Previous Page Next Page 
పరిహారం పేజి 50


    కోమలమ్మ ఎగాదిగా చూసింది అతడిని.  "రాత్రి నువ్వు చేసిన పనేమిటి? ఛీఛీ! ఇంకా ఏ ముఖం పెట్టుకువచ్చావిక్కడికి!"   
    "పారు ఏం చెప్పింది మీకు? రాత్రి త్రాగినమైకంలో ఏం వాగానో గుర్తులేదు."
    "బుద్దిమంతుడివి. ఇలాంటి వాడివని కలలోకూడా అనుకోలేదు. దాన్ని బ్రోతల్ హౌస్ కి అమ్మేస్తానన్నావా? అమ్ముకోడానికి నీ తాత సొమ్మనుకున్నావా? బాబు సొమ్మను కొన్నావా? ఎవరూ అడిగే దిక్కులేదనుకొన్నావా?"
    "అమ్మమ్మ! అలా ఎందుకనుకొంటాను? మీలాంటి గొప్ప వారి అండన ఉన్న మనిషని నాకు తెలుసు. రాత్రి నేను త్రాగి తప్పుగా ప్రవర్తించిన మాట నిజం క్షమించమని అడగడానికే వచ్చాను మీ దగ్గరికి" ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు. నిజంగా అతడికి పశ్చాత్తాపంగా ఉంది. ఆ మూడు ముళ్ళు పడకముందే పారిజాతకు తన నిజస్వరూపం తెలిసిపోయిందే అని! త్రాగి కంట్రోల్ తప్పి ఏదేదో వాగి ఎంతపని చేసి కూర్చున్నాడు! పారిజాత సౌందర్యాన్ని బజారులో అమ్మి ఎంత డబ్బైనా సంపాదించగల ననుకొన్నాడు.
    "క్షమించవలసిన మనిషివా? క్షమించాల్సిన పని చేశావా? అది ఇంటికి వచ్చేసరికి టాక్సీలో శవంలా పడిఉంది శవాన్ని మోసుకు వస్తున్నట్టుగా ఇంట్లోకి తీసుకువచ్చాం. దానికి ఏమైనా జరిగితే ఎంత మాట వచ్చేది నాకు? ఇప్పటికే నవ్వులపాలై పోయాం నలుగుర్లో!"
    "పారునే నేను క్షమార్పణ వేడుకుంటాను. ఒకసారి ఇలా పిలువండి."
    "జ్వరంతో స్పృహలేకుండా పడిఉంది పక్కమీద. ఇహ నీ క్షమార్పణలూ, నక్కవినయాలూ కట్టిపెట్టి ఇక్కడినుండి నడువ్!" ముఖం చెడేలా కసిరింది కోమలమ్మ.
    "చాలా ప్రేమ నటిస్తున్నావ్ గా దానిమీద! నీ కొడుక్కే ఇచ్చి చేసుకో ఇంకేం?" గిరిధర్ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు.
    ఇంతసేపు అక్కడే ఉన్నాడు మనోహర్ ఒక శ్రోతగా ప్రేక్షకుడుగా. అన్ని సంగతులూ తెలిసినా అతడు ఒక్క మాట కూడా జోక్యం కలుగజేసుకోలేదు.
    గిరిధర్ వెళ్ళిపోయాక చాలాసేపు ఆవేశం తగ్గక రొప్పసాగింది కోమలమ్మ.
    "ఎక్కడో దారినపోయేది తలకెత్తుకొని ఏమిటమ్మా నీకీ బాధ? ఆమెను ఏ స్టేట్ హోంకో పంపేస్తే సరిపోదా?" అని లేచి వెళ్ళిపోయాడు మనోహర్.
    కోమలమ్మకు పెద్ద సంకటంలో చిక్కుకున్నట్టుగా అయింది. ఈ పిల్ల ఎంత దురదృష్టవంతురాలు! మంచిచేయాలని చూస్తే ఇలా వికటిస్తున్నదేమిటి? ఈ పిల్లను ఎలాగో వదిలించుకొందా మనుకొనేకొద్దీ తన కాళ్ళకే చుట్టుకుపోతోంది. ఆ పిల్లను ఉంచుకొన్నకొద్దీ నిందలూ కథలూ. అలా అని ఏ హోమ్ కైనా ఎలా పంపించెయ్యాలి! ఏ హోముకైనా పంపించడమంటే ఆ పిల్ల జీవితం కావాలని బజారుపాలు చేసినట్టే లెఖ్ఖ. ఏమిటీ అనుబంధం! ఆ పిల్ల ముఖం చూస్తే తను కఠినురాలు కాలేకపోతోంది! తల్లిని పోగొట్టుకొని వచ్చి ఈ కాంపౌండ్ లోనే తండ్రినికూడా పోగొట్టుకొని అనాధైపోయింది.
    మూడు రోజులు మూసిన కన్ను తెరవకుండా పడి ఉంది పారిజాత.
    కోమలమ్మ కంగారు పడి డాక్టరుకి కబురు చేసింది.
    డాక్టరు పరీక్ష చేసి  "ఎన్నాళ్ల నుండి జ్వరం?" అని అడిగారు.
    "ఇవాల్టికి మూడు రోజులవుతుంది"
    "నిన్నా, మొన్నా ఏం చేశారు" అన్నాడాయన కనుబొమ్మలు ముడిచి. ఆయన చీటీ మీద ఏదో గీకి, "ఈ ఇంజక్షన్ వెంటనే తెప్పించండి" అన్నాడు.
    కోమలమ్మ ఆ చీటీ పుచ్చుకొని ఆత్రంగా కొడుకు గదిలోకి వచ్చింది "మనూ! స్కూటర్ మీద వెళ్ళి ఈ ఇంజక్షన్ పట్టుకురారా!"
    "ఇంట్లో ఇంతమంది నౌకర్లూచాకర్లూ ఉండగా నన్ను వెళ్ళమంటావేమిటమ్మా" అన్నాడు.
    "డాక్టరు ఇక్కడే కూర్చున్నాడురా అర్జెంటుగా తెప్పించమన్నాడు."
    "హరిగాడిని రిక్షాలోనో, ఆటోలోనో వెళ్ళి తెమ్మను"
    "చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లమీద నీకీ కాఠిన్యం ఎందుకురా? స్కూటర్ మీద అయిదు నిమిషాల్లో వెళ్ళివస్తావు!"
    మనోహర్ ఏమనుకున్నాడో, తల్లి చేతిలోంచి చీటీ తీసుకుని బట్టలు మార్చుకుని క్రిందికి దిగాడు.
    వారం రోజులు గడిచాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS