Previous Page Next Page 
పరిహారం పేజి 51


    పారిజాతకు జ్వరం తగ్గినా నీరసం తగ్గలేదు. ఎప్పుడూ పక్కవదలకుండా పడుకొని ఉంటూంది.
    "ఇలా ఎన్నాళ్ళు? ఆమెను పంపించే విషయం ఏం చేశావు?" ప్రక్కగదిలో మనోహర్ అనడం వినిపించింది.
    "ఇంకా ఆ పిల్ల సరిగా కోలుకోనేలేదు. ఈ పరిస్థితిలో ఆ పిల్లను ఎక్కడికి పంపించనురా?"
    "నువ్విలా జాలిపడుతూ కూర్చో! బయట నాకు ముఖం ఎత్తుకోకుండా అయింది! నన్ను చూస్తే చాలు ముఖాలు త్రిప్పుకొని నవ్వుతున్నారు!"
    "అసలు కథ నీతోనే ప్రారంభమైందిరా! ఇప్పుడు నన్నంటావేం? ఒక్క నిన్నుచూసే నవ్వుతున్నారా? మొన్న ఆ సావిత్రమ్మ వచ్చి "ఈ పాపంకూడా నీచేతులమీదే జరిగిందా కోమలమ్మా?అలా ఇంట్లో ఉంచుకొనేకంటే కొడుక్కి చేసుకోరాదా?" అని పోయింది. ఆ పిల్ల జ్వరంతో ఒళ్ళెరుగకుండా పడివుంటే ఆపిల్లకు నేను అబార్షన్ చేయించాననుకొంటున్నారందరూ!"
    "అందుకే ఆవిణ్ణి తొందరగా సాగనంపమంటున్నాను!"
    "కాస్త కోలుకోనీరా? పంపించెయ్యక ఉంచుకొంటానా? కాని, ఎక్కడికి పంపించాలన్నదే నాకు సమస్య అయిపోయింది!"
    ఆ సంభాషణ చెవినపడుతోంటే ఒళ్ళంతా కంపరమెత్తినట్టుగా అయింది పారిజాతకు. అప్పటికప్పుడు ఆ ఇల్లు విడిచి పారిపోవాలనిపించింది. ఆవేశంగాలేచి కొంగు కప్పుకొని లలిత ఇంటికి వచ్చింది.
    "రా. పారూ! కూర్చో" ఆహ్వానించింది లలిత. "ఎలా ఉంది ఒంట్లో? వారంరోజుల జ్వరానికే ఎంత చిక్కిపోయావు!"
    "లలితా! మీ ఆయన్ని ఒక సహాయం చేసిపెట్టమను నాకు!"
    "ఏమిటి పారూ?"
    "రేపు నన్ను తీసికెళ్లి ఏదైనా అనాథ శరణాలయం ముందు విడిచి పెట్టమను!"
    ఆవేశంతో, దుఃఖంతో ఎరుపెక్కిన పారిజాత ముఖంలోకి పరిశీలనగా చూసింది లలిత. తరువాత నిదానంగా "ఏం జరిగింది, కోమలమ్మ వెళ్లిపొమ్మందా?" అని అడిగింది.
    "కోమలమ్మ కాదు! కోమలమ్మ కొడుకు!"
    లలిత నమ్మలేనట్టుగా చూసింది. "నువ్వు చెప్పేది నిజమా?"
    "నిజం లలితా! అతడికిప్పుడు నా ముఖం చూడడానికే అసహ్యం! జ్వరంతో చావుబ్రతుకులమధ్య పడివుంటే అతడు నా గది ఛాయలక్కూడా రాలేదు తెలుసా? ఈ మగవాళ్ళు ఎంత స్వార్ధపరులు. తాము కోరగానే అంకితం అయిపోవాలి ఆడది! ఇష్టంలేకపోతే దూరంగా ఆగిపోవాలి! ఆడదానికి అభిమానం రోషం ఇవేవీ ఉండకూడదు!"
    "అసలింతకీ మీ మధ్య ఏం జరిగింది పారిజాతా?"
    రజనితో మనోహర్ వివాహం చెడిపోయాక జరిగిన సంఘటన గురించి చెప్పింది పారిజాత. "రజని చేసిన అవమానానికి ప్రతీకారంగా నన్ను చేసుకోవాలనుకొంటున్నాడు మనూ. అంతే కాని నేను తనకి కావాలనిపించి కాదు! ఏ ఆడదానికైనా తనస్థానం తనకు ఉండాలిగాని ఇంకెవరి స్థానాన్నో భర్తీ చేసేదిగా ఉండకూడదు. అంతకంటే అవమానం ఏముంది?"
    "బాగుంది! అతడి మీది కోపంతో నువ్వు అనాథ శరణాలయానికి వెళ్లి ఉంటావా?"
    "నాలాంటి వాళ్ళకోసమేగా అవి"
    "అనాధ శరణాలయం అంటే కథల్లో. నవలల్లో నలుగురూ చెప్పుకొనే మాటల్ని బట్టి స్పురించే అర్ధాలు మాత్రం వేరుగా ఉంటున్నాయి. అసలు వాటి ఉద్దేశ్యం అనాధలకు ఏదో వృత్తి విద్యో, చదువో నేర్పించి బ్రతుకు తెరువు చూపించాల్సిందిపోయి అనాధను కాస్తా బజారు మనిషిగా మారుస్తున్నాయి. నువ్వు చెడిపోవాలనే అనుకొంటే అక్కడికి వెళ్ళే చెడిపోవడం ఎందుకు?"
    "మరి ఎక్కడికి వెళ్ళను? నన్ను ఎక్కడికైనా పంపించెయ్యమని తల్లిని పోరుపెడుతున్నాడు మనూ! నావల్ల తన పరువు బజారు పాలు అవుతూందట!"
    "మరో నాలుగు నెలలైతే పరీక్ష లవుతాయి. అది కాస్త అయిపోయాక నాలుగు ట్యూషన్లు చూచుకొని వేరే ఉండొచ్చుగాని అంతదాకా మా ఇంట్లో ఉండు పారూ?"
    "ఉహూఁ. నా వెనుకే వస్తాయి కథలూ కావ్యాలూ."
    లలిత చాలాసేపు చెప్పింది చాలా వాదించింది.
    పారిజాత నిశ్చయం మాత్రం మారలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS