Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 50

    నువ్వు లేకుండా నేను లేను. ఉండను" అన్నాడు వాల్మీకి.

    "మీరు అతి మంచివారు. గొడ్రాలిని ప్రేమించేవారు ఎవరుంటారు?"

    "మరోసారి ఆ మాట అన్నావంటే నామీద ఒట్టు! డాక్టర్లు దేవుని కన్నా గొప్ప వాళ్లంటావా? మన కులదైవం కరుణిస్తే నీకు పిల్లలు పుడతారు"

    "ఎండిన మోళ్ళు చివురిస్తాయేమో మళ్ళీ వసంతకాలం వస్తే! అదిగో అక్కడే చూచారా? గులాబిచెట్టు! అదెలా ఉంది?"

    "గుబురులెత్తి చాలా అందంగా విరిసిన పూలతో ఉంది"

    "అదలా ఎందుకు ఉందంటారు?"

    "కష్టంలో ఉన్నవారికి ప్రపంచం అంతా విషాదంగానే కన్పిస్తుంది"

    "ఒకప్పుడు అక్కడ నాలాంటి చెట్టు ఉండేది. మొగ్గ తొడగదు. పూలు పూయదు. అమ్మగారు చాల దోహదం చేయించారు. అయినా ప్రయోజనం అనేది లేకుండా పోయింది. వెంటనే దాన్ని ఆ చోటునించి తొలగించి మరో చెట్టు నాటారు. ఇప్పుడు తోట కళకళలాడుతోంది.

    తెలివయిన తోటమాలి ఎవరయినా పనికిమాలిన మొక్కని పెరికి వేస్తారు.

    "గాయత్రీ నువ్వు అంటున్నదేమిటి---?"

    "మీరే నా తోటమాలి అంటున్నాను. మొగ్గ తొడగని మొక్కని పెరికివేసి దాని స్థానంలో మరో మొక్కని నాటమంటున్నానండి!

    "ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ నాకు చెప్పవద్దు గాయత్రీ! నువ్వు లేకుండా నేను జీవిస్తానని అనుకోకు"
    "తోటలాంటి ఈ ఇల్లు కళకళలాడాలంటే కొన్ని కఠినమయిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.

నేనెక్కడికిపోతాను. మీ సేవలు చేసుకుంటూ ఒక మూల పడి ఉంటాను. అదృష్టం ఉన్నవారికి అసూయఉంటుంది.

    దురదృష్టవంతుల పని ఏమిటంటే పరిస్థితులకు తల ఒగ్గటమే!"

    "ఓ గాయత్రి! మళ్ళీ నువ్వు అప్ సెట్ అవుతున్నావు!"

    నా కుటుంబ క్షేమం గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? నా మాటల్లో నా స్వార్ధం కూడ ఉంది" అంది గాయత్రి.

    వర్ధని టీ కెటిల్ కప్పులు ఒక వెండిట్రేలో ఉంచుకుని లాన్ లో కూర్చున్న వారి మధ్యపెట్టి వెళ్ళిపోయింది.

    చాలాసేపు వారి మధ్య సంభాషణ లేకుండా గడిచిపోయింది.

    మెయిన్ గేటు దగ్గర ఒక మనిషి తచ్చాడుతూ కన్పించింది.

    గాయత్రి చెప్పిన తరువాత వర్ధని వెళ్ళి ఆమెను పిలుచుకు వచ్చింది.

    "మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానండి అమ్మగారూ! మీరు విశ్రాంతి తీసుకుంటున్నారట! కష్టపు వార్తలేవి వినకూడదని డాక్టర్ గారు చెప్పారట.

    అందుకని నన్ను ఎవరూ లోనికి రానివ్వలేదు. అని చెప్పుకుందావిడ!

    "ఎందుకు నా కోసం మూడు రోజులుగా తిరుగుతున్నావు?"

    "నాది కష్టపు వార్త అండీ. చెప్పవచ్చు అంటే చెప్తాను.

    ఈ మాటలు విని వాల్మీకి సందేహంలో పడిపోయాడు. చెప్తే ఏమవుతుంది? చెప్పకపోతే ఏమవుతుంది. వేరుగా తనని కలిసి చెప్పకూడదా? ఆ యింటి రక్తంమీద వారికున్న నమ్మకాలు అటువంటివి.

    తాను అంతకన్నా ఎక్కువ చేయదలుచుకున్నా విన్నవించుకునేది అమ్మగారికి. ఆ కుటుంబంవల్ల ప్రజలు పెంచుకున్న విశ్వాసం అది.

    అతడు ఒక నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఆ వార్తవల్ల గాయత్రి మనసుమీద ఎలాంటి గౌరవం అవుతుందో! ముందుగా తాను వినాలనుకున్నాడు.

    కాని ఈ లోగానే గాయత్రి అనుమతి ఇచ్చేసింది.

    "మరేమీ అభ్యంతరం లేదు కాని నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు.

    "అమ్మాయిగారూ! నాకు ఒక కూతురు ఉందండి. దానికి మూడు సంవత్సరాల క్రితం పెళ్ళి చేశాను. పిల్లలు పుట్టలేదు. అత్తింటి వారు ఆరళ్ళు పెట్టారండి. డాక్టర్ పరీక్షలు చేయించాం. అయిదువేలు పెట్టి ఆపరేషన్ చేయిస్తే పిల్లలు పుడతారని డాక్టరమ్మ చెప్పింది.అంత స్తోమత మాకులేదు.

    భర్త విడిచిపెట్టేస్తానంటున్నాడు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడట." అని చెప్పింది.

    "ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారా?"

    "అవునండి. ఈ రోజే వెళ్ళిపోతానంటున్నాడు. తీసుకుపోడట. నీళ్ళు లేని బావిలో చేదవేసి తోడుకోవటానికి నేను వెర్రివాడిని కాదు మామా అని మా వారిని ముఖం మీదే పట్టుకుని అడిగేశాడమ్మా."

    "నీవేమీ భయపడకు. వారిద్దరిని నా దగ్గరకు పంపు అంది గాయత్రి. ఆ వచ్చినావిడ పరమానంద భరితరాలై పోయింది.

    "అలాంటి వాళ్ళని నువ్వేం చేస్తావు?" అన్నాడు వాల్మీకి.

    "నీళ్ళులేని బావిలోకి చేదవేయటం వెర్రితనం అవుతుంది. కాని అయిదువేలు ఖర్చుపెట్టేస్తే ఆ బావిలోకి నీళ్ళు వస్తాయింటున్నారు డాక్టర్లు అతని చేత్తో నీళ్ళు తోడిస్తాను. మీరు చూస్తారుగా." అందావిడ.

    కొద్దిసేపటి తరువాత దంపతులు ఇద్దరు వచ్చారు. చేతులు కట్టుకుని నిలబడ్డారు.

    "ఎందుకు భార్యని వొదిలేసి వెళ్ళిపోతానన్నావట."

    "అయిదువేలు ఖర్చుపెడితే కాని దానికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారని మా రెండు కొంపల్లో ఆ మాత్రం ఖర్చు పెట్టుకునే శక్తి ఎవరికిలేదు. ఇద్దరూ కలిసినా ఆ పని చేయలేమండి. వంశం నిలబెట్టుకోవాలంటే కొడుకులు ఉండాలి కదండి. మరో పెళ్ళి చేసుకోక తప్పదండి."

    "మరి ఈ భార్యని ఏం చేయాలనుకుంటున్నావు?"

    "వొదిలేద్దామని అనుకుంటున్నానండి."

    "ఇంతకాలం కలసి కాపురం చేశావు. దానిమీద ప్రేమలేదా?"

    "ఎందుకు లేదండి. ప్రేమ చాలా ఉంది. కాని వంశాన్ని నిలబెట్టు కోవటానికి వేరే పెళ్ళి చేసుకుంటానండి." అన్నాడు రవంతయినా సందేహం లేకుండా.

    "మరి నీ భార్య అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకున్నావా?"

    "మీరే అడగండి అమ్మగారూ."

    "ఏమే అమ్మీ! మీ ఆయన మరో పెళ్ళి చేసుకుంటానంటున్నాడు.

    "మంచిదే కదండి. చవిటి నేలలో ఇత్తనం నాటేవోడు తెలివితక్కువోడు. నా మొగుడు తెలివి తక్కువవోడు ఎందుకు కావాలి?

    భగవంతుడు నా నుదుట రాసిన రాత ఆ కుటుంబానికి అంటించాలనే కోరిక నాకెందుకుండాలి? నారాత నాదే.

    పై జన్మలో నేనే పాపం చేసానో! ఆ భగవంతుడు నా నుదుట ఈ రాత రాశాడు.

    ఈ జన్మలో అయినా మంచి ఆలోచించాలి కదా.

    పెళ్ళి వొద్దంటే ఆ కుటుంబం పెట్టే శాపాలు వచ్చే జలమలో కూడ నా వెంట పడతై ఎందుకొచ్చిన పాపం ఇది.

    "పెళ్ళి చేసుకోమనండి-అదే మేలు" అన్నదా అమ్మాయి.

    "నేను ఆపరేషన్ చేయిస్తాను. పిల్లలు పుడతారు. అతనితో కాపురం చేస్తావా? నీ యింటిలో చాకిరిచేసి నీ రుణం తీర్చుకుంటా!

    నా ప్రాణాలు పోసి నీ పాదాలు కడుక్కుంటా! బిడ్డ పుడితే నీ పేరెట్టుకుంటా! కట్టుకున్న వాడి వంశాన్ని నిలబెట్టకుండా ఆడ జలమలు అనవసరం కదమ్మా" అంది ఆ అమ్మాయి! వాల్మీకి చిత్రంగా చూస్తున్నాడు.

    ఈ సంభాషణ గాయత్రి మానసిక స్థితి మీద ఏమైనా ఒత్తిడి కలిగిస్తుందా అని ఎంతో టెన్షన్ ఫీలయ్యాడు.

    కాని అలాంటి సూచనలు కన్పించలేదు.

    "నువ్వేం చేస్తుంటావు?" అని అడిగింది.

    "పొలం పనులు చేసుకుంటానండి!"

    "మీ ఇద్దరూ మా యింటిలో ఉండి పని చేసుకుంటారా?"

    వారిద్దరూ ముఖముఖాలు చూచుకున్నారు.

    "అనుమానం ఏమిటి? ఆ పిల్లకి ఆపరేషన్ చేయిస్తాను. మీ వంశం నిలబడుతుంది. మరో పెళ్ళి ఆలోచన ప్రక్కన ఉంచుతావా?" అని అడిగింది గాయత్రి.

    "ఇంకా అనుమానం ఏముంది తల్లీ! ఆ భగవంతుడే మీకు ఈ బుద్ధి కలిగించాడు. బతికినంత కాలం పిల్లా పాపల్ని కంటూ మీ పాదాల దగ్గర పడుంటాం"

    "బ్రతికి ఉన్నంత కాలం కంటూనే ఉంటారా?" అంది గాయత్రి నవ్వుతూ.

    "ఉప్పుకారం తినేటోళ్ళం కదండి మరి!"

    "వంశం నిలపటానికి ఒక్కడయినా చాలు కదా?" అన్నదామె. వర్ధనిని పిలిచి వివరాలన్నీ చెప్పింది. వారిని లోపలికి పంపివేసింది.

    "పేదవారికి సాయం చేయటం క్రొత్తకాదు. డబ్బిచ్చి పంపేయవచ్చు కదా! ఇంటిలో ఎందుకు పెట్టుకున్నావు? ఎలాంటివారో!" అన్నాడు వాల్మీకి.

    "ఆ అమ్మాయి చెప్పిన మాటలు నాకు నచ్చాయి. పూర్వ జన్మలో ఎంతో పాపం చేసుకుంటేకాని గొడ్రాలుగా పుట్టడం జరగదు. ఈ జన్మలో అయినా ఆ పాపాన్ని తుడిచేసుకోవాలి!

    "ఒక మోడువారిన చెట్టు చిగురించి మొగ్గ తొడగటం నేను చూడాలి" అందామె.

    "పోనీలే ఇదో కాలక్షేపంగా ఉంటుంది" అన్నాడు.

    కలిగే ప్రయోజనం ఊహించుకుంటే ఆమె చేస్తోంది ఎక్కువేమీ కాదు. ఒక సంవత్సరం పాటు ఆ మనిషి తల్లి అయిందాకా ఆలోచనలన్నీ ఆ పరిధిలోనే నింపుకుటుంది గాయత్రి! ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు.

    నిజంగానే గాయత్రి ఆలోచనలన్నీ ఆ వైపుకి తిరిగాయి.

    వెనువెంటనే వారిని డాక్టరు దగ్గరకు పంపి పరీక్షలు చేయించింది. గతంలో వచ్చిన రిపోర్టులను వారు కన్ ఫం చేశారు.

    వెంటనే ఆపరేషన్ కి ఏర్పాటు చేయించింది.

    స్వయంగా హాస్పిటల్ కు వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించింది.

    పది రోజులకు యింటికి పంపేశారు.

    మేల్ జీన్స్ స్త్రీ అండాన్ని చేరే మార్గం మూసుకుపోయి ఉందామెలో! పిల్లలు కలగక పోవడానికి చిన్నవి పెద్దవి కొన్ని వందల కారణాలున్నాయి. ఎవరి వైపునించి అయినా కావచ్చు.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS