Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 50


    "మనం మారువేషాలలో వున్నప్పుడు వేషానికి తగ్గట్లు మాట్లాడాలి. మెలగాలి. మైండిట్!"


    "అలాగే గురువా!" అన్నాడు అహోబిలం.


    "మంచిదిరా శిష్యగా!" అన్నాడు వర్ధనరావు.


    "పచ్చబొట్టు పొడిపించుకోటానికి మన్ని ఎవరూ పిలవటం లేదేంటి గురువా!"


    "మనం ఎలాగూ పొడిచి చచ్చేది లేదు. ఒకళ్ళు పిలిస్తే ఎంత పిలవకపోతే ఎంత! మనం ఈ వేషాలలో తిరిగేది బాస్ గాడికోసం కదరా శిష్యగా!"


    "అవును గురువా! మరిచితిని."


    అలా మాట్లాడుకుంటూ వెళుతుండగా మళ్ళీ జనం తగిలారు. మళ్ళీ వీళ్ళు వాళ్ళందరిని చూసి పచ్చబొట్టు పాట ఎత్తుకున్నారు.


    "ఏమయ్యోయ్! పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ ఇలా ఇటురండి" అంటూ యాభై పైన అరవై లోపు వున్న ఒకాయన వీళ్ళని పిలిచాడు.


    "చచ్చాం గురువా! వాడెవడో మన్ని పిలుస్తున్నాడు. మనకి పచ్చబొట్టు పొడవటం రాదుకదా?" అహోబిలం అన్నాడు.


    "ఒరే శిష్యగా! మనం ఇప్పుడు లాఠీకర్రతో డొక్కలోను పొడవ వద్దు. సూదులతో అంతకన్నా పొడవను వద్దు. మాటలతో పొడిచి తప్పించుకుందాం పద"


    "అంతా నీ దయ గురువా!"


    ఇరువురూ కలసి ఆ పిలిచినాయన దగ్గరకి వెళ్ళారు.


    "ఏమయ్యా పచ్చబొట్టు అంటే ఒకే రంగులో పొడుస్తారు. మీరేంటి రంగు రంగు అక్షరాలతో పచ్చబొట్టు వేస్తాం. ఏ రంగు కావాలంటే ఆ రంగే వేస్తాం అంటున్నారు. అదెలా సాధ్యం. ఇంతవరకు అలాంటిది నేనెరుగనే! అదెట్టా కుదురుతుంది?" పిలిచినాయన తన అనుమానం వ్యక్తం చేశాడు.


    "మా పెద్ద గురువయ్యగారు కొండాకు పసరులతో బండగా పరిశోధనచేసి రంగు రంగుల పచ్చబొట్లు పొడవటానికి బోలెడు పసర్లు తయారు చేశారు. మీకే రంగు కావాలో చెప్పండి. పొడిచి చూపిస్తాం" వర్ధనరావుకింద గొంతుక్కి కూర్చుని పసుపురంగు గుడ్డగల జోలెలోంచి రంగు రంగు ద్రవాలున్న సీసాలు తీసి వరసగా కింద పెట్టాడు.


    "అక్షరానికి అర్థరూపాయి. మీకేరంగు పచ్చబొట్టు పొడవాలో చెప్పండి. మీ పేరు చెప్పండి. ఎక్కడ పొడవాలో చెప్పండి." అంటూ అహోబిలం తన జోలెలోంచి చిన్న సూదులు, పెద్ద సూదులు, పుస్తకాలు కుట్టే సూదులు, నాలుగు రకాల సైజుల దబ్బనాలు, దూది, పాతగుడ్డల పీలికలు తీశాడు.


    "దబ్బనం దేనికి?" భయపడుతూ అడిగాడు ఆయన.


    "పొడవటానికి" అహోబిలం తాపీగా చెప్పాడు.


    "దబ్బనంతో పొడుస్తావా ఏమిటి? చచ్చూరుకుంటాను."


    "దబ్బనంతో మనుషులని పొడవం. కుక్కలని, గేదెలని, ఆవులని పొడుస్తాము. ఈమధ్య కొందరు తమ ఇంట్లో జంతువులకి పచ్చబొట్లు పొడిపించారు."


    "అట్టనా! మరి ఆ పెద్ద సూదులు దేనికి?"


    "చిలకలకి ఎలుకలకి పొడవటానికి ఇన్ని ప్రశ్నలు దేనికయ్యా! నీ పేరు చెప్పు. ఏ రంగు పొడవమంటావో చెప్పు. అంగుళం సూదితోనే పొడుస్తాను. సరేనా?" వర్ధనరావు విసుక్కుంటూ అన్నాడు.


    "అవునులే. అనవసర విషయాలు నాకెందుకులే. సరే కుడిచేతి మీద కాస్త పెద్ద అక్షరాలతో ఎర్రరంగుతో నా పేరు ఆంజనేయస్వామి అని పొడవండి" అంటూ కుడి చెయ్యి జాపాడు ఆ వ్యక్తి.


    "ఏంటి? నీ పేరు మళ్ళీ చెప్పు" వర్ధనరావు అడిగాడు.


    "ఆంజనేయస్వామి" మళ్ళీ తన పేరు చెప్పాడు ఆ వ్యక్తి.


    "ఒరే శిష్యగా! మూటాముల్లె సర్దు" అంటూ వర్ధనరావు రంగు నీళ్ళున్న సీసాలని మళ్ళీ తన జోలెలో సర్దుకోవటం మొదలుపెట్టాడు.


    "అదేంటయ్యా! పచ్చబొట్టు పొడుస్తానని చెప్పి మారు మాట్లాడకుండా మూట ముల్లె సర్దుకుంటున్నారు."


    "మా గురువుగారు ఆంజనేయస్వామి భక్తులు. ఏ పేరైనా పొడుస్తారు గాని ఆ దేముడి పేరు మాత్రం పొడవరు. అదో నియమం. సూదులతో ఆంజనేయస్వామిని పొడవటమే కళ్ళు పోవూ?" అంటూ సూదులు దబ్బనాలు జోలెలో సర్దుకుని లేచాడు అహోబిలం.


    "అంత వివరంగా చెప్పాలిరా శిష్యగా!"


    "మరి చెప్పకపోతే ఎలా అర్థం అవుతుంది గురువా!"


    ఆశ్చర్యంతో ఆ వ్యక్తి తెరిచిన నోరు తెరిచినట్లే వుంది. ఇరువురూ లేచి ముందుకి సాగారు.


    కొంత దూరం పోయింతరువాత.


    "బాగా నటించాం కదరా శిష్యగా!" వర్ధనరావు అడిగాడు.


    "బ్రహ్మాండంగా నటించారు గురువా! ప్రభుత్వం చూస్తే పద్మశ్రీ అవార్డు ఇస్తుంది." అహోబిలం ఉబ్బేశాడు.


    వర్ధనరావు ఉబ్బిపోయాడు. "పద్మశ్రీ ఏం ఖర్మ శిష్యగా! నిజంగా అవార్డు ఇచ్చేటట్లయితే ఓవర్ యాక్షన్ చేసి పద్మవిభూషణే కొట్టేద్దును కదా?" అన్నాడు ఆశగా శూన్యంలోకి చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS