చివరికి,
అంతమందిలో వకుళాంబ నెగ్గలేక పోయింది.
బస్సులోవున్న వాళ్ళ సామానుని క్రింద పడేసి, వాళ్ళని అక్కడనే వదిలి బస్సు వెళ్ళిపోయింది.
22
"అమ్మాయి ఏమయిందో నాలుగు వైపులా చూసి రండి!" వకుళాంబ ఆజ్ఞ జారీచేసింది.
"ఎక్కడకని వెళ్ళి వెతుక్కురాను?" రామానుజాచారి ఆందోళనగా అన్నాడు.
"ఆ కనపడే హోటల్లోకే మేం వెళ్ళాం. నేనేమో హోటల్లోకి వెళ్ళాను. మన అమ్మాయి అదిగో ఆ గోడ వారగా నుంచుంది. సుందరాన్ని ఏమో బస్సు దగ్గరకి పంపించాను. నేను హోటల్లోంచి వచ్చేసరికి అమ్మాయి అక్కడలేదు. అమ్మాయి ఎక్కడ కెళ్ళిందీ అంటే ఏం చెప్పను? వెళ్ళి నలువైపులా చూసి రండి!" వకుళాంబ ఈసురోమంటూ ట్రంకు పెట్టెమీద కూర్చుండిపోయి అప్పుడు చెప్పింది ఆ వివరం.
"అక్కయ్యకి అర్జంటయి ఆ ప్రక్క ఎక్కడికన్నా వెళ్ళిందేమోనే అమ్మా!" అంటూ రెండు వేళ్ళు పైకెత్తి చూపించాడు సుందరాచారి.
"అవునురోయ్! అలాగూ జరిగి వుండవచ్చు" వకుళాంబ ఆశతో అంది.
"నాకేం నమ్మకం లేదు" ఈమాట పైకి అనకపోయినా లోలోపల అనుకుంటూ, కూతురుని వెతకటానికి రామానుజాచారి బయలుదేరాడు.
కూతురు శ్రీమహాలక్ష్మి రూపురేఖలు అన్నీ వివరంగా చెప్పి "అలాంటి అమ్మాయిని ఇటుగా ఎక్కడన్నా చూశారా!" అంటూ రామానుజాచారి షాపుల్లోనూ, కనపడ్డ ప్రతివాళ్ళనీ అడిగాడు.
ఎవరూ చూడలేదనే చెప్పారు. ఒకవేళ చూసినా నిజం చెప్పేటట్టుగా లేవు వాళ్ళ ముఖకవళికలు. చాలామంది ముఖాల్లో హేళన, ఎగతాళి కొట్టొచ్చినట్టు కానవచ్చాయి.
ఈ తఫా రామానుజారిచారి ఒక ఆడమనిషిని అడిగాడు.
శ్రీమహాలక్ష్మి వర్ణనంతా విన్న ఆవిడ, "సరిగ్గా మీరు చెప్పిన లాంటి అమ్మాయి, ఈ వీధి చివరింట్లో వుండగా చూశాను. అక్కడికి వెళ్ళి చూడండి అంటూ ఆమె వెళ్ళిపోయింది.
ఎంతో ఆశతో రామానుజాచారి ఆ సందు చివరిదాకా వెళ్ళి, అక్కడే బయట నుంచున్న ఒకామెతో 'ఈ ఇంటి సంగతి ఒకామె బజారులో కనిపించి చెప్పటం, అమ్మాయి కోసం తాను వచ్చానని చెప్పటం, చేశాడు.
"అలాంటి అమ్మాయే లోపల వుంది. వెళ్ళండి" అంటూ లోపలికి దారి చూపింది.
ఆమె చెప్పింది వింటూనే ఏమీ ఆలోచించకుండా సరాసరి లోపలికి వెళ్ళాడు రామానుజాచారి.
లోపల,
ఒక అమ్మాయి ఎదురు వచ్చింది. చమ్కీ దుస్తులు వేసుకుని బుట్టబొమ్మలాగా వుంది.
ఆ అమ్మాయిని చూస్తూనే "అమ్మాయ్!" అన్నాడు రామానుజాచారి.
ఆ అమ్మాయి ముందుకు వచ్చి రామానుజాచారి చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతూ, "అమ్మాయ్ ఏమిటండీ!" అమ్మాయీ బొమ్మాయీనూ! నాపేరు చాందినీ! చాందినీ అంటూ ముద్దుగా పిలవండి బావగారూ!" అంది చాందినీ.
"బావగారూ!" అంటూ తెల్లబోయాడు రామానుజాచారి. ఆ అమ్మాయి చేతిలోనుంచి తన చేతిని విడిపించుకో జూశాడు కాని, వీలవలేదు ఆ పని ఆయనకు.
"రండి! బావగారూ! ఇక్కడ పగలైనా భయపడ వలసింది ఏమీలేదు. పగలయ్యేది, రాత్రి అయ్యేది ఎర్ర టోపీల వెర్రి నాగన్నలు ఇటు రానేరారు. మీకేం భయంలేదు." కులుకుతూ చెప్పింది చాందినీ.
"ఏమిటీ నీ గోల! నాకేం అర్థం కావటంలేదు." రామానుజాచారి కసురుకున్నాడు.
"అర్థం కాకుండానే ఇక్కడదాకా వచ్చారా!" హేళనగా అని, తన మొరటు భాషలో వివరించింది చాందినీ.
బలంగా ఒక్క విదిలింపుతో చాందినీ చేతిలోనుండి తన చేతిని లాక్కున్నాడు రామానుజాచారి.
