Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 52

    ఈసారి గొడవలు  జరుగుతాయి. నీదగ్గర దాచి ప్రయోజనం లేదు. నువ్వు ఆవలిస్తే పేగులు లెక్కపెడతావు. నీతో నిజంచెప్పి నేను వెళ్ళడమేమంచిదనుకుంటాను.రచయితల్ని కొట్టి జైల్లోకి నెట్టిన ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని, ప్రజావ్యతిరేక పండుగని నేను ఖండిస్తాను.

    పేరేమో ప్రపంచ తెలుగు మహాసభలు. కానీ ఇంట్లోవున్న  కవుల్ని బంధిచేశారు. బయటనుండి వచ్చేవాళ్ళకి హారతులు పడుతున్నారు. అదీ తప్పని అనడంలేదు. అసూయ చెందడంలేదు. అయిష్టత  ప్రకటించడం లేదు. ఉడుకుమోర్తనం  అసలుకాదు.

    మనింటి పెళ్ళిది.మనవాళ్ళని ముందు విడిపించండి. తర్వాత సభలు చేసుకోండని  పోరాడుతాను.

    ఈ ప్రభుత్వం పిరికిది. అధికారులు నిరంకుశులు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు బహిష్కరించమని యువతను కోరుతాను. పత్రికలలో  ప్రకటిస్తాను. పోరాట ఘట్టాల్లోనే ప్రజలు పునర్జన్మ పొందుతారు.

    ప్రజల్ని  శక్తివంతుల్ని  చేసేది యువత. ఈ యువతను అణగద్రొక్కాలని  ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నిస్తోంది. ఎదుర్కొనిమట్టు పెట్టేందుకు కలిసికట్టుగా  పోరాడాలి" అన్నారు.

    "తప్పకుండా  మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు  సందేహంలేదు" అన్నాను.

    "అందుకనే  నిన్ను రావద్దనీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వుండమని అంటున్నాను" అన్నారు.

    "మీరిలా అనడం ఏమైనా బాగుందాండీ! మీరులేకుండా  నేనీ పిల్లల్ని పెట్టుకొని ఎలాగండీ వుండడం! మీమాటలు వింటేనే నాకు భయంగా వుంది. ఇదేవిధంగా  మీరు ప్రభుత్వాన్నెదిరించి పోరాటం సాగిస్తే  వాళ్ళు ఊరుకుంటారా? నిస్సందేహంగా జైల్లో  వెయ్యడమేకాదు. ఇంకా ఏం చేస్తారో? అప్పుడు మీరేం చేస్తారు?" అనడిగాను.

    "చెయ్యడానికేముంది సరోజా! జైల్లో తోసేస్తే తిండిసమస్య తీరిపోతుంది. ఉరితీసేస్తే జీవిత సమస్యే తీరిపోతుంది" అన్నారు.

    "చాలా బాగుందండీ మీ సమాధానం. మీ ఆలోచన ఎంతసేపూ  మీవరకు మీ ప్రజలవరకే. ఆ మాత్రందానికి నన్నెందుకు కట్టుకున్నారు? ఈ పిల్లల్నెందుకు__" అని ఇంకా అనబోతూ వుండగా_

    "అసహ్యంగా  మాట్లాడకు సరోజా! మాటవరసకి  అన్నానేకాని  నాకేమీ అవదు. మనవాళ్ళు ఒళ్ళంతా  కళ్ళు చేసుకొని నన్ను కాపాడుకుంటారు" అన్నారు.
    "పోనీ పిల్లల్ని తీసుకొనే వెళ్ళిపోదామండి. నేను మా తమ్ముడింట్లో  వుంటాను.కాస్త మీకు దగ్గరగా వున్నానన్న  తృప్తయినా  వుంటుంది" అన్నాను.
    ససేమిరా ఒప్పుకోలేదు.
    "నేను నీతో మాట్లాడకపోయినా  ఎప్పటికప్పుడు  నీకు నా విషయాలు తెలియజేయిస్తూ ఉంటాను. ఎప్పటి న్యూస్ అప్పుడే  తెలుస్తూ వుంటుంది. నీకు కొత్తగనక బెంగ పెట్టుకొని  మనస్సు పాడు చేసుకుంటున్నావు గానీ నాకీ సంఘటనలు  కొత్తేమికాదు  సరోజా! జైలు కూడా కొత్తకాదు" అన్నారు.

    "అంటే యింతకుముందు జైలు  రుచికూడా చూశారా" అని అడిగాను.

    "ఆఁ నా మహాప్రస్థానం  వెలుగు చూడడానికి  ధనసహాయం  చేసిన మిత్రుడు నళినీకుమార్ తో  కలిసి ఒక హోటల్లో  ఒకరోజు  రాత్రి పది పదకొండు గంటలదాకా  మద్యం సేవించాను. ఇద్దరికీ కొంచెం మత్తు ఎక్కింది. తర్వాత టాక్సీలో ఇళ్ళకి బయలుదేరాం.

    అప్పుడు మందవల్లిలో  అరుణగిరి  మొదలివీధిలో  ఉండేవాడ్ని. మద్రాసులో మద్యనిషేధ చట్టం  అమలులోవున్న  రోజులవి పోసులకు వెంటబడుతున్నట్టు  తెలుసుకొనే స్థితిలోలేము మేము. డ్రైవరు హెచ్చరికలు చేస్తూనే వున్నాడు. ఇద్దరం అలక్ష్యం చేశాం. 

    కచేరి రోడ్డులో  ఒక సందులోవున్న  ఇంట్లో దిగిపోతూ  నన్ను జాగ్రత్తగా ఇంట్లో దింపమని  డ్రైవర్ కి చెప్పాడు.

    టాక్సీ హైరోడ్డులోకి  మళ్ళగానే  నన్ను పోలీసులు అటకాయించారు. సబ్ ఇన్ స్పెక్టర్ నా నోరు వాసన చూశాడు. రాయపేట హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర నేను తాగినట్టు సర్టిఫికెట్ తీసుకున్నాడు.

    'నాకు ఆకలేస్తోంది. యింటికి తీసుకెళ్ళమ'ని  గొడవ చేశాను. ఇంటికి తీసుకువెళ్ళాడు. ముసిల్దానికి ఒకటే ఆందోళన. భోజనం చేశానో  లేదో జ్ఞాపకం లేదు. దాని ఆందోళనని కూడా నేను నోటీసు చెయ్యలేదు.

    రాత్రి రెండున్నర  గంటలప్పుడు  నన్ను మైలాపూర్  పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న గదిలో పడేశారు. పైన తాళం వేస్తూ వుంటే నా  స్వాతంత్ర్యం నాశనం అయినట్టు  తెలిసింది.

    తెల్లారాక  అయిదున్నర, ఆరుగంటలప్పుడు  పెద్దావిడ, నళినీ, ఒక పెద్ద పోలీస్ ఆఫీసరూ వచ్చి నన్ను చూసిన తర్వాత యాభై రూపాయలు జరిమానా చెల్లించి బయటపడ్డాను. ఇది నా మొదటి లాకప్ కథ.

    కాకినాడ  విషయం  చెప్పానుగా. ఫిర్యాదుచేసిన  నన్ను అరెస్ట్ చేయలేదు. కానీ నాలుగుసార్లు పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. కాకినాడ కేసు రివర్స్ అనుకో.

    గుండెధైర్యం  ఒక్కటే  నా ఆస్తీ పాస్తీ. నువ్వు అనవసరంగా బెంగపెట్టుకోకు" అన్నారు.

    ఆరోజూ  పగలూ, రాత్రి టెలిఫోన్లు, ట్రంకాల్స్  వస్తూనే వున్నాయి.

    'ఇక లాభంలేదు  ఈయన  వెళ్ళకతప్పరు. నన్ను తీసుకువెళ్ళరు' అని అనుకున్నాను.

    మొండికేస్తే  ఆయనతో  సాల్లేము. ఎస్ అంటే ఎస్సే. నో అంటే నోనే. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. వారికి సరేసరి.

    మర్నాడు వారి ప్రయాణం.

    ఎక్కడలేని నీరసం. భయం నన్ను ఆవరించాయి. పిల్లల్ని  జాగ్రత్తగా చూసుకోమని వెయ్యి అంపకాలు పెట్టారు. నాకు కొండంత ధైర్యం చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS