Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 51

    ఈ కాసులో గర్భాశయం అండాలు విడుదల సవ్యంగా ఉంది.

    మేల్ జీన్స్ లో ప్రాబ్లం లేదు. చాలా సుళువు అయిన ఆపరేషన్.

    ఆపరేషన్ సమయంలో క్రొత్త ప్రాబ్లంలు ఎదురు కావచ్చు అనే అనుమానంతో అయిదువేలు రిజర్వు చేయించారు.

    నెల దాటిన తరువాత ఆమెలో రెగ్యులారిటీ కన్పించింది.

    అయిదు నెలలకే మూడవ నెలలో ప్రవేశించిందా అమ్మాయి.

    ఏకాంతం కోసం ఆ దంపతులు పడే తంటాలు. ఈ ఆపరేషన్ తరువాత నెల తప్పి ఈ కాపురం నిలుస్తుందా? లేదా? అని అమాయకంగా బాధపడే ఆ అమ్మాయి విచిత్రమయిన కదలికల్ని పరిశీలించింది గాయత్రి.

    తల్లి కావడం కోసం స్త్రీలు ఎంత తాపత్రయ పడతారో కళ్ళారా చూచింది.

    కొన్ని సమయాల్లో కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి.

    మరికొన్ని సమయాల్లో పూయని చెట్లని పూయించాను అనే సంతృప్తితో మనసు నిండిపోయింది. ఆమె పరాయి అనుకోలేదు.

    సీమంతం దగ్గరనుండి అన్ని ముచ్చట్లు తాను దూరంగా ఉండి జరిపించింది గాయత్రి. భర్త చేత కానుకలు ఇప్పించింది.

    మంచి వైద్య సదుపాయం ఏర్పాటు చేసింది. బాధ్యతలు తాను తీసుకుంది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు పడింది. పండులాంటి మగబిడ్డను ప్రసవించింది ఆ అమ్మాయి.

    పురుడు వెళ్ళిపోయాక దంపతులు ఇద్దరిని పిలిచింది.

    "మీరు తలిదండ్రులు అయారు. వెనకటి మీ జీవితంలోకి నిశ్చింతగా వెళ్ళిపొండి." అంది. వారు చకితులు అయారు.

    "అమ్మగారూ! మీరు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు మరువలేం. ఈ జన్మ అంతా మీ కాళ్ళ దగ్గర పడి ఉండి సేవలు చేసుకుంటాం. మాకు తిండి గుడ్డ ఇస్తే చాలు" అన్నాడు యువకుడు.

    "నేనేదో సాయం చేశానని ప్రతిఫలం ఇవ్వాలని మీరు అనుకోవటం అది మీ మంచితనం. కాని చేసిన దానికి ఎక్కువ ప్రతిఫలాన్ని తీసుకోవటం పాపం కదా?" అంది గాయత్రి.

    "నా ప్రతిఫలం నాకు వచ్చింది మీరు వెళ్ళిపొండి. మీ గ్రామంలో మీరు స్వేచ్చగా బ్రతకండి. ఇల్లు పొలం వగైరాలు కావాలంటే కరణం గారికి చెప్పి ఏర్పాటు చేయిస్తాను" అన్నదామె.

    వారు సంతోషంగా వెళ్ళిపోయినారు.

    "నీకు వచ్చిన ప్రతిఫలం ఏమిటి?" అని ప్రశ్నించాడు వాల్మీకి.

    "ఊసరక్షేత్రం అని పదిమంది ఆడిపోసుకున్న చోటునించి ఒక మొక్కను మొలిపించటంకన్నా అద్భుతమయిన అనుభవం ఏముంది?" గాయత్రి నవ్వింది.

    ఆమె తిరిగి మాములు మనిషి అయింది. చాలా మార్పు కూడా వచ్చింది. గాంభీర్యం పెరిగింది. ఔదార్యం ఎదుటి వారిని అర్ధం చేసుకునే శక్తి పెరిగాయి.

    అన్నింటికన్నా విధి నిర్దేశానికి ఎంత వారయినా తలవంచి జీవించాలి అనే అవగాహన దాన్ని గాయంగా మార్చుకోకూడదన్న సర్దుబాటు మనస్తత్వం పెరిగాయి. ఆమెలో వచ్చినమార్పు అతనికి ఆనందాన్ని కలిగించింది.

    కాని ఇప్పుడు మరో సరిక్రొత్త సమస్య ఎదురయింది.

    "గాయత్రీ! ఉత్తరం చూచావా?"

    "ఆమని వ్రాసిందట కదా! నేనింకా చూడలేదు."

    "మామూలు క్షేమసమాచారాలు కాదు. రేపు అయిదవ తేదీ ఢిల్లీ నించి వస్తోందట! చదువు పూర్తి అయింది." అన్నాడు వాల్మీకి.

    "అక్క బావలకు శుభాకాంక్షలతో ఒక హాపీ న్యూస్!

    "ఢిల్లీలో ఎగ్జామ్స్ తో పాటు ఇంటర్వ్యూలు టెన్షన్ లు అన్ని ముగిశాయి. ఆగ్రా వెళ్ళి రెండు రోజులు గడపాలంటున్నారు మా బ్యాచ్ లో కొందరు!

    కాదు కాశ్మీర్ వెళ్ళి రావాలంటున్నారు మరికొందరు.

    టెర్రరిస్టుల భయం కూడా లేదు మా వాళ్ళకి! వీళ్ళే టెర్రరిష్టుల్ని మించి పోయారు. ఏది ఏమయినా అయిదవ తేది నగరానికి చేరుకుంటాను.

    అప్పుడే మా క్లాస్ మేట్స్ కొందరు జీవితాల్లోకి చొరపడిపోయారు. కొందరు ఆఫీసులో కొందరు కిచెన్స్ లో మహారాణులైపోయారు,

    అందర్నీ పలకరించటానికి అయిదారురోజులు పట్టదూ!

    ఈ జీవితం తాలూకు ఆకతాయితనాన్ని వదిలేసి జీవిత రహదారిలో ప్రవేశిస్తాం ఇక. చివరిసారిగా అందర్ని చూచి పలకరించి విశేషాలు తెలుసుకుని ఇంటికి వచ్చేయాలని ఉంది.

    ఓ పది రోజుల కన్నా పట్నంలో ఉండలేను.

    ఎందుకంటే ఇంతకాలం ఒక లక్ష్యం ఉంది. కనుక దాని వెంట పరుగెట్టటానికి మిగిలిన ఈ ప్రపంచాన్ని మరచిపోయాం.

    ఇప్పుడు ఎదురుచూడటం తప్ప చేయవలసింది ఏమీ లేదు.

    చదువుకుంటే చాల ఉంది కాని ఇంక విసుగొచ్చేసిందబ్బా! చదవను.

    అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే అక్కా! నాకు వందల సంఖ్యలో మిత్రులున్నారు. చాలా సన్నిహితంగా మెలిగినవారు ఎన్నో సహాయాలు చేసి ఆత్మీయత సంపాదించుకున్న వారు ఉన్నారు. కాని నేనెవర్నీ ప్రేమించలేదు! నాకు ఆ ఊహే ఎన్నడూ రాలేదు.

    పై పేరాగ్రాఫ్ బావగారిని చదవవద్దు అని చెప్పు!

    క్రింది పేరా బాగా చదివి గుర్తుంచుకోమను-

    నేను ఎవరిని ప్రేమించలేదు. మీరు ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆ కష్టసుఖాలు అర్ధం చేసుకోగలిగారు. నాకు మీరే అది దంపతులు!

    ప్రేమ అనేది సృష్టించుకోవాలి సహజంగా కలగనప్పుడు.

    అందువల్ల పెద్దవాళ్ళు చెప్పినట్టు వినదలుచుకున్నా.

    మీరు చెప్పిందే చేయాలనుకుంటున్నా!

    మీరు పోర్టులో దిగగానే విజిటర్స్ లాంజ్ లో ఉండే ఎనౌన్సర్ కట్ బిట్ ని చూపించి దాన్ని పెళ్ళి చేసుకోమన్నా హాయిగా పెళ్ళాడేస్తా! మమ్మీ ఆరోగ్యం అడిగానని ఆశీస్సులు అర్ధించానని చెప్పు!

    ఇట్లు మీ కాబోయే కలెక్టరుగారు అని వ్రాసింది ఆమని.

    ఉత్తరం చదవటం పూర్తి అయే సమయానికి గాయత్రి కన్నులు రెండు చిల్లులు పడిపోయిన కలశాల్లాగ వర్షిస్తున్నాయి. చెంపల మీద చారికలు కట్టి పైటకొంగు తడిచిపోయింది. ఆమె అంతరంగం అగ్ని కెరటాలతో ఘూర్ణిల్లిపోయింది.

    "ఆమని వస్తోందా? ఆశీస్సులు అందించే అమ్మకావాలా?" అంది జీరపోయిన స్వరాన.

    "గాయత్రీ! ఈ విషయం మన ఊరు వచ్చేంతవరకూ దాచి ఉంచటం మంచిదికాదు. చదువు పూర్తి అయింది కాబట్టి చెప్పవలసిన సమయం కూడా ఆసన్నమయింది. మనం నగరానికి వెళ్ళి చెప్పాలి!

    అక్కడే కలుసుకుంటామని టెలిగ్రాం పంపుతాను" అన్నాడు.

    "అలాగే చేయండి! ముందు నేను వెళ్ళి కలుసుకుంటాను."

    "ఒక్కదానివే ఎందుకు? నేనుకూడా వస్తాను."

    "దాంతో మనసువిప్పి మాట్లాడుకోవాలని ఉంది."

    "అలాగే వెళ్ళిరా!" అన్నాడు వాల్మీకి.

    అయిదవ తేదీకి రెండు రోజులు ముందుగానే బయలుదేరింది గాయత్రి.

    ఎ.సి. స్లీపర్ కోచ్ లో ఆమెను వదిలేసి వాల్మీకి వెళ్ళిపోయాడు.

    రైలు బయలుదేరింది. ఒంటరి గాయత్రిని ఆలోచనలు ముసురుకున్నాయి. కూపేలో సహయాత్రికుడు మరొకాయన పలకరించాడు.

    వారితో పరిచయమయింది కాని ఆయన చాల సీరియస్ మనిషి!

    లావుపాటి కళ్ళద్దాలు పెట్టుకుని పెద్ద పెద్ద గ్రంధాల్లో తలదూర్చేశాడు. రైలు కూపే ఆయనకి తనే తెచ్చుకున్న పుస్తకాలతో ఓ గ్రంధాలయం అయిపోయింది.

    మధ్య మధ్య అక్షరాలు కన్పించనప్పుడు గుండ్రపాటి అద్దం తీసి దాన్లోంచి చదువుతున్నాడు. ప్రొఫెసర్ గారికి చదువు మినహా మరో ప్రపంచం ఉన్నట్టు కన్పించలేదు. పుస్తకాలలో పూర్తిగా మునిగిపోయాడు.

    మధ్య మధ్య తలఎత్తి చూచినా ఆ చూపులు ఇహలోకం చూపులు కావు. పూర్తి పరధ్యానం చూపులు. ఎదుట ఉన్న మనిషిని గుర్తించలేని చూపులు.

    రైలు అడవి దారి వెంట పరుగులు తీస్తోంది. ప్రక్కన కొండలున్నాయి.

    ఎందుకో రైలు ఆగిపోయింది. కిటికిలోంచి బయటకు చూస్తే జనం పరుగులు తీయటం హడావిడి పడిపోవటం కన్పించింది. కాని అద్దాలు దింపి ఉండటంనించి శబ్ధాలు మాత్రం విన్పించట్లేదు. కొద్దిసేపయాక కండక్టర్ వచ్చాడు!

    "ఎదుట ఎవరో పట్టాలు పేల్చేశారండి! కనీసం ఎనిమిది గంటలు ప్రయాణం ముందుకు సాగదు. చుట్టూ ఇరవై నాలుగు మైళ్ళ వరకు ఎక్కడా బస్ రూట్ కూడలేదు.

    మీకు తినేందుకేమయినా కావాలంటే ముందే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి! ఆ తరువాత దొరక్కపోవచ్చు. ఇది చాల అందమయిన ప్రదేశం.

    తిరిగి రావాలనుకుంటే దిగండి! మరీ దూరం వెళ్ళకండి. ఇది "అరణ్యం" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉష్ ష్ అని నిట్టూర్చింది గాయత్రి!

    "ఆ వచ్చివెళ్ళిన ఆయన ఎవరూ?" ముఖం ప్రశ్నార్ధకంగా పెట్టి అడిగాడు ప్రొఫెసర్.

    "మన కూపేలో కండక్టర్ వచ్చి వెళ్ళారు"

    "ఓహో! అలాగా! ఏమిటి చాలాసేపు చెబుతున్నాడు"

    అతడు చెప్పిన మాటలన్నీ తిరిగి అప్పగించింది. అంతా విన్న తరువాత "ఏమిటి?" అన్నాడు మళ్ళీ!

    రామాయణం అంతా ఆయన రెండుసార్లు విన్నారు. మళ్ళీ రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు మొదటికి వచ్చేశారు. చాల ఓర్పుగా ఆయనకి పరిస్థితి అంతా మళ్ళీ మళ్ళీ వివరించింది గాయత్రి.

    "అయితే దిగి కాస్సేపు అలా తిరిగి రావటమే మంచిది." అన్నారాయన.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS