మరునాడు సాయంకాలం లలిత భర్త ఆటో తీసుకు వచ్చి "పద, పారిజాతా!" అన్నాడు.
"వాళ్ళతో చెప్పేసి ఇప్పుడే వస్తాను!"
ముందుగా మనోహర్ తో చెప్పడానికి పైకి వెళ్లింది పారిజాత.
మనోహర్ కుర్చీలోకూర్చొని ఏదో పుస్తకం చదువుకొంటున్నాడు.
"వెడుతున్నాను, మనూ!"
"ఉఁ" అన్నాడు మనోహర్.
పారిజాత రెండు నిమిషాలు మౌనంగా ఆగిపోయి వెనుదిరిగింది.
"ఎక్కడికి"
వెనుకనుండి వచ్చిన ప్రశ్నకు వెనుదిరగకుండానే "నాలాంటి వాళ్ళు ఉండే చోటికి" అని చెప్పింది.
"అంటే"
"అనాథ శరణాలయంలో ఉండడానికి వెడుతున్నాను"
"అక్కడైతే నీకు బోల్డు సుఖం దొరుకుతుంది?" మనోహర్ వెటకారంగా అన్నాడు.
"సుఖంకోసం వెళ్ళడంలేదు. ఎక్కడా ఉండడానికి చోటు లేక వెడుతున్నాను. వెనక్కి తిరిగి చురుగ్గా జవాబిచ్చింది.
"చిన్నప్పటినుండి నిన్ను చూస్తూన్నా నిన్ను నేను సరిగా అర్ధం చేసుకోలేకపోయాననిపిస్తోంది. నీకెంత గర్వం! ఎంత పొగరు! ఏం చూచుకొని!"
"ఏం చూసి నువ్వీమాట అంటున్నావు మనూ!"
"మరి ఎక్కడా చోటులేదూ నీకు!"
"ఆ సంగతి నీకు తెలీదా!"
"నాకు తెలిసిందేమిటో చెబుతాను, కొంచెం దగ్గరగా రా" మనోహర్ చూపులు చిత్రంగా మారాయి.
"చెప్పు ఇక్కడి నుండే వినిపోతాను?"
"అక్కడి నుండి వినేది కాదు. ఇలారా!"
"నేను చెప్పడానికి వచ్చాను. వినడానికి రాలేదు!" గిరుక్కున తిరిగి వెళ్ళబోయింది.
మనోహర్ మెరుపులా ముందుకు వచ్చి ఆమె చెయ్యి అందుకొన్నాడు.
"ఇంత నిర్లక్ష్యం ఎందుకు నీకు!" పారిజాత పారిపోకుండా గట్టిగా పట్టుకొని అన్నాడు. "నన్నింకా కాల్చాలని చూడకు పారూ! ఇంకా ఒంటరితనాన్ని భరించలేను!"
"ఛీ! వదులు. ఏమిటీ మోటు తనం?"
"మంచిగా నువ్వు లొంగవు కాబట్టి!"
"ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే ఉన్నానా ఆడదాన్ని"
"నాకు నువ్వొక్కదానివే ఉన్నావు!"
"రజని లేదూ?"
"రజని పరిచయం ఒక పీడ కలగా నేను మరిచిపోవాలని చూస్తున్నా పారూ! నువ్వింకా అదే మనసులో పెట్టుకొని ఆ గాయాన్ని రేపకు!" మనోహర్ వదనం మ్లానమైంది. "మనిద్దరి మధ్యా లేని సంబంధం ఊహిస్తున్నారందరూ. ఇప్పుడు మనం విడిపోయినా వచ్చిన అపవాదు ఎలాగూపోదు. అందరూ అనుకొనే సంబందం మనది కాకపోయినా, నీ పెదవుల మీద ముద్దు పెట్టుకొన్న క్షణం నుండే మన మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. నేనే దాన్ని మభ్యపరచాలని ప్రయత్నించాను! అది నీ మీద ప్రేమలేక కాదు. అమ్మ కాదంటుందన్న భయం. అంతస్తుని కాదనలేని ప్రలోభం. ఈ రెండూ ఈనాడు మన మద్యలేవు"
"నువ్వేకదా నన్ను పంపించేయమని అత్తకు పోరు పెట్టింది!"
"నీ బింకం యెంతదాకా ఉంటుందో చూడాలని"
"చూశావా!"
"చూశాను. దేనికీ వెనుదీయని మొండిదానివి! నీ ముందు నేనే ఓడిపోయాను పారూ! ఎక్కడో అనాథ శరణాలయంలో వెళ్లి ఉండాల్సిన ఖర్మ ఏమిటి నీకు! నేనుండగా నీకా గతి పట్టనిస్తానా?"
"........................"
"ఇంకా నీకున్న అభ్యంతరమేమిటి పారూ!" ఆత్రుతగా ఆమె కళ్ళలోకి చూశాడు.
