Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 50

వకుళాంబ మరోసారి నలువైపులా చూసి, వాళ్లకి అల్లంత దగ్గరగా నుంచున్న రెండో మోసగత్తెతో, ఇక్కడ మా అమ్మాయిని నుంచోమన్నాను. నువ్వేమన్నా చూశావా అమ్మా!"
"మీ అమ్మాయా? ఎన్నేళ్ళ పిల్ల? గౌనులు వేసుకుంటుందా? పరికిణీ వేసుకుందా? చీర కట్టుకుందా? ఎలా వుంటుంది? బాగా చిన్నపిల్లా పెద్ద పిల్లా?" అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది.
తన కూతురు కట్టుకున్న చీర రంగు నుంచీ, ఆమె కనుముక్కు తీరువరకు వర్ణించి 'ఇలా వుంటుంది' అని చెప్పింది వకుళాంబ.
"ఓ! ఆ అమ్మాయా! ఇంతకు ముందే ఇక్కడ నుంచొని వుంటే చూశాను. నా కళ్ళముందే ఆ ప్రక్కావ్వీధిలోకి నడిచి వెళ్ళింది." అంటూ మరో వీధివైపు వేలుపెట్టి చూపించింది ఆ మోసగత్తె.
"దీని దుంపతెగ! దీనికేం పని వుందని ఆ వీధిలోకి వెళ్ళింది. పరాయి వూరు వచ్చామని లేదు. కాలూ చెయ్యీ కుదురుగా లేకపోతే ఎలా? వయసు రాంగానే సరా! అవ్వ!" అని బుగ్గలు నొక్కుకుని, ఆమె చూపించిన సందులోకి దారితీసింది వకుళాంబ.
తల్లి వెనుకనే సుందరాచారి కూడా బయలుదేరాడు.
తల్లీ కొడుకులూ ప్రక్క వీధిలోకి వెళ్ళంగానే, ఇటు నుంచి ఇటే నెమ్మదిగా జారుకుంది రెండో మోసగత్తె.
ప్రక్క వీధిలో కూతురికోసం కొద్దిసేపు వెతికి, కూతురు కానరాకపోవటంతో లబలబలాడుతూ ఆ వీధిలోంచి మళ్ళీ ఇవతలకి వచ్చి, భర్త వున్న బస్సు దగ్గరకి వెళ్ళింది వకుళాంబ.
ఇక్కడ ఇదంతా జరిగేసరికి, అక్కడ అందరూ భోజనం చెయ్యటం ముగించటం, వచ్చి బస్సులో కూర్చోవటం బస్సు బయలుదేరటానికి సిద్ధ పడటం జరిగింది.
పెళ్ళాం బిడ్డలూ రాలేదని గ్రహించిన రామానుజాచారి ఆ విషయం బస్సు డ్రైవర్ తో చెప్పాడు.
"ఇంకా భోజనం బల్ల దగ్గరనుండీ లేవలేదేమో? వెళ్ళి మీ వాళ్ళని పిలుచుకురా!" అని డ్రైవర్ కేకలు వెయ్యడంతో రామానుజాచారి ఒక్కక్షణం ఆలశ్యం చెయ్యకుండా హోటల్లోకి పరుగు తీశాడు.
ఆ హోటల్లో భార్యా, పిల్లలూ కనిపించలేదు రామానుజాచారికి. మళ్ళీ హడావిడిగా బస్సు దగ్గరికి వచ్చాడు. ఆయనటూ, ఈవిడిటుగా సరిగ్గా అప్పుడే వకుళాంబ కూడా బస్సు దగ్గరికి వచ్చి వుంది.
బస్సు ఎక్కమన్నాడు రామానుజాచారి.
"అమ్మాయి కనపడటం లేదండి! అంది వకుళాంబ, ఆదుర్దాగా.
అసలు విషయం అక్కడున్న అందరికీ అర్థం అయ్యేసరికి సరీగ పదినిమిషాలు పట్టింది.
"మీ అమ్మాయి రాకపోవటానికి, ఆలశ్యానికి మేము ఏం చేస్తామయ్యా! సరైన టైముకి బస్సు డిపోకి చేరకపోతే మా ఓనరూ మధ్యలో అడ్డుతగిలే ఇన్ స్పెక్టర్లూ ఊరుకోరు. ఎక్కితే బస్సు ఎక్కండి. లేకపోతే బస్సు దిగిపోయి మీ అమ్మాయికి వెదకి పట్టుకొని వేరే బస్సులో రండి. అంతేకాని, ఈ బస్సుని ఆపివుంచమంటే కుదరదు. టైము అంటే టైమే. బస్సు బయలుదేరాల్సిందే!" అంటూ బస్సు డ్రైవరు కోపంగా అరిచాడు.
బస్సు ఆపటానికి ఏ ప్రయాణీకుడు మాత్రం ఇష్టపడతారు. అంతమందిలో ఒక్కరు కూడా బస్సు ఆపటానికి ఒప్పుకోలేదు.
"మీ అమ్మాయి పెద్దదే అంటున్నావు కదా! ఎక్కడకన్నా వెళ్ళివస్తుందేమో! అదేదో మీరు బస్సు దిగి, ఇక్కడే వుండి చూసుకోండి." అని కొందరూ,
"పెద్ద పిల్లేట ఎక్కడికి వెళ్ళిందో! ఎలా వెళ్ళిందో!" అని కొందరూ,
"ఏ హోటల్లో అన్నా కూర్చొని భోజనం చేస్తున్నదేమో!" అని ఎకసెక్కెంగా కొందరూ.
ఇలా తలో విధంగా అంటూంటే రామానుజాచారికి తల కొట్టేసినంత బాధ కలిగింది.
నోరు వూరుకోని వకుళాంబ వాళ్ళతో పోట్లాట వేసుకోవటంతో, వాళ్ళందరూ తలో మాట అంటూ పెద్ద పోట్లాటకి దిగారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS