"చెల్లీ ఆ ఇంటి వారసత్వ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి" అంది!
"నేను పరుగు పందెంలో వున్నాను. ఆ సాంప్రదాయాలు, ఆ కుటుంబ పద్ధతులు ముచ్చట్లు అన్నీ విడిచిపెట్టి చాలా దూరం పోయాను. ఎలా తిరిగి రాగలను?
"ఆ రెండు కుటుంబాల వారసత్వాన్ని తీసుకోగల అర్హత నాకుందని భావించింది అమ్మ. కాని ఆ పదవి ఆ అర్హత నాకు లేకుండా చేశాడు. మన కులదైవంజగదీశ్వరస్వామి. ఆయన సంకల్పం నీ మీదుగా వున్నదేమో!
నువ్వు కలెక్టరు కావాలన్న అభిప్రాయం మార్చుకోవాలి ఆమనీ.
అర్హురాలు అయావన్నదే చాలు. ఉద్యోగం చేయాలనేదేముంది? పరువు ప్రతిష్టలున్నాయి సంపదలున్నాయి? నువ్వు కలెక్టర్ కావటం కన్నా అమ్మగారి స్థానాన్ని భర్తీ చేయటం గొప్ప అని నేను అనుకుంటున్నాను.
ప్రజలమీద అధికారం కావాలని నువ్వు అనుకుంటున్నావు.
అమ్మలా వారి ఆరాధన అందుకోవటం గొప్ప అని నేను అనుకుంటున్నాను ఆలోచించు ఆమని." అంటూ తల్లి మరణ సమయంలో వ్రాసిన ఉత్తరం అందించింది గాయత్రి.
దడదడలాడుతున్న గుండెలతో దాన్ని చదివింది ఆమని.
"-నేను ఏ లోకంలో వున్నా నీవు ఈ వంశాంకురాన్ని అందించే సుముహూర్తం కోసం ఎదురుచూస్తుంటాను. అలా నీవు చేసిననాడు ఏ లోకంలో వున్నా నా ఆత్మ శాంతిస్తుంది. రెండు కుటుంబాల భవిష్యత్తునీ గాయత్రినించి నీకు అప్పగించాడు మన కులదైవం జగదీశ్వరస్వామి. ఈ పవిత్ర బాధ్యత నీవు స్వీకరించినట్లు భావించి-
"తృప్తిగా వెళ్ళిపోతున్నా ఆమనీ!"
ఈ మాటలు ఆమె గుండెల్ని కోశాయి.
తనమీద పూర్తి నమ్మకంతో తన కోరిక తీర్చుతాననే ఆశతో తృప్తిగా చనిపోయింది మమ్మీ. ఇద్దరిలో ఒకరికి పిల్లలు కలగకపోతే కుటుంబాలకు భవిష్యత్తు లేదు.
అమ్మ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి ఆమె కోరిక తీర్చకపోతే అంత ఘనంగా జీవించిన ఆమెకు మరణంలో కూడా అర్ధంలేదు.
అమ్మా! జగదీశ్వరస్వామి మన కులదైవం. ఎందుకో మన కుటుంబాన్ని శపించాడు. ఆ శాపాన్ని మోయవలసిన బాధ్యతను నాకు అప్పగించావు నువ్వు!
పెద్దలు దైవంతో సమానం, నీ కోరిక తీర్చుతాను అనుకుందామె.
అది ఎంత నష్టమైనా కష్టమైనా తల్లి ఆత్మకు శాంతి కలిగించలేని బిడ్డల జన్మ వృధా! ఆమె కోరికలు తనకోసం కాదు. జమీందారీ వ్యవస్థగా రూపొందించిన ఒక అద్భుత సాంప్రదాయం కలిగిన కుటుంబాల కోసం!
ఈ రెండు కుటుంబాల కథ తన వల్ల పవిత్రం కావాలా?
అదే ఈశ్వర సంకల్పం అయితే కాదనేందుకు నేను ఎవరు? అనుకుంది.
గంభీరంగా మారిపోయింది.
"అక్కా! ఒకప్పుడు నేను ఉత్తరంలో వ్రాశాను గుర్తుందా? పెద్దలు నిర్ణయించాల్సింది. ఆ స్థానంలో వున్నావు నువ్వు! కాబట్టి నా మెడలో మాంగల్యం కట్టగలిగిన మగవాడు ఇతడే! అని నువ్వు నాకు ఒక వ్యక్తిని చూపించు తలవంచుతాను అందామె.
