Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 50


    ఆమె అతని వేపుకి తిరిగి అతని నడుంచుట్టూ తనచేతుల్ని వేసింది.


    అతనికేసి ఆరాధనగా చూసింది.


    "నేను తప్పేమీ మాట్లాడలేదు కదూ!?"


    "చాలా కరెక్టుగా చెప్పావు మనోహర్. రియల్లీ ఐ లైక్ యు" అంది అవంతి.


    "డాడీ నిన్ను చాలా లైక్ చేస్తున్నాడు. అదృష్టవంతురాలివి అవంతీ! నేనున్నా లేకపోయినా కూడా నీకు డాడీ అండదండలుంటాయి" మెల్లగా అన్నాడు.


    చేత్తో అతని పెదిమల్ని మూసింది అవంతి.


    "అవేం మాటలు! అలా మాట్లాడి నన్ను బాధపెట్టకు ప్లీజ్?" అంది


    మనోహర్ తమాషాగా నవ్వాడు.


    "చాలా కాజువల్ గా డాడీకి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఉదాహరణగా అలా అన్నాను. ఆ మాటలకి అంతగా రియాక్ట్ కానవసరం లేదు" అన్నాడు.


    "ఏమో నువ్వే ఉద్దేశ్యంతో అన్నా నాకు మాత్రం ఆ మాటలు చాలా కష్టాన్ని కలిగించాయి. నేనెక్కడ వున్నా కోరుకునేది నువ్వు క్షేమంగానూ సుఖంగానూ ఉండాలనే మనోహర్. నువ్వు నాకో జీవితాన్ని ప్రసాదించిన దేవుడివి. అంచేత నేనలా కోరుకోవడంలో తప్పులేదు కదా?"


    "థాంక్యూ సోమచ్ డియర్. నీ విషయంలో నేనూ అలాగే కోరుకుంటాను. అనుభవంతోనూ, తెలివి తేటలతోనూ ఆరితేరిన దిగ్గజాలాంటి లాయర్ల మధ్యలో ప్రవేశించబోతున్న చిన్న కుందేలు పిల్లవి నువ్వు. దేవుడు పుట్టుకతో ప్రతీ వాళ్ళకి మెదడునిస్తాడు. దాన్ని సానపెట్టి మెరుగులు దిద్దే మనిషి మేధావి కావడానికి స్వయంకృషి చాలా అవసరం. నువ్వు నీకున్న పరిధిలోనే కాక కాస్తంత లౌక్యంగానూ వ్యవహరించి త్వరలోనే మేధావులైన నల్లకోటు దిగ్గజాల చేత సెభాష్ అనిపించుకోవాలి అది నా కోరిక. నీ తెలివితేటలపైన నమ్మకం గలవాడిని కనుక అలా కోరిక కోరడంలో తప్పులేదని కూడా నాకు తెలుసు" అన్నాడు మనోహర్.


    అవంతి అతని పెదవుల్ని అందుకొంది. ఆమెనతడు గాఢంగా కౌగిలించుకున్నాడు. అది కోరికతో కాదు. ఆవేశంతో కాదు కేవలం ఆత్మీయత. ఓ అభిమానం ఒకరిపట్ల ఒకరికి గల ఒక "ఇష్టం" అంది.


    "నీకెప్పుడు ఏమి కావాల్సినా మొహమాటపడకు. నీకు నామీద ఓ ఆత్మీయురాలికంటే అధికారం వుంది. అవసరం అనిపిస్తే నన్ను శాసించు అడుగు ముందుకు వెయ్యను" అన్నాడు.


    అవంతి కళ్ళనిండా నీరు నిండింది.


    "ఎందుకా కన్నీరు!" తన చేతి చూపుడు వేలితో అవంతి కన్నీళ్ళని తుడుస్తూ అడిగాడు మనోహర్.


    "అనుకున్నానే కానీ నాలో ఏదో బలహీనత ప్రవేశిస్తోంది. నిన్నూ ఈ వూరునీ వదిలి వెళ్ళాలనిపించడంలేదు. నీలాంటి స్నేహితుడికి దూరంగా వెళ్ళాలంటే చాలా దిగులుగా వుంది నాకు. అసలు నువ్వింత మంచివాడివెందుకయ్యావు మనోహర్?" అంది నిర్వేదంగా అవంతి.


    మనోహర్ ఆమె చెంపలని మృదువుగా నిమిరాడు.


    "నిన్ను వెళ్ళమని నేను చెప్పలేదుగా!" అన్నాడు అదోలా నవ్వడానికి ప్రయత్నిస్తూ మనోహర్.


    "ఆదినుంచి ఆడదానికి జరిగే అన్యాయాలని చూసి విసుగెత్తిపోయాను. మగవాళ్ళంటే ఓ విధమైన ఏహ్యతని నేనేర్పరచుకొన్నాను. నేను నేనుగానే మిగిలిపోయి ఆడది కూడా ఓ మనిషేనని నిరూపించాలని శపథం చేశాను. మగజాతిలోనూ వజ్రాల్లాంటి వాళ్ళుంటారన్న దానికి నువ్వు నిదర్శనం. నువ్వు పోసిన ఊపిరితో నా ఆశయాలని సాధించడానికి సమాజానికో ప్రశ్నగా ఉదయిస్తాను. నువ్వు నన్ను దీవించు మనోహర్" అంది అతని కాళ్ళపైన వాలిపోతూ అవంతి.


    మనోహర్ మెల్లగా ఆమెని లేవనెత్తి "ఐ విష్ యు ఆల్ సక్సెస్" అన్నాడు.


    అవంతి తృప్తిగా అతని మొహంలోకి చూసింది.


    "గుడ్ నైట్" అన్నాడు మనోహర్.


    "గుడ్ నైట్" అంది అవంతి.


    మనోహర్ తన గదిలోకి నడుస్తుంటే అవంతి అక్కడే నిలబడిపోయింది.


    మెల్లగా తలెత్తి ఆకాశంలోకి చూసింది అవంతి.


    ఆకాశంలోంచి సరసరమని పాకుతోంది వెన్నెల.


    కానీ ఆ వెన్నెల ఆమెకి ఆనందాన్ని పంచిపెట్టలేకపోయింది.


    ఏదో అసంతృప్తి.


    మరేదో దిగులు ఆమె గుండెలో చోటు చేసుకుంది. చందమామని మబ్బు తెరొకటి కమ్మేస్తుండగా గదిలోకి నడిచింది అవంతి.


                                            30


    తొలిసారిగా కోర్టుహాల్లో ప్రవేశించి పెద్ద పెద్ద లాయర్ల పక్కన అవంతి కూర్చొంది. గోవిందరాజులు కాళ్ళు భూమిమీద నిలవడం లేదు.


    గుమ్మం పక్కనే నించుని కనబడిన వాళ్ళందరికీ కూతుర్ని చూపించి పొంగిపోతున్నాడు.


    కాల్ వర్క్ జరుగుతోంది.


    సబ్ జడ్జి రెండు మూడుసార్లు కళ్ళజోడు సవరించుకొని అవంతికేసి చూశాడు.


    ఆమె చేతిలో రెండు ఫైళ్ళున్నాయి. సీనియర్ సూర్యారావు ఆ ఫైళ్ళు ఆమె చేతికిచ్చి వాయిదా అడగమని చెప్పాడు.


    బెంచిగుమాస్తా నెంబరు ఎప్పుడు పిలుస్తాడా! అని ఎదురుచూస్తోంది. అవంతి.


    మరో అయిదు నిమిషాల తర్వాత తను ఎదురు చూసిన నెంబరుని పిలిచాడు బెంచ్ క్లర్క్.


    అవంతి లేచి నిలబడింది.


    ఏ మాత్రం తొణుకులేకుండా......


    "మిస్టర్ పి.యస్.ఆర్. ప్రేస్ ఫర్ టైం యువర్ ఆనర్" అంది అవంతి.


    జడ్జి ఒకసారి ఆమెకేసి చూసి చిరునవ్వుతో "ఓ.కె." అని.


    "కొత్తగా చేరావా అమ్మా?" అడిగారు.


    "యస్ యువరానర్. అయాం మిస్ అవంతి" అంది వినయంగా.


    మరో లాయర్ లేచి ఆమెని జడ్జికి పరిచయం చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS