"ఏమో! ఈ మారే ప్రభుత్వాలకి ఎప్పుడేం బుద్ధి పుడుతుందో తెలియదుకదా? ఏదో ఒకనాడు బిరుదు వచ్చి తీరుతుంది గురువా! నా మనసుకి అట్టా అనిపిస్తున్నది."
చెప్పలేం. జరగొచ్చు" గంభీరంగా అన్నాడు వర్ధనరావు.
పచ్చబొట్టు పొడుస్తాం అని అరవటం మరిచిపోయి వాళ్ళట్టా మాట్లాడుకుంటూ ఊరి చివరికి వచ్చారు. అప్పటికీ సాయంత్రం అయింది. ఊరిచివర ముందు తాటితోపు వస్తుంది. దాని వెనుక చేలు చెట్లు చామలు వున్నాయి.
"ఓయ్! ఓయ్! ఓయ్!" అన్న పిలుపు వర్ధనరావుకి వినిపించింది.
"నువ్వేనా నన్ను పిలిచింది?" కోపంతో ముక్కు ఎగబీలుస్తూ అడిగాడు వర్ధనరావు.
"మీరు నన్నలా పిలిచారనుకున్నాను గురువా!" వినయంగా సెలవిచ్చాడు అహోబిలం.
"ఏమి ఈ వింత? తాటిచెట్లు పిలవవు కదా?" అని వర్ధనరావు అనుకుంటున్న వేళ మరోసారి దగ్గరగా పిలుపు వినపడింది.
తిరిగి చూసేసరికి ఓ మనిషి దగ్గరగా వస్తూ కనిపించాడు. కుంటుతూ నడుస్తున్నాడు.
"మమ్మల్నేనా పిలిచింది?" గంభీరంగా అడిగాడు వర్ధనరావు.
"అవును" అన్నాడు ఆ వ్యక్తి.
"మేము రంగురంగుల పచ్చబొట్లు పొడిచేవాళ్ళం. మాతో నీకేం పని? పచ్చబొట్టు పొడిపించుకుంటావా?"
"అక్షరానికి ఎంత తీసుకుంటారు?"
"అర్థరూపాయి."
"రోజుకి మీకెంత సంపాదన వుంటుంది?"
"అయిదు నుంచి పది ఎవరో తప్ప అందరూ పచ్చ పొడిపించు కోరుకదా?"
"అయితే మీరు నాకో పని చేసి పెట్టండి. యాభైరూపాయలు ఇస్తాను" అన్నాడు ఆ వ్యక్తి.
"అమ్మో యాభయ్ రూపాయిలే. ఒప్పుకుందామా గురువా?"
"ఎట్టా ఒప్పుకుంటాం! అదేంటో తెలుసుకోవద్దా! మన పచ్చబొట్ల సీసాలు యిమ్మంటే ఇవ్వగలమా? అదేం కుదరదురా శిష్యగా! విషయం వివరంగా తెలియాలి. అప్పుడు ఆలోచించాలి శిష్యగా!"
"మీలో మీరు తర్జన భర్జన పడకండి. విషయం వివరంగా చెపుతాను. నా పెళ్లాం పరమ గయ్యాళిది. నా కాలు విరగొట్టింది. ఎందుకో తెలుసా! వజ్రాల నెక్లెస్ చేయించలేదని...రాళ్ళ నెక్లెసు కిందటి నేల చేయించాను. ఆ క్రితం నెల ముత్యాల నెక్లెస్ చేయించాను. ఇలా నెలకో నెక్లెస్ చేయించాలంటే నా వ్యాపారం దివాలా తీస్తుంది. వజ్రాల నెక్లెస్ విషయంలో మామధ్య మాటా మాటా పెరిగింది. రోకలిబండతో కాలు విరగకొట్టింది. పారిపోయి వచ్చి ఈ తాటి తోపులో దాక్కున్నాను. నాకోసం అది ఊరంతా వెతుకుతుంది. ఇల్లిల్లు తిరుగుతుందిగాని ఈమారు మూలకి రాదు..."
"సరేకానీ ఈ... నీ...కథంతా మాకెందుకు వినిపిస్తున్నట్లు? కొంపదీసి ఈ...నీ...కథంతా వీపుమీద పచ్చబొట్టుగా పొడవమంటావా ఏంటి?" వర్ధనరావు అడిగాడు.
"అక్కరలేదు. మీరు నాకో సాయం చేయాలి. నేను ఇప్పుడప్పుడే వూళ్ళోకి రాను. అంతవరకూ నాకు తిండి కావాలికదా! నాకు కావాల్సిన తిండి వగైరాలు కొని తెచ్చి ఉదయము సాయంత్రము నాకందిస్తుంటే పూటకి యాభై చొప్పున మీకిస్తుంటాను. నే చెప్పింది చేస్తారా?" ఆశగా అడిగాడు ఆ వ్యక్తి.
"మీ పెళ్ళానికి మీరంతగా భయపడుతుంటే పక్కూరికెళ్ళి దాక్కోవచ్చు. పెద్ద హోటల్ లో దిగొచ్చుగందా?" అహోబిలం అడిగాడు.
"ఓరోరి శిష్యగా! నీకెందుకురా పెద్దోళ్ళ గోల. ఈయనగారు డబ్బిస్తానన్నారు. మనం పని చేసిపెట్టాలి అంతేగందా! హా శిష్యగా!" అన్నాడు వర్ధనరావు ఎదుటివ్యక్తి చూడకుండా కన్ను గీటుతూ.
"హూ...గురువా! నాకు బుద్ధిలేదు. నీ మాటే నామాట గందా! పచ్చబొట్టు సూదిమీద ఒట్టు గురువా!" క్లూ అందించాడు అహోబిలం. రెండుసార్లు గురువా అంటే అర్థం చేసుకున్నట్లు అర్థం.
"సరే ఏం కావాలో చెపితే తెస్తాం స్వామీ!" అన్నాడు వర్ధనరావు.
"మీ యిద్దరూ వెళితే నాకు నమ్మకం ఎట్టా! మీలో ఒకరు ఊళ్ళోకెళ్ళి నేను చెప్పినవి తీసుకురండి. నేనిచ్చిన యాభై రూపాయలు తీసుకుని పొండి మళ్ళీ తెల్లారి రండి. మళ్ళీ నాకు కావాల్సినవి తెండి. మళ్ళీ యాభై ఇస్తాను. ఒకరు నా దగ్గర వుండి రెండోవారు ఊళ్ళోకి వెళ్ళి తేండి. ఆ తర్వాత నమ్మకాన్నిబట్టి యింకా డబ్బు పెంచుతాను. నేను యిక్కడ వున్నట్లు ఎవరికయినా చెపితే ప్రాణం తీస్తాను. తీస్తానంటే నేను చంపుతానని కాదు. మా ఆవిడకి అప్పజెపుతాను. అదసలే బ్రహ్మ రాక్షసి."
"వద్దులే సామీ! ఆడోళ్ళని చూస్తే మాకు భయం. చెప్పండి తెస్తాం."
"మంచిది" అంటూ ఆ వ్యక్తి లిస్టు చదివి జేబులోంచి మూడొందలు తీసి యిచ్చాడు.
