Previous Page Next Page 
ఆలింగనం పేజి 51


    బలహీనంగా "చెప్పండి" అన్నాను.

 

    "నీకో గుడ్ న్యూస్...నీ కిడ్నీ సూట్ అయ్యే పేషెంటు దొరికాడు. అతను అందుకు చెల్లించే డబ్బుతో చంద్రకి సూట్ అయ్యే కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయచ్చు! ఏవంటావ్? ఆలోచించుకో...అట్టే టైం లేదు మరి! హీ ఈజ్ కౌంటింగ్ హౌస్ డేస్" అన్నాడు.

 

    నేను ఆలోచించలేదు "థ్యాంక్యూ డాక్టర్. మీ సహాయం మరువలేనిది. నేను తెల్లవారగానే వస్తాను" అన్నాను.

 

    నాకిడ్నీ అమ్ముకోవడం కాదు అతని కోసం కావాలంటే శిబిలా శరీరంలోని రక్తం, మాంసం తూచి అమ్మాలని ఉంది!

 

    నా ప్రార్థనలు దేవుడు విన్నాడు. నేను యముడిమీద గెలుపు సాధించాను అనుకున్నాను గర్వంగా!


                                                          *  *  *


    నా కళ్ళలోంచి నీటిచుక్కలు టపటపా రాలి కాళింది డైరీ మీద పడ్డాయి.

 

    'ప్రేమంటే నీకు తెలీదు. ప్రతి ఆకర్షణనీ ప్రేమనుకుని పొరపడ్తారు. ఈ వయసులో' అని అక్క ఏ అథారిటీతో చెప్పిందో నాకు అర్థమైంది.

 

    ప్రేమించినవాడి సిద్ధాంతాలకోసం, అతనికోసం ఏదైనా త్యజించడం...చివరికి మృత్యువునైనా నవ్వుతూ ఆహ్వానించడం! కాళింది నా అక్క అయినందుకు ఆ నిమిషంలో ఒళ్ళు పులకరించింది. ఆ ప్రేమమయి ప్రేమని పొందిన చంద్ర ఎంత భాగ్యశాలి!

 

    కళ్ళు గట్టిగా తుడుచుకుని మళ్లీ డైరీలో పేజీలు తిప్పాను.

 

    "చంద్రతో అర్జెంటుగా వూరెళ్ళాల్సొచ్చిందనీ, తాతయ్యకి ఒంట్లో బాగోలేదనీ చెప్పి నమ్మించాను. అతనికి నేను అబద్ధాలు చెప్తానన్న అనుమానమే లేదు. అందుకే నమ్మేశాడు.

 

    నేను పరబ్రహ్మంగారి నర్సింగ్ హోంలో ఎడ్మిట్ అయ్యాను. ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాయి.

 

    "మీకోసం ఎవరో వచ్చారు" అంది నర్స్.

 

    ఎవరై వుంటారు? కొంపదీసి రషీద్ కాదుగదా! అనుకున్నాను. ఆ వచ్చింది ఒక స్త్రీ. ఆమె చంకలో ఓ ఏడాది బాబున్నాడు. ఆమె బాబుని క్రిందకిదించి నా రెండు కాళ్ళూ పట్టుకుని దణ్ణం పెట్టింది.

 

    "అయ్యో! ఏవిటీపని...ఎవరమ్మా మీరు?" అన్నాను.

 

    "మీరు పసుపు కుంకుమలు నిలబెడ్తున్న ఓ ఆడదాన్ని" అంది. ఆమె కళ్ళు నీటి చెలమల్లా ఉన్నాయి.

 

    "అందుకు ప్రతిఫలంగా డబ్బు తీసుకుంటున్నానుగా! ఇంత కృతజ్ఞత అవసరంలేదు" అన్నాను.

 

    "ఎందుకు తీసుకుంటున్నారో డాక్టర్ గారు చెప్పారు. అది విన్నాకే మీమీద ఉన్న అభిమానం రెట్టింపైంది. మాంగల్యం కోసం స్త్రీ చాలా పూజలు చేస్తుంది. అదంతా సెక్యూరిటీ కోసమో దేనికోసమో ఒకరకమైన స్వార్థం! కానీ ఒక మనిషిని బ్రతికించుకుని జీవితంలోకి తెచ్చుకోవాలనుకోవడం...నేను ఊహించలేనిది" అంది.

 

    "ఆ మనిషి నాకే కాదు ఇంకా చాలామందికి అవసరం" క్లుప్తంగా చెప్పాను.

 

    "ఆ మనిషి గురించి నాకు పెద్దగా తెలీదు. కానీ మీరు ఈ పసివాడికి తండ్రిని బహూకరిస్తున్నారు. రేపు వీడి పుట్టినరోజు కూడాను!" అంది..

 

    నేను ఆ బాబుని ముద్దు పెట్టుకుని "ప్రతి సంవత్సరం నువ్వు అమ్మా నాన్నలతో కలిసి నీ పుట్టినరోజు జరుపుకోవాలి" అన్నాను.

 

    ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోయింది.

 

    డాక్టర్ పరబ్రహ్మంగారికి నేనెంతో రుణపడ్డాను. ఇక్కడ నాకు ఆపరేషన్ జరిగేటప్పుడే అక్కడ చంద్రకి మా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.

 

    నేను అహర్నిశలూ ఆ దైవాన్ని ప్రార్థించేది ఒక్కటే...అతన్ని బ్రతికించమని.


                                                          *  *  *


    చంద్ర త్వరగా రికవర్ అయ్యాడు.

 

    నాకు ఇంకా వీక్ గానే ఉంది. డిశ్చార్జ్ అయ్యాక కూడా పదిరోజులు పరబ్రహ్మంగారి ఇంట్లోనే అజ్ఞాతంగా ఉండిపోయాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఆయన మరీ మరీ హెచ్చరిస్తున్నారు.

 

    చంద్రని చూడాలని నేను కొట్టుకుపోతున్నాను. అమ్మా, నాన్న ఆముక్త కూడా గుర్తొస్తున్నారు.

 

    త్వరగా కోలుకుని నా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.


                                   *  *  *


    చాలా రోజులకి చంద్రని ఆశ్రమంలో చూడగానే నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి.

 

    పిల్లలకి చదువు చెప్తున్న అతను నన్ను చూడగానే పరిగెత్తుకొంటూ వచ్చాడు.

 

    "కాళిందీ...ఏమైపోయావు? నాకు ఆపరేషన్ జరిగింది తెలుసా? ఎవరో పుణ్యాత్ములు సహాయం చేశారుట. ఎంత అడిగినా హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళ డీటైల్స్ చెప్పడంలేదు" అన్నాడు.

 

    నేను అతడ్ని నఖశిఖ పర్యంతం తృప్తిగా చూశాను.

 

    "ఇన్ని నెలలు ఏమైపోయావు? నాయనమ్మ నీకోసం కలవరిస్తోంది" అన్నాడు.

 

    "నానమ్మేనా?" చురుగ్గా అడిగాను.

 

    అతను జవాబివ్వకుండా నన్ను హృదయానికి హత్తుకున్నాడు. ఎంతో శాంతిగా అనిపించింది.

 

    "ఇంకెప్పుడూ నన్ను వదిలి వెళ్ళకుండా కట్టేస్తాను"

 

    "ఏం కట్టేస్తారు?"

 

    "తాడు...పసుపుతాడు" నవ్వుతూ చెప్పాడు.

 

    ఆ సమ్మోహనమైన నవ్వుని చూడడానికి ఇంకో రెండు కళ్ళు ఎవరయినా అరువిస్తే బావుండ్ను అనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS