కనీసం అయిదారు మైళ్ళయినా ప్రయాణం చెయ్యాల్సివుంటుందేమోననుకున్నాను. బండి కావేరీ వంతెన మీదుగా పోతోంది.
వంతెన దాటగానే 'ఇదే శ్రీరంగం' అని దిగిపొమ్మన్నాడు జట్కావాడు. అప్పుడు తెలిసింది_కావేరీ నదికి ఇవతల ఒడ్డున తిరుచినాపల్లి, అవతల ఒడ్డున శ్రీరంగం అని.
మూడు రూపాయిలు తీసుకున్న జట్కావాడు అప్పటికే మాయమైపోయాడు.
ఎవరో నన్ను 'జట్కాకు ఎంత ఇచ్చావ'ని అడిగారు. 'మూడు రూపాయిల'న్నాను.
'బాగా మోసపోయావు. ఆరు గంటలు దాటిన దగ్గర నుండి అయిదేసి నిముషాలకో బస్సు చొప్పున రెండు వూళ్ళ మధ్యనా తిరుగుతూనే వుంటాయి. తిరుచినాపల్లి నుండి శ్రీరంగానికి టిక్కెట్టు ఒక్క అణా' అన్నాడు. అందరూ నిజాయితీపరులే అన్న భ్రమ నాకెప్పుడూ లేదు. శ్రీరంగంలో దేవాలయం సందర్శించాను. దేవుడ్ని మాత్రం చూడలేదు. అతనెక్కడో గర్భగుడిలో శేషతల్పం మీద నిద్రపోతూ వుంటాడు. అదో పర్మినెంట్ పోజు.
గర్భగుడిలోకి వెళ్ళాలనిగానీ, ఆ దేవుడ్ని చూడాలని గానీ నాకు లేనేలేదు. దేవాలయ శిల్ప సౌందర్యాన్ని మాత్రం చూసి వచ్చేశాను.
రేడియో కార్యక్రమం అయిన తర్వాత కూడా నాలుగైదుసార్లు శ్రీరంగం వెళ్ళానుగానీ మళ్ళీ దేవాలయంవైపు వెళ్ళలేదు" అని చెప్పారు.
* * * *
మేము ఇంటికి చేరుకొనేసరికి, ఉత్తరాలు పడివున్నాయి. బయట ఊరికి వెళ్ళినా, ఉన్న ఊరులో వీధిలోకి వెళ్ళినా, రాగానే ముందు చేసే పని_పోస్ట్ చూసుకోవడం, అవసరాన్ని బట్టి వెంట వెంటనే వాటికి రిప్లయ్ లు ఇచ్చేయడం.
"కాస్త రెస్ట్ తీసుకొని, ఆ ఉత్తరాలు పని చూస్తే, కాదుటండీ" అని నేనంటే...
"నీకు తెలీదు ఊరుకో సరోజా!" అన్నారు.
ఆ రోజు చూసిన ఉత్తరాలో..."ప్రపంచం తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మీరు వెంటనే బయలుదేరి రావాల"ని ఒకటి, మరో ఉత్తరంలో మరికొన్ని విషయాలు...ఇలా నాలుగయిదు ఉత్తరాలుదానికి సంబంధించినవే వున్నాయి.
వివరాలన్నీ ఇక్కడ అనవసరం. కొన్ని మాత్రం రాస్తాను.
మా ఇద్దరి మధ్యా డిస్కషన్ ప్రారంభమయ్యింది. వారి మాటలవల్ల, వారిని తప్పకుండా అరెస్ట్ చేస్తారని నేను అనుకున్నాను. దాంతో ఏడుపులూ రాగాలూ ప్రారంభించాను.
"నేను నా ప్రజలు చెప్పినట్టు నడుచుకుంటాను. నా ప్రజల జీవన్మరణ పోరాటాన్నీ, వారి విజయాన్నీ గానం చేస్తున్న విప్లవ రచయితల సంఘం తీర్మానించినట్టుగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని నేను బహిష్కరిస్తాను.
నా జనం అవతల సాయుధ పోరాటం సాగిస్తున్నారు. విద్యార్ధులు విద్యాలయాల పునాదుల్ని పెకలిస్తున్నారు. యువతరం రాజీలేని అగ్నిపర్వతాన్ని విరజిమ్ముతోంది. ఇదిగో...ఈ రెండు ఉత్తరాలు చదువు" అని నా చేతికిచ్చారు.
చదివి నిర్ఘాంతపోయాను.
"గుండె ధైర్యం ఒక్కటే నా ఆస్తీ పాస్తీ!
సభల సందర్భంగా సన్మానం జరపడానికి అంగీకరించ వలసిందిగా శ్రీ వెంగశ్రావు గారు రాసిన లేఖ ఒకటి, ఈ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రమ్మని మరో లేఖ! సన్మానానికి అంగీకరించనని మొదటి ఉత్తరానికీ, బయలుదేరి వస్తున్నానని రెండవదానికీ జవాబురాసి వెంటనే పోస్టు చేయించేశారు శ్రీశ్రీగారు.
"హైదరాబాద్ కి టిక్కెట్ బుక్ చేస్తున్నాన"ని నాతో చెప్పారు.
"నేనూ వస్తాను. మిమ్మల్నొక్కర్నే వెళ్ళనివ్వను" అని పట్టుపట్టాను.
"నువ్వు రావడానికిక వీల్లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూవుండు.
మనిద్దర్లో ఎవరో ఒకళ్ళం పిల్లల్ని అంటిపెట్టుకు వుండాల"ని అన్నారు.
"మరి ఇన్ని ఊర్లకి మీతో వస్తున్నాను. అన్నిటికీ పిల్లల్ని వదిలేసేగా మీతో వస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వదలడం ఏంవుంది? నేను రాకతప్పన"న్నాను.
"నామాట విను సరోజా! నేనెందుకు చెప్తున్నానో అర్ధంచేసుకో" అన్నారు.
నా సందేహం మరీ హెచ్చయ్యింది.
"నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నించకండి. అన్నిచోట్లకి నన్ను తీసుకొని వెళతారు. ఇక్కడికిమాత్రం ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏమిటి?" అని నిలదీశాను.
"ఎందుకలా భయపడతావు సరోజా! నాకేం ఫరవాలేదు. నేనొక్కడ్నని అనుకోకు. ఆంధ్రదేశం అంతా నాతోవుంటుంది. నా ప్రజలు, నా యువతరం అందరూ నన్ను వెయ్యికళ్ళతో కాపాడుకుంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సెందుకు పాడుచేసుకుంటావు?" అన్నారు.
"అయినప్పుడు నన్ను తీసుకెళ్ళాడానికి మీకేమిటి అభ్యంతరం?" అని అడిగాను.
"మళ్ళీ చెప్తున్నాను. నువ్వు రావడానికి వీల్లేదు సరోజా! నీ అంత పెంకి ఘటాన్నే నేనుకూడా. నువ్వు ఉత్తమొండివైతే నేను శతమొండిని. కారణం లేకుండా ఏపని నిన్ను చెయ్యమనను.
