ఒకప్పుడు సూరకవి లోయదొంగల బారినుండి తప్పించుకొని చెప్పినది--
మ|| హనుమంతుం డెదుట దివాకరసుతుం డాచెంత సౌమిత్రియు
దను సేవింపఁగ జానకీవిభుఁడు వాత్సల్యంబుతో నిల్చి యిం
పున నన్నెప్పుడు గాచుచుండఁగను నీబోయాధముల్ కిస్కచే
ననుఁ జంపంగలవారె రావుకులజన్మా! రంగ రాయోత్తమా! 542
గంటము చేసి యిచ్చిన కమసాలిమీఁదఁ జెప్పినది--
క|| ముల్లోకంబుల నాలుక
వల్లిపరశురాకీర్తి ప్రబలి వెలుంగు
మల్లీసుమవల్లి జా
బిల్లి మఱి పాలవెల్లి భీష్మునితల్లి. 543
మన్నె దొరలమీఁది పద్యములు--
క|| అర్భుదములు న్యర్భుదములు
బర్బర దేశాధిపతులు పడిగాపులు నీ
దర్భారునఁ బడియుందురు
దోర్బలసంపన్న మన్నెదొరయెరకన్నా. 544
క|| ధీరాగ్రణి శివరామ
క్ష్మారమణుం డేలు చెముడు శంభరపురమా
పోరామారొంపిల్ల
పారాదామంగరాజ పాళెముపట్టా! 545
ఆ||వె|| దేవునాన మున్ను దేశాన కొకకవి
యిప్పు డూరనూర నింటనింట
నేగు రార్గు డేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదునురేసి కవులు పద్మనాభ! 546
పండిత-కవి-ప్రశంసా స్తబకము
నన్నాదరించినపొన్గుపాటివేంకటమంత్రి స్వర్గస్థుఁడు కాఁగాఁ జెప్పినది--
మ|| కరుణాసాగరుఁ బొన్గుపాటికుల వేంకట్రామదాసు వసుం
ధరయం దుంచక స్వర్గలోకమునకుం దర్లించినా నేమి? త
త్పురిఁ గల్పాదులు లేవె యాచకులకు? భూయాచక శ్రేణి కె
వ్వరు ది క్కేమిది మొండిజగ్గడవు కావా? వెఱ్రినై పల్కితి. 547
సమస్య
ఉ|| సారతర ప్రబంధము లసంఖ్యముగా నొసరించునట్టియా
సూరకవీంద్రునిం జానిగి చూత మటంచును మాటిమాటికి
ఈసరమెత్తి దుష్కృతుల నిచ్చినవారల నోరు మొత్తుఁడీ
మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీర లందఱు. 548
కొట్ర బాల (భాస్కర) కవి
ఈయనను గూర్చి యొకానొకబట్టుకవి చెప్పినది -
శా|| భట్రాజు నిరసించి పద్యములు చెప్పం బూనుచో మేటి యౌ
చట్రాతింబలె నున్నవానికిని నిచ్చల్ తెల్వి పుట్టించు నే
కుట్రల్ నేరనిసత్యసంధుఁ డని లోకుల్ మెచ్చ వర్తించు నీ
కొట్రా బాలకవీందు శేఖరుఁడు మాకుం బూజ్యుఁ డెల్లప్పుడు. 549
ఆ బట్టుకవి అడిదము సూరకవినిగూర్చి చెప్పిన పద్యములు.
క|| అంతా కవులము గామా
అంతింతో పద్యసమితి నల్లఁగ లేమా
దంతివి నీతో సమమా
కాంతాసుమబాణ! సూరకవి నెఱజాణా! 550
క|| రవి యెఱుఁగును భువితత్త్వము
భువిలోపల జనుల నెల్లఁ బోషించు సదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్త్వము
కవితాతత్త్వంబు సూరకవియే యెఱుఁగు. 551
దంతులూరి యన్నమరా జనునాతఁ డీ యడిదమువారి రేగమాన్యము నుండి యక్కడి చెఱువు ముఱుగునీరు పోనీక యడ్డుకట్టి చిక్కులు నెట్టు చుండఁగా నీ సూరకవికిఁ దండ్రివరుసవాఁడగు రాసుకవి మోకాలిబంటిలోఁ దనమాన్యమున నిలుచుండి యీ క్రిందిపద్యములఁ జెప్పెనట! అంతట నారాజు కట్టిన యడ్డుకట్టతెగి పల్లమునకు నీరు వంచుకొని పోయెనట!
సీ|| బ్రహ్మాండభాండసంపత్తి కుక్షినిగల్గు
పద్మనాభునిపదాబ్జమునఁ బుట్టి
సకలరత్నాకరస్థానమై యుప్పొంగు
నంబుధీశునిచరణంబు ద్రొక్కి
పరమతత్త్వజ్ఞుఁడై పరఁశంతనుమహీ
రమఱువామాంకభాగమునఁ జేరి
అఖిలోకాధ్యక్షుఁ డై మించి విహరించు
శివుజటాజూటాగ్రసీమ నిలిచి
గీ|| తనరునీవంటిధన్య కుత్తమము గాదు
వూసపాటిమహాస్థానభూమియందుఁ
గాలు త్రొక్కంగ నోడుఁ జండాలుఁడైనఁ
గదలు మిటమాని దివిజగంగాభవాని! 552
సీ|| ఆదిభిక్షుం డీతఁడని రోసి విడియాకు
గొనివచ్చి యిట నిల్వఁ గోరితొక్కొ
జగడాలచీలివై సవతితోఁ బోరాడి
వీఁగి వచ్చి యిచట డాఁగితొక్కొ
నిర్జరాంగన లెల్ల నీఱంకు వెలిపుచ్చ
దూఁబవై యిచ్చోట దూఱితొక్కొ
బీదబాఁవలఁ గష్ట పెట్టుటకై మిన్ను
దొలఁగి యిచ్చోటను నిలిచితొక్కొ
గీ|| వలదు ద్విజభూమిఁ గాల్నిల్ప వరుసగాదు
రవ్వ నీ కేల తగ దంబురాశి కరుగు
నాతి యతఁడె కాఁడటె పిన్న నాఁటిమగఁడు
కదలు మిటమాని దివిజగంగాభవాని! 553
సీ|| భావింప నిలువెల్ల భంగంబులే కాని
భంగము ల్దొలఁగు టెప్పటికి లేదు
తిరుగుచో వంకరతిరుగు డంతియ కాని
తిన్నగాఁ దిరుగుట యెన్నఁడెఱుఁగ
మొనసి రేయుఁ బవళ్ళు మొరయుచుండుటె కాని
మొరయ కూరకయుంట యెఱుఁగ మెపుడు
వరులకల్మిని రోసి పల్చనగుటె కాని
పలుచనిగతి మాని మెలఁగు టెఱుఁగ
గి|| మనుచు నీలోన నీవైన యవగుణంబు
లరసి లజ్జించి దివినుండ కరుగుదెంచి
నిలువునీరైనవీ విందు నిలిచితొక్కొ
కదలు మిట మాని దివిగజగంగాభవాని! 554
సి|| పచ్చిమాంసము కల్లు భక్షించి మత్తెక్కి
రాణించు తిరుగుపరాంసులైన
గంజాయి గుండ హుక్కాలుడికెడి నీళ్లు
ద్రావి మ్రాన్పడెడుతురుష్కులైన
గోవులఁ బడమెత్తి కోసి ముక్కలు మెక్కు
సమదాంధు లగుకొండసవరులైన
తెరవాట్లు గొట్టి కత్తెరదొంగలై చాల
వాలించు తిరుగుచండాలు రైన
గీ|| భూసురక్షేత్ర మిది యన్నఁ బోఁ డొకండు
చిన్నపొలములు బ్రాహ్మణక్షేత్రమునకు
ఘాతుకత్వంబు సేయుముష్కరులుగలరె?
కదలు మిట మాని దివిజగంగాభవాని! 555
