల మెదడులోని మోనోసయిట్లు స్కావెంజర్ కణాలు దెబ్బతింటాయి.
ఫలితంగా ఎన్ ధిలైటిస్ లక్షణాలు వస్తాయి.
దాంపత్య సుఖం చేయటానికి అనర్హురాలయింది. అలా అని ఊరుకోలేదు. తాను ప్రేమించే మగకోతి శరీర ధర్మమయిన కోరికను తీర్చేందుకు తన అనర్హతని పెద్ద మనసుతో అది అంగీకరించింది.
మరో ఆడ కోతిని బ్రతిమాలి బామాలి లంచంకూడ యిచ్చి తీసుకువచ్చింది.
క్రొత్త అతిధితో తను ప్రేమించే మగకోతి దాంపత్య క్రీడ సాధిస్తుంటే ఆ సంతోషం అంతా తనదే అయినట్లు గెంతులు వేస్తోంది, అని వాటి బిహేవియర్ ని ఎన్ లైజ్ చేశారు ప్రొఫెసర్ సార్.
ఆ మాటలు విని నిర్ఘాంత పడిందామె.
ఆ సంస్కారం, అనర్హతని అంగీకరించే మంచితనం, ప్రియుడి కోర్కెను తీర్చేందుకు అసూయకి అతీతంగా త్యాగం చేయగల హృదయ వైశాల్యం మనుషులకు ఉండవమ్మా. మన పూర్వీకుడు అయిన కోతినించి ఆ సంస్కారాన్ని మనుషులు తెచ్చుకోవాలంటే ఎన్ని యుగాలు పడుతుందో." అని కామెంట్ చేశారు.
ఈ మాటలు విన్న తరువాత గాయత్రి మనో కులాయంలో మూసుకుపోయి అంధకార బంధురంగా ఉన్న చీకటి గదుల వాకిళ్ళు భళ్ళున తెరుచుకున్నాయి. కమ్చీ విదిలించి ఆమె వ్యక్తిత్వాన్ని ఆ మాటలు అదలించినాయి.
ఆ మేధావి విద్యామూర్తి చెప్పిన మాటలు వేదాలు.
అవి జీవన సూత్రాలు. ప్రబోధ గీతాలు, పుస్తకాలు పరిశోధన తప్ప మరో సుఖం మరో ప్రపంచం ఎరుగని ఆ విద్యా సంపన్నుడు ఆమెకు శ్రీ వక్తలా కన్పించాడు. అర్జునుడి విషాదాన్ని కరిగించిన గోవిందునిలా అనిపించాడు.
అనిపించటం కన్పించటం కాదు.
కర్తవ్యానికి పూనుకుంటూ ఆమె మనసులోని అర్జునుడు నిద్రలేచాడు.
తస్మాదుత్రిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయం
యుద్ధమంటే యజ్ఞం, యజ్ఞమంటే కర్తవ్యం.
ఆమె మనోనేత్రాల ముందు వినూత్న లోకాలు దర్శనమిచ్చాయి. తన జీవిత విషాదపు చీకటిలో వెలుగుదారులు రహదారులై కన్పించాయి.
మిగిలిపోయిన గంటలు ఎలా గడిచాయో, ప్రయాణం ఎలా ముగిసిందో, అపార్టుమెంట్స్ కి ఎలా చేరుకుందో ఆమనికోసం ఎన్ని గంటలు ఎదురుచూచిందో తెలియదు.
నిద్రలేదు. ఆహారం లేదు. మంచినీరు కూడా తాగలేదు.
భయం సందేహం ముట్టడించిన ఆలోచనలతో రెప్పల వెనుక చూపుల ఆశల దీపాలుగా వెలిగిస్తూ ఆమనికోసం ఆర్తిగా ఎదురుచూసింది.
నగరంలో దిగి పటాలంతో కలిసి సుడిగాలిలా అపార్టుమెంట్స్ లోకి వచ్చింది ఆమని?
అక్కను చూసి మొదట స్థాణువులా అయింది.
ఆ పైన అమాంతం మీదపడి కౌగలించుకుని ముద్దులు పెట్టుకుంది.
"షాక్ సర్ ప్రైజెస్ ఇవ్వటం నువ్వు కూడ నేర్చుకున్నావన్న మాట. బావగారు చాల తెలివితేటలు నేర్పారు, హేట్సాఫ్ టు హిం" అంది ఆనందంగా.
"సంవత్సరాలుగా కంటి రెప్పల్ని చెలియలి కట్టలుగా మార్చి దాటిరాకుండా దాచివుంచిన కన్నీటి జలధులు ఒక్కసారిగా పొంగివచ్చినాయి.
బావురుమని ఏడ్చింది గాయత్రి.
"ఏమయింది? ఎందుకేడుస్తావు? చూచి చాలా రోజులయిందనా? ఇప్పుడిక వచ్చేశాగా."
"నువ్వు వచ్చేందుకు ఆలస్యమయిందని జరిగేవి ఏవీ ఆగవు ఆమనీ. అమ్మగారు చనిపోయారు. నువ్వు డార్జిలింగ్ లో వుండగానే పోయారు. నీ చదువు పూర్తి అయిందాకా ఈ విషయం నీకు చెప్పవద్దన్నారు."
"వాటెహెల్. మమ్మీ పోయారా. యూ ఛీట్, నన్ను మోసం చేశావా?" కుప్పకూలిపోయింది.
"నీ ఆశయం పూర్తికావాలని, చదువు మధ్యలో ఆగిపోకూడదని అమ్మ ఆఖరు కోరిక నువ్వు కలెక్టర్ కావటంకన్నా తన మరణవార్త ముఖ్యం కాదని అన్నారు. ఈ దుఃఖాన్ని ఇన్ని సంవత్సరాలు నీతో పంచుకోకుండా నేను ఒక్కదాన్నే భరించాను"
"నువ్వు ఛీట్ వి కావు. నేనే దురదృష్టవంతురాల్ని" అంటూ అక్కని కావలించుకుని ఏడ్చింది ఆమని. వెంటనే కార్యక్రమాలు అన్నీ రద్దుచేసుకుంది.
"కొద్దిరోజులు నీతో వుంటాను పద" అంటూ బయలుదేరింది.
కొద్దిరోజులు అని కాదు. ఇంక నువ్వు నాతోనే వుండాలి. ఆ ఇల్లు, ఆ సంపద, ఆ వారసత్వం అన్నీ నీవే ఆమనీ. మళ్ళీ నగరానికి తిరిగిరావు. అన్నీ సర్దుకుని బయలుదేరు."
అక్కగారు దుఃఖంపట్ల మంచిచెడులను విశ్లేషించి నిర్ణయించే శక్తిని కోల్పోయిందని అనుకుంది ఆమని.స్నేహితులందరికి టాటా చెప్పేసింది ఆమని.
ఇన్ని సంవత్సరాల కబుర్లు వారు రెండు రోజులలో చెప్పేసుకున్నారు.
రాత్రి పగలు తేడా తెలియదు అంతా మర్చిపోయి మాటాడుకున్నారు.
తన జీవితంలో నిండిన విషాదం అంతటిని చెల్లిముందు పరచింది గాయత్రి!
