క|| చుక్కలవలెఁ గర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
గ్రిక్కిఱిసి పిక్కటిల్లెను
వెక్కనముగా పోన్గుపాటి వెంకటమంత్రీ! 524
క|| వెన్నెల వలె , గర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నె కెక్కెను
విన్నావా? పోన్గుపాటి వెంకటమంత్రీ! 525
పూసపాటి సీతారామరాజుగా రోకప్పు డెకవచనమున సంభోదించి నందులకుఁ గుపితులు కాఁగా సూరకవి చెప్పిన పద్యమొకటి:--
క|| చిన్నప్పుడు రాతికేళిక
నున్నప్పుడు కవితలోన యుద్దములోన
వన్నె సుమీ రాకొట్టుట
చెన్నుగ నోపూసపాటి సీతారామా! 526
చ|| ఇరువది మూఁడు పూరుషము లిప్పటి కయ్యేఁ గవిత్వ వృత్తిచే
నరవతు లెల్ల మెచ్చఁ బదునాల్గుతరంబులు మించుపిమ్మట
వేరవగు జీవనస్థితి లభించుట తొమ్మిది యయ్యెఁ బూరుషాం
తరములు నిక్కళింగవసుధాధవు చెంగట నాశ్రయించుటల్. 527
పూసపాటి పెద్ద విజయరామ మహారాజుగారు బాదుల్లాఖాను తోడి యుద్దము నుండి తిరిగివచ్చుచుండఁగాఁ ద్రోవలోఁ జూచి సూరకవి చెప్పిన పద్యమిది యొకటి!
సీ|| గరిడీలలోపల గంతు వేయుట కేమి
యీఁటే వట్టి యరిపై దాఁటవలేను
సొగసుగ మొలకత్తి బిగియఁ జేక్కుట కేమి
వెఱవక వైరుల నఱకవలెను
మాటిమాటికిఁ జెడ్డ మాట లాడుట కేమి
యదలించి రివులఁ జెండాడవలెను
ఱొమ్మున నేర్రగందమ్ము పూయుట కేమి
గాయంపు నెత్తురుల్ గ్రమ్మవలెను
గీ|| కాని లేకున్న సత్కీర్తికాంత గలదే
పూసపాటికులాంభోదిపూర్ణసోమ!
సమరజయభీమ! గజపతి సార్వభౌమ!
విమలసద్గుణరామ! శ్రీవిజయరామ! 528
సూరకవి తన శిష్యులఁ గూర్చి చెప్పినదఁట :-
గీ|| పారమందిరి యక్కినపల్లివారు
దుక్కిచేతను దీర దెందువుల కెల్ల
దూసి కృష్ణుండు చదువంటేదుఃఖపడును
ధీరుఁడై నిల్చే మురపాక సూరసుకవి. 529
చింతకాయ లిచ్చిన వాని మీఁది పద్యము-
గీ|| బండ్లు నోడలు పట్టవు పలుకులైతే
చేరి వేఁడిన నీఁడాయేఁ జింతకాయ
కొండశంబాములో రాచకొడుకుకన్న
శంబమున మేలు రేగాని సన్నిగాఁడు. 530
బాచన్న మీఁది పద్యము --
క|| బాచా బూచులలోపల
బాచన్నే పెద్దబూచివళ్ళు దాను
బూచంటె రాత్రి వెఱతురు
బాచన్నను జూచి పట్టపగలే వెఱతుర్. 531
శృంగవరపుఁగోట జమీనుదారు రాజభూపాలరాజుగారు విజయ'నగరపు పూసపాటివారితోఁ బోరాడఁబూనఁగాఁ జెప్పిన పద్యము -
గి|| విజయరామమహారాజవీరుఁ డేలు
వట్ట ములికించే రాజభూపాలరాజు
కడను మాటల కేమి యీ కాలమునకు
బుర్రే నవ్వెను బులితోఁక గొర్రె కఱచె. 532
వర్లాకిమిడి రాజుగారి మీఁదఁ జెప్పి న పద్యములు -
క|| గోవింద ద్వాదశివలె
నే వచ్చితి రాకరాక నీనగరికి నో
పావనగుణ నారాయణ
దేవుమహారాజ సాహితీనవభోజా! 533
క|| నీ విచ్చుబత్తేక ర్చొక
భూవల్లభుఁ డిచ్చు త్యాగమున కెన వచ్చు
బావనగుణ నారాయణ
దేవుమహారాజ సాహితీనవభోజా! 534
క|| వారిధికిని వారిధియే
మీరునగంబునకు సాటి మీరునగంబే
నారాయణదేవుకు సరి
నారాయణదేవు గాక నరవతు లేదురా? 535
పాల కొండను గూర్చి చెప్పినది --
శా|| రాజా జారుఁడు మంత్రి నిర్దయుఁడు నీ రాష్ట్రంబులోఁ బెద్దలా
కోజుల్ కొండలు జీవహింసకును సంకోచింప రేవ్వారికి
దాజీ మీయరు పాలకొండపూరిలో దాక్షిణ్యశూన్యత్వ ,మీ
ఫాజీపట్టణ మేళ వచ్చితివి నాపాపంబు సర్వేశ్వరా. 536
మ|| నరసింగుండును వెంకుపాత్రుఁడును గృష్ణా పాత్రుఁడు నాయుఁడు
శరభాపాత్రుఁడు పాలకొండధరణీసామరాజ్యదౌరేయులై
ధర వర్దిల్లెడు రామభద్రనృపునాస్థానంబునం బంచముల్
చిరకాలంబుగ వీరి వెంటఁ దిరుగ జీచీ మనం బొప్పునే. 537
బత్తుల అయ్యన్న యానూ దాతనుగూర్చి చెప్పిన వానిలో -
క|| ఇచ్చెడు వానికి, రణమునఁ
జోచ్చెడు వానికిని గాక సురుచిరకీర్తుల్
వచ్చునే వందకు లోభికిఁ
బచ్చని విల్కాఁడ వయ్య బత్తులయయ్యా! 538
గీ|| చేఁదుఁ బట్టువేళఁ జెలఁగి యేడ్చును బిడ్డ
యంత కంత సుఖము నదియె యిచ్చు
నర్ది యడుగు వేళ నది కష్ట మనిపించు
ననఘచరిత బత్తులయ్యనార్య. 539
పాలకొండ ప్రాంతమును గూర్చి ------
శా|| క్షేమాకీర్ణధామములు నక్షీణేక్షురంభాటవీ
స్టోమంబుల్ బహుశాలిధాన్యతరు లేచ్చోట నదీ మాతృక
గ్రామంబుల్ బహుళాగ్రహారము లనేకంబుల్ ధరం జూడఁగాఁ
క్షామం బన్నది లేదు క్షీరగిరిదేశంబందు నెం డేనియు . 540
కొట్రబాలకవియు సూరకవియు సమకాలమువారు. వీ రిర్వుర వాగ్ధాటి కోడి పర్వతా లను పేరుగల కవి యొకఁ డూడనిఁబాడెను.
అ||వె|| రుని నొగల మీఁద హరి యున్న చందాన
సూరకవివరేన్యూజోకఁ గూడు
కొట్రబాలకవియకుంఠ వాగ్దాటికీఁ
బర్వతాలు గాఁడు పాఱిపోయే. 541
