Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 51


    సాధారణంగా ప్రభుత్వ అతిధి గృహాలను ముందుగానే రిజర్వు చేసుకోవలసిన అవసరం వుంది.
    పిక్చర్ షూటింగ్ లు వంటివి ఏమైనా వుండేట్టయితే ముందుగానే పై అధికారుల అనుమతి విధిగా పొందవలసి వుంటుంది.
    వాచ్ మన్ కోటేశు విజిటర్స్ ఇచ్చే టిప్స్ కు అలవాటుపడి గెస్టుహౌస్ ను ఇతరులకు ఇస్తున్నట్టు గ్రహించాడు వీరేష్.
    ఆ బెడ్ మీద పడుకోవాలనిపించక, కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు.
    సరిగ్గా అప్పుడు గోడగడియారం అర్థరాత్రి దాటి రెండు గంటలు కొట్టింది.
    గది బయట గాజులు గల గల మన్న శబ్దం లయ విన్యాసంగా వినిపించింది.
    ఒక స్త్రీ నడుస్తున్న సూచనగా కాలి అందెయలు ఘల్లు ఘల్లు మన్నాయి.
    మరొక్క క్షణం గడవగానే ఆ శబ్దం గది తలుపులు దగ్గర ఆగిపోయింది.
    ఆ క్షణాన స్మశాన నిశ్శబ్దం ఆవరించిందక్కడ.
    "తలుపు తెరవండి....తలుపు తెరవండి" అంటూ ఒక స్త్రీ పిలుపు తగ్గుస్థాయిలో వినిపించింది.
    వీరేష్ క్షణం ఆలోచించి కుర్చీలోంచి లేచాడు. అతను తలుపు తెరవగానే ఆ స్త్రీ హఠాత్తుగా గదిలోకి ప్రవేశించి తలుపులను మూసివేసింది.
    అతని శరీరం క్షణం గగుర్పాటుకు గురయింది. తన కళ్ళను తనే నమ్మలేనట్టు చూశాడు. తన ఎదురుగా అప్సరస కనిపిస్తున్నది!
    ఆశ్చర్యం, అద్భుతం...ఇత్యాది అవస్థల నన్నింటిని అధిగమించి ఆమె ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది వీరేష్ కు.
    అప్పటికే ఆ స్త్రీ వీరేష్ ను ఆపాద మస్తకం పరిశీలనగా చూసింది. ఆమె శరీరంలో అలజడి ప్రారంభమయింది.
    కనులు మత్తు మత్తుగా మూతలు పడుతున్నాయి. తన పరువాన్ని దాచుకోలేనట్టు ఆమె విరహ తాపానికి గురవుతున్నది.
    "ప్రియా!"__ఆమె నోటివెంట మాటలు వచ్చీరానట్టు అస్పష్టంగా వినిపించాయి.
    ఆమె పరిస్థితి అర్థంకావడం లేదు వీరేష్ కు.
    ఆమె అందం, చందం, కట్టు బొట్టు అంతా సినీతారను మించినట్టు వున్నాయి.
    చూపులు, చేష్టలు అభిసారికను మరిపించేవిగా వున్నాయి!
    ఒక పరాయి పురుషుని ఎదుట ఎవరో తెలియని ఒక యువతి విరహ వేదనను అభినయిస్తున్నది!
    వీరేష్ లో వివేచన మేల్కొంది. అతని ఆలోచనలకు ఒక రూపం వచ్చింది.
    తనొక పోలీసు ఆఫీసరునని అతడా క్షణంలో మరచిపోలేదు.
    "ప్రియా! నడిజాము దాటింది! ఇంకా ఆలస్యం ఎందుకు? రా ప్రియా" ఆమె గోముగా అంటూ బెడ్ మీద కూర్చుంది.
    వీరేష్ కళ్ళలో ఎర్రని జీర ఏర్పడింది. అతని ముఖంలో రంగులు మారాయి.
    ఆమెను బెడ్ మీదనుంచి క్రిందకులాగి చాచి లెంపమీద చరిచాడు.
    ఊహించని అతని చర్యకు ఆమె క్షణం కొయ్యబారిపోయింది.
    "మీరు...మీరు....సినిమా యాక్టరు కారా?" అమాయకంగా అడిగిందామె.
    కాదన్నట్టు తల అడ్డంగా వూపాడు వీరేష్.
    అతనిని అనుమానంగా చూసిందామె.
    "మరి మీరు..." ఆమె తనలోని కంగారును కప్పిపుచ్చుకుంటూ అడిగింది.
    "ఐయాం పోలీస్ ఇన్ స్పెక్టర్ వీరేష్!" గంభీరంగా అన్నాడు.
    ఏదో వినరానిది వింటున్నట్టు ఒణికిపోయింది.
    అతను ఊహించని విధంగా ఆమె తలుపు వైపుకు గబుక్కున పరుగెత్తింది.
    వీరేష్ ఒక్క ఉదుటన ఆమెకు అడ్డు నిలిచాడు.
    "ఎవరు నువ్వు?" వీరేష్ గొంతు ఖంగుమంది.
    "చెబుతాను, నన్నేం చేయొద్దు..." ఆమె నేలమీద చతికిలపడిపోతూ అంది.
    "నా పేరు రాణి. ఈ బంగళా వాచ్ మన్ కూతుర్నే! అంతకుముందు వచ్చిన సినిమా ప్రొడ్యూసరు తను తీయబోయే పిక్చరులో వేషం ఇస్తానన్నాడు. మీరు ఆయన తీయపోయే సినిమాలో హీరో అనుకున్నాను. మీ దగ్గరకు వచ్చాను...." చెప్పడం ఆపి ఆమె సిగ్గుతో తలవంచుకుంది.
    "పిక్చర్ తీస్తామన్న వాళ్ళ అడ్రసు నీకు తెలుసా?" ఆత్రుతగా అడిగాడు.
    "తెలీదు..."
    "పోనీ వాళ్ళ పోలికలు, వాళ్ళతోపాటు ఎందరు ఆడవాళ్ళు వుంది చెప్పగలవా?"
    "వాళ్ళంతా ఆడా మగా కలిసి చాలామంది వున్నారు. వాళ్ళు ఎవరెవరో చెప్పలేను. వాళ్ళని మరోసారి చూస్తే గుర్తుపట్టగలను...." అంది.
    "ఈ గెస్టుహౌసుకు వాళ్ళు కాక యింకెవరైనా ఆడా మగా కలసి వచ్చారా?"
    రాణి లేదన్నట్టు తల వూపింది.
    "ఈ బెడ్ మీద వేసిన బెడ్ షీట్ అప్పటినుంచి వాష్ చేయలేదు కదా!"
    చేయలేదన్నట్టు తల వూపిందామె.
    "వాళ్ళు వెళుతూ, వెళుతూ వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఇక్కడ వదలి వెళ్ళారా?"
    ఆమె క్షణం ఆలోచించింది. వెంటనే ఏదో స్ఫురణకు వచ్చినట్టు బెడ్ ఎత్తి తలవేపు పెట్టిన ఒక విజిటింగ్ కార్డును తీసి వీరేష్ చేతిలో పెట్టింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS