Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 51


    "మన గోవిందరాజులు వకీల్ క్లర్క్ గారి డాటరండీ!" అని.


    "వెరీగుడ్ వెరీగుడ్" అన్నారు జడ్జి.


    గోవిందరాజులు వెర్రి ఆనందంతో కూతుర్ని, ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.


    "ఇప్పుడిక నాకే దిగులు లేదు తల్లీ! నువ్వు తొణక్కుండా కోర్టు హాల్లో ఇలా నిలబడగలిగితే అంతేచాలు. పైకొచ్చేస్తావమ్మా! చాలా పైకొస్తావు" అన్నాడు.


    ఆ ముసలి ప్రాణం కళ్ళలో కనబడే ఆనందం, తృప్తి అవంతిని చలింపచేసినాయ్.


    "నీ బిడ్డమీద నమ్మకం కలిగితే నువ్విప్పుడన్నా విశ్రాంతి తీసుకో నాన్నా! నేను కష్టపడి వర్క్ నేర్చుకుంటాను" అంది ప్రేమగా.


    "ఆ మాట చాలు తల్లీ! నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది. కొంతకాలం నీ వెనకే నేను తిరగాలి. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లు విశ్రాంతి తీసుకొంటాను" అన్నాడు.


    నెల రోజుల్లోనే అవంతికి చాలామంది పెద్దవాళ్ళతో పరిచయం అయింది. పెద్ద పెద్ద లాయర్లుకూడా విరామ సమయంలో ఆమెకి ఏ కేసు ఎలా టాకిల్ చెయ్యాలో చెపుతున్నారు.


    మూడు కేసుల్లో అవంతిని కోర్టు గార్డియన్ గా ఎప్పాయింట్ చేశారు జడ్జిగారు.


    మనోహర్ చేసిన సహాయంవల్ల డబ్బుకి ఇబ్బందిలేదు. కేవలం సరదాగానే కాకుండా సీరియస్ గా మిగిలిన లాయర్లు వాదించే పద్దతి, కేసు లక్షణాలని సూక్ష్మంగా పరిశీలించి ఇన్ అండ్ అవుట్స్ ఎలాగో తెలుసుకుంటోంది.        

        
                                                                               31


    ముచ్చటగా రెండు నెలలైనా కాకుండానే గోవిందరాజులుకి హార్టు ఎటాక్ వచ్చింది.


    అవంతి అధి భరించలేకపోయింది.


    ఆమె ఏడుస్తుంటే గోవిందరాజులు పిలిచాడు.


    "అమ్మా అవంతీ"


    "ఏం కావాలి నాన్నా?" ఆత్రుతగా అడిగింది.


    "నాకు సమయం అయిపోయిందమ్మా, నీకో విషయం చెప్పాలమ్మా" దిగులుగా అంటున్న తండ్రి మాటలకి బోరుమని ఏడుపొచ్చింది అవంతికి.


    "అలా మాట్లాడకు నాన్నా, నాకు భయం వేస్తుంది. ఈ ప్రపంచంలో నాకు నవ్వు తప్ప వేరే దిక్కులేదు. నన్ను ఒంటరిదాన్ని చేసి దగాచేసి వెళ్ళిపోకు ఎంత ఖర్చయినా ఫరవాలేదు. నిన్ను నేను బతికించుకుంటాను" అంది అవంతి కన్నీళ్ళమధ్య.


    అంటున్నదే కాని ఆమెకీ నమ్మకంలేదు. ఇక ఆ ప్రాణం నిలబడదని


    ఆనాడు కేవలం మందులకి డబ్బులేక తల్లిపోయింది. కానీ ఈనాడు తనకి ఆర్థికంగా హెల్ప్ చేయగల పెద్ద అండవుంది. తండ్రి బతకాలేకానీ ఎంతైనా ఖర్చు పెట్టగలదు.


    కానీ ఆ అవకాశం కనబడ్డంలేదు.


    గోవిందరాజులు తను డబ్బు ఖర్చుచేసి పెద్ద డాక్టర్లని తీసుకొచ్చి టీట్ చేయించినా బతకడని అవంతికి అర్థం అవుతూనే వుంది.


    కానీ ఆ ముసలి ప్రాణాన్ని కాపాడాలని ఏమాత్రం ఆమె నరనరాల్లోనూ వుంది.


    గోవిందరాజులు పేలవంగా నవ్వాడు.


    "యమదూతలు గుమ్మంలో వెయిట్ చేస్తున్నారమ్మా నాకోసం, అందుకే నేను బతికుండగానే నీకు చెప్పలేని ఓ విషయాన్ని ఇందులో రాశాను. నేను పోయాక ఆ కవర్లోవున్న వుత్తరాన్ని చదువుకో, అంతా నీకే తెలుస్తుంది."


    అవంతి కళ్ళనుంచి కారుతోన్న కన్నీరు ఆయన చెంపలపైన పడుతోంది.


    గోవిందరాజులు కన్ను మూశాడు ఆ క్షణంలో అవంతికీ ప్రపంచమంతా శూన్యంలా కనిపించింది.


    ఊర్లో పెద్దలంతా వచ్చారు. అవంతి పట్ల ఆదరణ, అభిమానంగల తోటి ప్లీడర్లు, గోవిందరాజులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ దగ్గర పని చేసిన దానికి కృతజ్ఞతగా ప్లీడర్లు, గుమాస్తాలు, కోర్టు స్టాపు వచ్చారు.


    చుట్టుపక్కల ఇళ్ళలోని ఆడవాళ్ళు అవంతిని ఓదారుస్తున్నారు.     


    అవంతి నిర్లిప్తంగా వుండిపోయింది. అంతలో ఆ వూరి చైర్మన్ కృష్ణమూర్తిగారు కూడా వచ్చారు.


    జరగవలసిన తంతుని కోర్టు స్టాప్ చూస్తున్నారు.


    చైర్మన్ కృష్ణమూర్తి అవంతి దగ్గరగా వచ్చాడు.


    "చూడండి, మీరు గోవిందరాజులు గారి డాటరనుకుంటాను" అన్నాడు

    
    అవునన్నట్లు తలూపింది అవంతి.


    "నేను ఈవూరికి చైర్మన్ ని. పేరు కృష్ణమూర్తి. నేను లాయర్ గా చేసినప్పుడు మీ ఫాదర్ నాకు చాలా కేసులు ఇప్పించేవారు. కృతజ్ఞతని కాదు, రుణం తీర్చుకోవాలనీ కాదు. తండ్రిపోయిన దుఃఖం ఎలాంటిదో నాకు తెలుసు. మీకు ఎలాంటి సహాయం కావాల్సినా యదేచ్ఛగా నా దగ్గరకి రావచ్చు అన్నాడు కృష్ణమూర్తి.


    అవంతి తలెత్తి ఓ మారు చైర్మన్ గారికేసి చూసింది.


    "అలాగే" అన్నట్టుగా తలూపింది.


    అటు తర్వాత గోవిందరాజుల శవాన్ని తీసుకెళ్ళిపోయారు.


    అవంతి స్నానంచేసి దిగులుగా కూర్చుంది.


    అప్పుడు గుర్తుకొచ్చింది తండ్రి ఇచ్చిన ఉత్తరం.


    అవంతి కవర్లోంచి కాగితాన్ని తీసింది. అందులో ఇలా వుంది


    "అమ్మా" అవంతీ,


    నేను పాతికేళ్ళ క్రితం రావూ బహాదూర్ జగన్నాధరావు నాయుడుగారి దగ్గర పనిచేసేవాడిని. ఆయనకి నేను చాలా నమ్మకమైన మనిషిని.


    ఇది ఆ రోజుల్లో అంటే దాదాపు ఇరవై రెండేళ్ళనాటి మాట.


    రావూ బహదూర్ గారి కూతురు లలితాంబ పెళ్ళికాకుండానే ఓ ఆడపిల్లని ప్రసవించింది.


    ఆ ఆడపిల్లవి నువ్వేనమ్మా.


    కానీ-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS