Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 50


    ఆశయాలూ, ఆదర్శాలూ చెప్పుకోవడానికి, వినడానికీ బావుంటాయి. కాని ఆచరణలో ఎన్ని అవాంతరాలను ఎదుర్కొనాలో!
    ఎందరు ధైర్యంచేసి ఆశయం కోసం పోరాడుతున్నారు? అటువంటిది, స్త్రీ సమస్యల గురించి చీకటిలో వెలుగు కోసం జరిపే పోరాటంలా అనూష ఆలోచిస్తున్నది. సమస్య పరిష్కారం కోసం తన కలం బలం చూపిస్తున్నది. మరెందుకో ఇవ్వాళ అధైర్యపడుతున్నది!
    "అనూషా! మనిషికి పెళ్ళే జీవిత పరమార్థం కాదు! నువ్వు ఈ సమాజానికి చేయవలసిన సేవ ఎంతైనా ఉంది. దానికి పెళ్లి అవరోధం కాకూడదు. సమాజంలో భారత స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలకు నువ్వు పరిష్కార మార్గం చూపాలి. అవసరమైతే నీ కలం బలంతో ఉద్యమాన్ని లేవనెత్తాలి. అందాకా నువ్వు నీ శాయశక్తులా పోరాడాలి! మధ్యలో నీ మనసు మార్చుకుంటావా? ఓటమిని అంగీకరిస్తావా?" ఉద్వేగంగా అన్నాడు ఆనంద్.
    అనూష మౌనంగా ఆలోచించింది.
    నిజమే! ఇప్పటివరకు తనలో ఉన్న ఉత్సాహం, పట్టుదల ఏమైనట్టు? తను లౌకికానందాలకోసం పరితపిస్తున్నదా? తను కూడా సగటు మనిషే! తనకూ బలహీనతలున్నాయి మరి!
    "ఆనంద్! నువ్వు నా మాట కాదనవని, నన్నూ, నా ఆలోచనలనూ సమర్థిస్తావనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. నేను జీవితంలో పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?" తడబడుతూ తలవంచుకుని నేలచూపులు చూస్తూ నిదానంగా అంది అనూష.
    ఒక ఆడపిల్ల ఒక మగాడితో ఉన్నట్టుండి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందంటే, ఏ మగాడిలో అయినా సహజంగా ఏదో ఒక స్పందన అంటూ ఉంటుంది. అది ఎదుటి వ్యక్తిని బట్టి ఇష్టతో, అనిష్టతో_ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండి తీరాలి. కాని ఆనంద్ లో ఆమె ఆశించిన స్పందన ఏదీ కనిపించలేదు. ఆశ్చర్యపోవడం అనూష వంతయింది.
    "అనూషా! నువ్వు జీవితం ప్రథమాంకంలో ఉన్నావు. నీ కలం మధ్యలోనే ఆగిపోకూడదు. సగటు మనుషులను కాదని నువ్వు వేసిన అడుగు ప్రగతి పథంలో అడుగు పెడుతున్న ప్రతి స్త్రీకి ముందడుగు కావాలి! నువ్వు మహిళోద్యమాలను లేవనెత్తాలి. అప్పుడే అనూష అనే ఈ అమ్మాయి నాకు పరిపూర్ణ స్త్రీగా కనిపిస్తుంది. పిరికిదానిలా పరిస్థితులకు తలవంచే అశక్తురాలిని కాదు నేను కోరుకునేది. నా అనూష ఓటమిని అంగీకరించదు. పరిస్థితులకు రాజీపడదు, అవునా?" ఆవేశంగా అన్నాడు ఆనంద్.
    ఒకానొకప్పుడు తన చర్యను సమర్ధించలేదని అతనిని ఒక పిరికి వాడనుకుంది. కాని, ఇప్పటి ఆనంద్ ను చూసిన తరువాత, అతను ఎంతో యెత్తుకు యెదిగిపోయినట్టనిపించింది. అతనిచ్చిన స్ఫూర్తితో తన గమ్యం చేరడానికే నిశ్చయించుకుంది అనూష.  
    అనూషకు వీడ్కోలు చెబుతున్న ఆనంద్ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
    అవి ఆమె స్థాయికి ఎదగలేని తన మనసు పడుతున్న మూగ వేదనకు చిహ్నాలో, ఆనంద బాష్పాలో అతని హృదయానికే తెలుసు!


                                          *    *    *    *


    రహదారి బంగళా ఊరికి దూరంగా వుంది.
    అది జాతీయ రహదారి పక్కగా వుంది. ఎప్పుడో బ్రిటీషు పరిపాలన కాలంలో కట్టిన బంగళా అది.
    వాచ్ మన్ కోటేశు అందరితో మంచిగా వుంటూ ఆ బంగళాలో దిగిన వాళ్ళందరికి జాగ్రత్తగా సపర్యలు చేస్తుంటాడు. అతని సేవలకు ఎవ్వరూ అసంతృప్తిని వ్యక్తం చేయరు.
    బంగళా ముందు కారు ఆగింది. హారన్ మోగింది. అప్పటికి అర్థరాత్రి ఒంటిగంట అవుతుంది!
    వెనుక వున్న అవుట్ హౌసు నుంచి కోటేశు పరుగు పరుగున వచ్చి గేటు తీశాడు.
    వచ్చింది ఎవరైనా పెద్ద ఆఫీసరు అయివుంటాడన్న నమ్మకంతో సెల్యూట్ చేశాడు.
    వచ్చింది ఒక ప్రయివేటు కారు. దిగింది వీరేష్.
    ఆయనెవరో అర్థంకాక అతనికేసి క్షణం ఎగాదిగా చూశాడు కోటేశు.
    "మీరు షూటింగ్ పార్టీ వాళ్ళా?" ఏదో గుర్తుకు వచ్చినట్టు కోటేశు అడిగాడు.
    వీరేష్ క్షణం మౌనంగా వున్నాడు.
    "కిందటిసారి షూటింగ్ కు మీరొచ్చినట్టు లేరు!" అన్నాడు కలుపుగోలుగా కోటేశు. అతనికి ఇంకా నిద్రమత్తు వదలనట్టు ఆవలించాడు.
    "నేను ఇంకో లొకేషన్ చూడ్డానికి వెళ్ళాలే!" అతని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో చిన్న అబద్ధం ఆడాడు వీరేష్.
    "మిగతావాళ్ళు వస్తారా సార్?" కోటేశు మాటలో షూటింగ్ అంటే ఆసక్తి వినిపిస్తున్నది.
    "వస్తారు"_వీరేష్ పొడిగా సమాధానం చెప్పాడు.
    కోటేశు బంగళా గది తలుపులు తెరిచాడు.
    అది తన నిత్యకృత్యమైనట్టు బాత్ రూమ్ లో నీళ్ళుపెట్టి, పక్కమీద దుప్పట్లు పరచి వెళ్ళిపోయాడు.
    వీరేష్ దృష్టి బెడ్ షీట్ మీద పడింది. వాటిమీద అక్కడక్కడ సెమనల్ స్ట్రైన్స్ వున్నాయి.
    అంటే ట్రావెలర్స్ బంగళాలో ఒకే బెడ్ మీద స్త్రీ, పురుషులు వున్నట్టు అర్థమవుతున్నది.
    అతను గెస్టుహౌస్ నంతా పరిశీలనగా చూశాడు. అక్కడ చాలా ప్రయవసీగా వుంది. అక్కడ జరిగిన ఏ విషయమూ మూడో కంటికి తెలిసేటట్టులేదు!
    వాచ్ మన్ కోటేశు మాటలలోని మర్మాన్ని చూచాయగా తెలుసుకో గలిగాడు వీరేష్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS