Previous Page Next Page 
ఆలింగనం పేజి 53


    తెల్లవారింది. మళ్ళీ ఒకరోజు మొదలు...ఆ రోజు మాధవ్ చూపించిన పార్ట్ టైం ఉద్యోగంలో చేరాల్సిన రోజు. నీరసంగా పక్కమీద నుండి లేచాను.

 

    ఆరోజూ అలాగే చీకటిపడిపోయింది. ఇంటికి వెళ్ళాలని తొందరపడ్తుండగా.

 

    "ఆముక్తా...ఈయనకి లేటెస్ట్ మోడల్ టైమెక్స్ వాచ్ లు చూపించు" అన్నాడు ప్రొప్రైటర్.

 

    నేను ఉస్సూరుమని నిట్టూరుస్తూ షోకేసుల్లోంచి అన్నీ బయటికి తీశాను.

 

    "హాయ్..." అని వినిపించింది.

 

    తలెత్తితే సిద్ధార్థ నవ్వుతూ కనిపించాడు. ఆ నవ్వు చూసేనా నేను పరవశించినది! ఇప్పుడు మాత్రం నా ఒళ్ళంతా జలదరించింది. చుట్టూ చూశాను.

 

    ఓనర్ ఏవో ఎకౌంట్స్ చూసుకుంటున్నాడు.

 

    "ఎన్నాళ్ళనుండీ చేస్తున్నావు?" అడిగాడు.

 

    నేను ధైర్యం తెచ్చుకుని "మీకు కావాల్సింది త్వరగా సెలెక్ట్ చేసుకోండి...షాప్ మూసేసే టైం అవుతోంది" అన్నాను.

 

    "నాకు కావాల్సింది నేనెప్పుడో సెలెక్ట్ చేసుకున్నాను" అంటూ నా చెయ్యి పట్టుకున్నాడు.

 

    "మర్యాదగా వదులు...లేకపోతే అరుస్తాను" అన్నాను వదిలించుకుంటూ.

 

    "అరు...నువ్వు ఈ గోల్డెన్ స్ట్రాఫ్ ఉన్న వాచ్ నీ జాకెట్టులో వేసుకుని దొంగిలించబోతే నేనే పట్టుకున్నానని చెప్తాను. నాకారూ, స్టేటస్ చూసి జనం నేచెప్పేదే నమ్ముతారు" దర్పంగా నవ్వాడు.

 

    "ఛీ!" అన్నాను. ఇతనా నా కోసం చచ్చిపోతాడేమోనని నేను బెంగపడింది! ఎంత నీచత్వం! నే చేసిన తప్పేమిటి...అమాయకంగా నమ్మడమా?

 

    "ముక్తా...నా ప్రపోజల్ కి ఒప్పుకునివుంటే నిన్ను రాణిలా చూసుకునేవాడ్నిగా! ఎందుకీ ముష్టి ఉద్యోగం. ప్లీజ్...నామాట విను అర్థింపుగా అన్నాడు.

 

    "నేను నలుగురిలో నిర్భయంగా తలెత్తుకుని చేసేపని నాకు గర్వకారణమే! నువ్వు చెప్తున్నా రహస్యమైనా అసహ్యమైనపనే ముష్టికన్నా నీచమైంది!" నా మొహంలో వీలైనంత అసహ్యాన్ని గుప్పిస్తూ అన్నాను.

 

    "ఫూలిష్ గా మాట్లాడకు. ఇక్కడ నెలంతా చేస్తే ఇచ్చేదానికి మూడింతలు ఎక్కువ ఇస్తాను. నాకు ఆడపిల్లలు దొరకకకాదు. కో అంటే కోటిమంది. నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి ఐ లైక్ యూ. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం!"

 

    "అయితే నా దారిన నన్ను వదిలిపెట్టు. నా వెంటపడి వేధించకు...ప్లీజ్!" అన్నాను.

 

    "ఆ మాటే అనద్దు... ఇంకోమాట చెప్పు!" అన్నాడు.

 

    బజార్లో నన్ను నిలబెట్టి బేరమాడ్తున్నాడు. మొహంమీద చెప్పుతో కొట్టాలనిపించింది.

 

    "షట్ అప్ అండ్ గెట్ అవుట్!" అన్నాను.

 

    "పొగరు చూపించకు. నాకు కోపం వస్తుంది. నా కోపాన్ని పిచ్చుకపిల్లలాంటి నువ్వు తట్టుకోలేవు" అన్నాడు.

 

    "పోరా!" విసురుగా అనేశాను.

 

    "ఏం అన్నావే?" కోపంగా ముందుకొచ్చి నా జడ పట్టుకోబోయాడు.

 

    "ఎక్స్ క్యూజ్ మీ...ప్లీజ్!" అన్న అమ్మాయి స్వరం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు.

 

    రఫ్ జీన్స్ టైట్ టీషర్ట్ వేసుకున్న ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి నిలబడి వుంది.

 

    "అలారం క్లాక్స్ చూపిస్తారా?" ఆ అమ్మాయి అడిగింది. నేను బ్రతుకుజీవుడా అని అక్కడి నుండి కదులుతుంటే సిద్దార్థ నాకు మాత్రమే వినపడేలాగా "బయట వెయిట్ చేస్తుంటాను. ఇవాళ తాడోపేడో తేలిపోవాలి" అని వెళ్ళిపోయాడు.

 

    నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఎంత నిగ్రహించుకున్నా కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తున్నాయి.

 

    నేను చూపించినవాటిలోంచి ఆ అమ్మాయి ఒకటి సెలెక్ట్ చేసుకుంది.

 

    ఆమె కౌంటర్ దగ్గర బిల్ పే చేస్తుండగా, నేను బ్యాగ్ తీసుకుని బైటికి నడిచాను.

 

    అక్కడ చీకట్లో పొంచి ఉన్న అతను పెద్ద పులిలా నామీదపడి నోరు నొక్కి కార్లో వేసుకుని వెళ్ళిపోతాడేమో, మళ్ళీ లోపలికివెళ్ళి ఓనర్ తో చెప్దామా అని కూడా అనిపించింది.

 

    కానీ ఆ ఓనర్ ముందు కూడా చులకన అయిపోతానేమో. అంతే ఆడపిల్ల షాప్ లో నిలబడ్తే వీళ్ళకి చిన్నచూపు అనుకుంటూ బయల్దేరాను.

 

    "ఆగు" అని వినపడింది. నేను అనుకున్నంతా అయింది. సిద్దార్థ కారు నా దారికి అడ్డంగా ఆపేశాడు.

 

    "మర్యాదగా ఎక్కు. లేకపోతే పబ్లిక్ లో అసహ్యంగా ఉంటుంది" అన్నాడు.

 

    "చచ్చినా ఎక్కను" అని హెల్ప్ కోసం చూశాను.

 

    సిద్దార్థ నావైపు రెండు అడుగులు వేశాడు.

 

    ఇంతలో పెద్ద చప్పుడు వినిపించింది.

 

    వైట్ మారుతీ లోంచి ఇందాక షాప్ లో అలారం పీస్ కొన్న అమ్మాయి క్రిందకి దిగి, "ఏయ్... మిస్టర్... కార్ రోడ్డుకి అడ్డంగా ఆపడానికి నీ తాతగారి జాగీరనుకున్నారా?...తియ్...తియ్..." అంది.

 

    "హోల్డ్ యువర్ టంగ్... మర్యాదగా మాట్లాడు" సిద్దార్థ అరిచాడు.

 

    "నన్నే అంతమాట అంటావా? నీ మీద ఇప్పుడే కంట్రోల్ రూంకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను. నీ కారు నెంబరెంత?" అంటూ ఆ అమ్మాయి నెంబర్ చూసి సెల్ ఫోన్ లో "హలో ట్రాఫిక్ కంట్రోల్ రూం...నేను ఎస్.పి. గారి అమ్మాయిని మాట్లాడ్తున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS