"వాళ్ళు వెళుతూ వెళుతూ ఈ కార్డు ఇచ్చారు. నన్ను టౌన్ కు వచ్చి ఆ అడ్రస్ కు రమ్మని చెప్పారు. అక్కడ సినిమాలో వేషం యిస్తాం అన్నారు..." అంది.
వీరేష్ కార్డులోని చిరునామా చూశాడు.
అతనికి వెంటనే కర్తవ్యం బోధపడింది.
బెడ్ షీట్ ను జాగ్రత్తగా మడచి సూట్ కేసులో సర్దాడు.
గదికి తాళం వేసి, ఆమెను తీసుకుని కారులో టౌన్ వైపుకు బయలుదేరాడు.
* * * *
తెల్లవారుఝాము.
యావత్ పట్టణం నిద్రాదేవత ఒడిలో పవళించి ప్రశాంతంగా వుంది.
వీధి లైట్లు అన్నీ వెలుగుతున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా వున్నాయి.
సరిగ్గా అదే సమయానికి పికప్ వ్యాన్ నిండా సాయుధ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
ఇన్ స్పెక్టరు వీరేష్ అప్పటికే ఆ ప్రదేశానికి చేరుకొని దానికి వున్న నాలుగు దారులను గుర్తించాడు.
అతని ఆదేశానుసారం ఆ ఇంటిని నలువైపులా సాయుధులు చుట్టుముట్టారు.
తనవెంటనే వున్న ప్రత్యక్ష సాక్షి రాణికి భయం లేదన్నట్టు కళ్ళతోనే సైగ చేసి ముందుకు పంపాడు వీరేష్.
ఆమె ఆ ఇంటి మెయిన్ గేటు దగ్గర వున్న కాలింగ్ బెల్ నొక్కింది.
ఇంటిలో ఒక్కసారిగా అన్ని లైట్లు వెలిగాయి.
కొన్ని క్షణాల తరువాత మెల్లమెల్లగా తలుపులు తెరుచుకుని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు.
"ఎవరది?" వస్తూనే అతను లోవాయిస్ తో అడిగాడు.
"నేనే! రాణిని!..." అంది తన గొంతులో ఏమాత్రం తొట్రుపాటు కనిపించనివ్వకుండా.
"ఇంత అర్థరాత్రి వచ్చావే! నువ్వొక్కదానివే వచ్చావా? ఇంకెవరన్నా నీతో వచ్చారా?" అతను అనుమానంగా అడిగాడు.
"ఒక్కదాన్నే వచ్చాను. అడ్రస్సు వెతుక్కోవడంతో ఈ టైమ్ పట్టింది..." చికాకు ధ్వనించిందామె స్వరంలో.
"ఇప్పుడే వస్తాను, యిక్కడే వుండు...." అంటూ అతను తిరిగి వెళ్ళాడు.
మరికొద్ది క్షణాల్లోనే గేటు తాళంచెవి తీసుకుని ఆ వ్యక్తి బయటకు వచ్చాడు.
అతను గేటు తాళం తీయగానే లోపలకు వచ్చింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే తలుపులు మూసుకున్నాయి.
మరు నిమిషం కరెంటు పోయినట్టు యింటిలో వున్న అన్ని లైట్లు ఆరిపోయాయి.
వీరేష్ సూచన మేరకు సిబ్బంది అంతా కాళ్ళకు వున్న బూట్లు తీసివేసి కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలకు ప్రవేశించారు.
వీరేష్ మెయిన్ డోర్ దగ్గరే వుండి రాణి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు.
కాలం యధావిధిగా కరిగిపోతున్నది.
సరిగ్గా అదే సమయంలో ఆ యింట్లో....
ఎ.సి. రూమ్ లో...
విస్కీ వాసన, సిగరెట్టు పొగ.
నీలంరంగు డిమ్ లైటు వెలుతురులో అక్కడ వున్న చాలామంది స్త్రీ, పురుషుల ముఖాలు స్పష్టంగా కనిపించడంలేదు.
వాళ్ళంతా టి.వి.లో వీడియో ఫిల్మ్ చూస్తున్నారు.
"కైసా హై?" మధ్యలో అడిగాడు ఒక వ్యక్తి.
"బహుత్ అచ్చా హై...ఫిగర్ భీ అచ్చా హై....మూమెంట్స్ భీ అచ్చాహై..." అరబ్బు సేటు మత్తు మత్తుగా జవాబిచ్చాడు.
అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టింది రాణి.
ఆమె వేసుకున్న తెల్లని చీర, రవిక ఆ డిమ్ లైట్ లో కొత్త అందాలను విరజిమ్ముతున్నాయి.
"ఏ కౌన్ హై?" కళ్ళింతచేసి ఆమెనే చూస్తూ అడిగాడు అరబ్బు సేట్.
"ఈమె మీ కళ్ళకి బాగా నచ్చినట్టుందే!" అతను నవ్వుతూ అన్నాడు.
"బహుత్ పసంద్ హై...." నోరు చప్పరిస్తూ జవాబిచ్చాడు అరబ్బు సేట్.
"ఈసారి ఆమెను పెట్టి ఫిల్మ్ తీయమంటారా?" అతను జవాబు కోసం క్షణం ఆగాడు.
"జరూర్! జరూర్! ఉస్ సే ఫిల్మ్ బనో!"
"ఫైవ్ లాక్స్!" ఫిగర్ చెప్పాడతను.
అరబ్బు సేట్ క్షణం తటపటాయించి, చివరకు తన అంగీకారాన్ని తెలుపుతూ సూట్ కేసు తెరచి అడ్వాన్స్ గా పాతికవేలు టీపాయ్ మీద పెట్టాడు.
అతను అది అందుకుంటూ రాణికి సైగ చేశాడు.
ఆమె స్నానంచేసి వస్తానంటూ టవల్ తీసుకుని బాత్ రూమ్ కు వెళ్ళింది.
* * * *
టైమ్ చకచకా కదలిపోతున్నది.
ఇంటిలోకి ప్రవేశించిన రాణి నుంచి ఇంకా ఏ సిగ్నలూ రాలేదు.
ఒకవేళ ఆమె వాళ్ళతో చేతులు కలిపిందా....?
వీరేష్ ఆమెకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పి, తనవైపుకు తిప్పుకున్నాడు. ఆమెను నమ్మి ఆ ఇంట్లోకి పంపాడు.
లోపలి విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకోగానే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రాణి, ఇన్ స్పెక్టర్ వీరేష్ కు సిగ్నల్ లాంటిది యివ్వడమో, లేక పోలీసులు ఒక్కసారిగా అటాక్ చేయడానికి మార్గం సుగమం చేయడమో చేయాలి.