"ఆమనీ! నువ్వు ఐ.ఎ.ఎస్. లో రాంకు సంపాదించినా పెళ్ళి విషయంలో మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలని నేను అనుకోలేదు. ఒక వాస్తవం ఈ కుటుంబాన్ని వెన్నాడుతోంది.
అది రెండు కుటుంబాల వంశాంకురం.
దాన్ని ఇవ్వగల శక్తి లేకుండా చేశాడు భగవంతుడు.
అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను.
లవ్ లీ ఆమనీ యూ గెట్ మారీడ్ వాల్మీకి!"
"అక్కా మతిపోయిందా నీకు? వజ్రాల నగలైనా మరొకరి వస్తువుని తాకను నేను."
"చెల్లీ, పురుషుడు సృష్టికర్త! అనుక్షణం తనని తాను సృష్టించుకుంటాడు. పునర్జన్మను పొందుతాడు. మరొకరికి జన్మ ఇవ్వగల శక్తి దానికి లేదు.
వుంటే శీలాన్ని నిండు మనసుతో భర్తకు అర్పించుకున్నా తిరిగి ఆమె కన్య కాలేక పోవటం ఏమిటి? కన్యను ఇల్లాలుగా మార్చే మగవాడు ఎప్పుడు మన్మధుడే! ఒకసారి ఇల్లాలైన స్త్రీ తిరిగి కన్య కాలేదు మరో జన్మ ఎత్తితే తప్ప! వాల్మీకి మళ్ళీ తనని తాను సృష్టించుకుంటాడు.
నీవు నవవధువుగా అతని జీవితంలో ప్రవిశిస్తావే లవ్ లీ ఆమనీ!
పసుపు కుంకుమ గాజులు పుస్తెలు మెట్టెలు అనే అయిదవతనంతో పాటు భగవంతుడు మరో మూడు అక్షరాలను నాకు బహూకరించాడు. గొ....డ్రా....లు!! కాదంటే మరింక నన్ను చూడరు. ఐ.ఎ.ఎస్. బుర్రతో ఆలోచించి నిర్ణయించుకో!"
17
అయిదు రోజులు వంశాంకురం గురించి గాయత్రి ఆమని పోరాడుకున్నారు.
ఆరవరోజు వుదయం నిద్రలేచే వేళకు చీరకొంగుతో ఫాన్ కు వ్రేలాడుతున్న గాయత్రి శరీరాన్ని చూసింది ఆమని! క్రిందికి దింపి ఫస్ట్ ఎయిడ్ చేసింది.
తెలివి రాలేదు. బయటపడకూడదు అనుకుంది కాని తప్పలేదు.
అంబులెన్స్ పిలిపించి ఆమెకు ప్రాణాలు పోయించింది.
ఇరవయి నాలుగు గంటలు కృత్రిమంగా గుండెను ఆడించడం, ఊపిరితిత్తులు పని చేయించటం, రక్తం మార్చివేయటం, ఆక్సిజన్ లాంటి ఉపచారాలన్నీ జరిగాక నీరసంగా కళ్ళు విప్పింది గాయత్రి! ఎదురుగా కనిపించింది ఆమని కాదు వాల్మీకి! నీళ్ళు నిండిన కళ్ళతో నిలబడి వున్నాడు.
అతని చేతిలో ఓ గులాబి రంగు కాగితం రెపరెపలాడుతోంది! ఆమని రాసిన ఉత్తరం.
టెలిగ్రాం అందుకుని హడావుడిగా వచ్చేశాడు!
అపార్టుమెంట్ లో ఆమని లేదు. ఉత్తరం మాత్రమే వుంది.
"కంగ్రాచ్యులేషన్స్ బావా! నువ్వు చాలా లక్కీ ఫెలోవి! ఎందుకంటే నేను నిన్ను పెళ్ళాడేస్తున్నా!!
నిన్ను ఒప్పించే భారం అక్కదే అనుకో! అది ఉత్త వెర్రిబాగుల పిచ్చి మొద్దు! కాని ఈ ప్రపంచంలో నాకు మిగిలి ఉన్న ఏకైక రక్తబంధువు! దాని కోరిక మన్నించమని నేను కూడ నిన్ను కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నా!
కలెక్టర్ గారు కావాలని కలలు కంటున్న కన్నెపిల్ల కాళ్ళ బేరానికి వచ్చిందేమిటా అని ఆశ్చర్యంగా ఉందా? అదే బావా జీవితం!
విధిని ఎవరూ తప్పించలేరని పెద్దలు అంటారు.
శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటివాడు విధికి తలవంచి బోయవాని దెబ్బకు ప్రాణాలను అర్పించుకున్నాడట. జీవితం చాల అందమయినది. కాని దాన్ని నడిపే విధి చాల క్రూరతిక్రూరం. నేనొకసారి ప్రామిస్ చేశాను. పెద్దవాళ్ళు చూపిన వరుణ్ణి పెళ్ళాడుతానని. మాట నిలబెట్టుకుంటున్నాను.
అయిదు రోజుల ఆర్గ్యుమెంట్స్ లో అక్కయను లాజిక్కులు చెప్పింది.
ఐఏఎస్ నాకు నేర్పని తెలివి జీవితం దానికి నేర్పింది బావా!
మనశ్శాంతి పూర్తిగా పోయింది. పిరికిదాన్నయి పారిపోతానని అనుకోకు.
ఈ ఉత్తరం వ్రాస్తున్న రోజుకి నెల తరువాత రోజున మన గ్రామంలో ఉంటా! నీకోసం పెళ్ళి కూతురుగా ముస్తాబయి వస్తానన్న మాట.
పెట్రోల్ అయిపోయిన కార్లకి రీఫిల్లింగ్ స్టేషన్స్ ఉంటాయి.
అలాగే ఇండియాలోమనశ్శాంతి కోల్పోయి ఆత్మ స్థయిర్యం నష్టపడి కర్తవ్యాన్ని ఎదురొడ్డలేని స్థితికి వచ్చిన వారికోసం రీ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవే బదరీనాద్ లోని ఆశ్రమాలు! అక్కడికి పోతున్నా! నా జీవిత కధని మంచు ముద్దలతో చెప్పుకుంటాను. అవి అది విని తెల్లగా నవ్వుతాయో కరిగి నీరై జారుతాయో మరి? చూచి వస్తా!
మొత్తం మీద అక్క సాధించిన విజయం అద్భుతం!
ఏవో పరిస్థితులకి చిక్కి తప్పనిసరి అయి నీ లవ్ లీ ఆమనీ నిన్ను పెళ్ళాడుతానంటుంది అనుకోకు. నువ్వంటే నాకు బోల్డంత ప్రేమ ఉంది బావా!
అయితే నేను ఏ వస్తువునీ మరొకరితో పంచుకోలేను. అది నా బలహీనత!
అక్క ఫాంహౌస్ చూసుకుంటానంది.
ఇంకా చాల వ్రాయాలనుంది. కాని పెళ్ళి అనగానే ఏ ఆడపిల్లకయినా సిగ్గు సహజం! మనం మాటాడుకునే రోజులు ఎన్నో ఉన్నాయి కదా?"
మనసులోని విషాదాన్ని ఆత్మీయతా భావంలో మేళవించింది.
ఆమె ప్రేమ అబద్ధం కాకపోవచ్చు! కాని మచ్చలేని వెన్నెల కిరణం ఆమని! ఆమెను తలదాల్చేవాడు పరమేశ్వరుడంతటి వాడు అయుండాలి.
వాల్మీకి ఈ పరిస్థితి తెలిసి ఎంతో బాధపడ్డాడు.
గాయత్రి ఒంటరిగా వెడతాననటంలో ఆంతర్యం ఇదన్నమాట.
ఒక వంశాంకురం కోసం ఇలా చేస్తోందన్నమాట.
తెలివి వచ్చిన తరువాత త్వరగానే కోలుకుంది గాయత్రి.
ఆమని వ్రాసిన ఉత్తరం ఆమెకు చూపించాడు.
"గాయత్రీ! ఎందుకు తొందరపడ్డావు?"
"మన వంశ ప్రతిష్ట కన్నా ఎవరి జీవితం గొప్పది కాదు"
"చెల్లి మా తల్లిగారికి వంశాంకురాన్ని ఇవ్వగలదు"
"మరి నీకు కావలసిందేమిటి?"
"మన రెండు వంశాల అంకురం కావాలి?"
"నేను ఆమనిని కాక మరొకర్ని పెళ్ళాడితే!?"
"మన వంశాంకురం కలుగుతుంది"


