Previous Page Next Page 
ఆలింగనం పేజి 52


    ఈ అమృతఘడియల కోసం ఎంతగా తపించిపోయానూ?

 

    నానమ్మ నన్ను చూసి కంటతడి పెట్టుకుంది. "మమ్మల్ని మరిచిపోయావు అనుకుంటున్నాను. ఎంత పనులున్నా మాకన్నా యెక్కువా?" అని నిలదీసింది.

 

    'మీ పనులే నానమ్మా!' మనసులో అనుకున్నాను.

 

    "ఇంక ఎప్పుడూ మాకు దూరంగా వెళ్ళద్దు" నాచెయ్యి పట్టుకుంది నానమ్మ.

 

    "వెళ్ళను. బ్రతికున్నన్నాళ్ళూ ఇక్కడే మీతోబాటే ఉంటాను" అన్నాను.

 

    నానమ్మ చంద్రవేపు చూసింది.

 

    "డబల్ కాట్ కి ఆర్డర్ ఇచ్చాను నానమ్మ" అన్నాడు.

 

    నేను సిగ్గుతో తల ఎత్తలేకపోయాను.

 

    నానమ్మ సంతోషంగా నవ్వింది.

 

    ఇంద్రాణీ, రషీద్ గులాబీతో వచ్చారు.

 

    గులాబీ మనుషుల్ని గుర్తుపట్టి నవ్వుతోంది.

 

    చంద్ర ఎంతో అపురూపంగా ఆపాపని ఎత్తుకుని మురిసిపోతున్నాడు.

 

    నాకు మంచిరోజులు మళ్ళీ వచ్చాయనిపించింది.

 

    మా పెళ్ళి గురించి ఇంద్రాణి నానమ్మతో చర్చించింది.

 

    "ఒద్దు...నేనే వెళ్ళి మాట్లాడ్తాను" అన్నాడు చంద్ర.

 

    "ఏవనీ?" అడిగింది నానమ్మ.

 

    "మీ అమ్మాయి నాకోసం పుట్టిందని నా నమ్మకం అని..." అన్నాడు.

 

    నేను నవ్వుతుంటే ఆనందంతో నాకు కన్నీళ్ళు వచ్చాయి. నాన్నగారు నాకు పెళ్ళిచేయాలనుకుంటున్నారు. నా మనసులో మాట యెలా చెప్పాలో తెలియడంలేదు. వెళ్ళాక ఉత్తరం వ్రాయడమే మంచిదని తోస్తోంది.


                                                          *  *  *


    పొత్తికడుపులో బాగా నెప్పివస్తోంది. చాలా అనీజీగా ఉంటోంది. ఒకసారి పరబ్రహ్మంగారిని కలిసి టెస్టులు చేయించుకోవాలి.

 

    నానమ్మ పెళ్ళికి తొందరపడుతోంది.

 

    చంద్ర వ్యాపారం పనిమీద ముంబై వెళ్ళాడు.


                                   *  *  *


    నేను ఈ బాధ భరించలేకపోతున్నాను.

 

    పరబ్రహ్మంగారు రిపోర్టులు రావడానికి రెండురోజులు టైం పడ్తుందన్నారు. మందులు ఇచ్చారు.

 

    అసలు కదలలేకపోతున్నాను.

 

    నాన్నగారి రిటైర్ మెంట్ రోజుకి ఊరెళ్ళాలి.

 

    నాకు స్వల్పంగా అనుమానంగా ఉంది. నా రెండో కిడ్నీ పాడయిపోలేదు కదా! అందుకే పరబ్రహ్మంగారు చెప్పటానికి హెజిటేట్ చేస్తున్నారేమో!

 

    ఛ! అలాంటిదేం కాదు. నేను ముందు నాన్నగారి రిటైర్ మెంటు రోజుకి వూరెళ్ళాలి. చంద్రకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాను. ఏం అనుకుంటాడో!

 

    హోటల్లో నాన్న మాధవ్ ని ఏ ఉద్దేశంతో పరిచయం చేశారో నాకు తెలుసు. 'నాన్నా...నేను ఒక మనిషిని ఆల్ రెడీ సెలక్ట్ చేసుకున్నానని ఎలా చెప్పడం?'


                                                          *  *  *


    హోటల్ నుండి వచ్చాక కూడా నెప్పి బాగా ఎక్కువయింది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఏదో అనుమానం తెప్పిస్తున్నాయి.

 

    నేను అర్జెంటుగా ఊరెళ్ళి రిపోర్ట్స్ చూసుకోవాలి. ఆ తర్వాతే పెళ్ళి మాటలు!

 

    ఒకవేళ నా అనుమానం కాస్తా నిజమై...జరగకూడనిది ఏమన్నా జరిగితే...భగవాన్! అలా కాకుండా చూడు.


                                   *  *  *


    'జరగకూడనిదే జరిగింది భగవాన్!'

 

    అక్క డైరీ మూసేసి నేను భోరుమన్నాను.    

 

    ఆ ఎర్ర డైరీలో ఎన్ని కలలు...ఎన్ని ఊసులు...ఎన్నెన్ని ఊహలు...అన్నీ విధి కఠినంగా కాలరాచేసింది. తప్పకుండా అక్కకి మిగిలిన కిడ్నీ పాడయి ఉంటుంది.

 

    ఒక జ్యోతిని వెలిగించి తాను ఆరిపోయిన దివ్యజ్యోతి మా అక్క.

 

    డైరీ ఇక్కడే మరిచిపోయి వెళ్ళడం వలన ఆ తర్వాత జరిగిన విషయాలు మాకు తెలిసే ఆస్కారం లేదు.

 

    కాళింది మాటల్లో చంద్ర అపురూపమైన వ్యక్తి! ఒక పురుషుడి నుండి ఏమీ ఆశించకుండా, అతని కోసం ఏమైనా చేసెయ్యగలగడమే ప్రేమ అని నిరూపించింది నిజమైన ప్రేమ!

 

    అటువంటి ప్రేమ నాకు ఎవరిమీదైనా కలిగిందా? నా జీవితంలోకి వచ్చిన పురుషులందరూ నన్ను విపరీతంగా కామించారు. ప్రేమించలేదు! నేనూ ప్రేమించలేదు...ఆకర్షణలోపడ్డాను అంతే!

 

    ప్రేమిస్తే ఈ ఆశలూ, స్వార్థాలూ, అసూయలూలాంటి స్వల్పమైన గొడవలు దరిజేరేవి కావు!

 

    చంద్ర వ్యక్తిత్వాన్ని అక్క ప్రేమించింది. అక్క వ్యక్తిత్వాన్ని అతను గౌరవించాడు. ఇద్దరూ పరస్పరం అభిమానం, స్నేహం ఇచ్చి పుచ్చుకున్నారు.

 

    'నీలాంటి డాక్టర్ సమాజానికి అవసరం!' అని అతనూ 'కాదు...నీలాంటి మానవతావాదే ఎక్కువ అవసరం' అని అక్క అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతని సిద్ధాంతాల కోసం అతను 'నిన్ను పెళ్ళిచేసుకోను' అని తిరస్కరించినా అక్క ప్రేమ లేశమంతైనా తగ్గేది కాదు!

 

    నాకు ప్రేమంటే ఏవిటో చచ్చిపోయిన తర్వాత కూడా బోధించిన అక్క ఎంత గొప్పదీ!

 

    మరి చంద్ర ఏమయ్యాడు? అక్కపోయిన వార్త తెలిసీ ఎందుకు రాలేదు! నాకు అనేక ప్రశ్నలు మెదడుని తొలిచేశాయి. డైరీలో ఎక్కడా అతని ఎడ్రెసులేదు. హైదరాబాద్ కి మకాం మార్చేస్తున్నాడని మాత్రం ఒక చోటవుంది! నాకు అతన్ని కలవాలనీ, ఆ అరుదైన వ్యక్తిని...అక్కకి అత్యంత ప్రేమప్రదమైన వ్యక్తిని చూడాలని మనసు వువ్విళ్ళూరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS