Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 51


    
    ఆసక్తిగా వింటున్నాడు ఆదిత్య.
    
    "ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ లో జాకిస్ హీమ్ తను డిజైన్ చేసిన బేతింగ్ సూట్ అమ్ముతున్న రోజుల్లో, అంటే - 1946" జూలైలో ఓ సంఘటన జరిగింది. అది అమెరికా దేశం నిర్వహించిన అటామిక్ బాంబ్ పరీక్ష దానికి ఎన్నుకున్న ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని చాలా చిన్న దీవి దాని పేరు 'బికినీ అటాల్' కాకతాళీయంగా అటామిక్ పరీక్షను అతిచిన్న ప్రదేశమయిన బికినీ అటాల్ లో నిర్వహించడమూ, అతి చిన్న బేతింగ్ సూట్ పేరు ఆటోంగా జాకెన్ హీమ్ అప్పటికే నిర్ణయించడంతోనూ వెంటనే ఆ పేరు బికినీ సంఘటన గుర్తుగా బికినీగా మారింది. అంతేగాకుండా అటామిక్ బాంబ్ పరీక్ష తరువాత 'బికినీ అటాల్' ఆ సూట్ ధరించిన స్త్రీలలా కుచించుకు పోయి రూపాంతరం చెందినట్టు అంతా చెప్పుకోవడం ప్రారంభించారు. సో....ఆటం నుంచి స్థిరపడిన ఆటోం అన్న పేరు ఆ తరువాత అటామిక్ పరీక్ష నిర్వహించిన పసిఫిక్ మహాసముద్రంలోని అణువంత బికినీ అటాల్ పేరుతో ఇప్పటికీ వ్యవహృతమవుతూంది."
    
    ఆగింది చెప్పడం పూర్తయినట్టు.
    
    "థాంక్యూ!" అన్నాడు ఆదిత్య వుత్సాహంగా- "ఓ పెద్ద సమస్య తీరిపోయింది."
    
    "సమస్యేమిటి?"
    
    "బికినీ సూట్ కి జవాబు చెప్పడం."
    
    "ఎవరికి?"
    
    అనాలోచితంగా చెప్పేశాడు- "ప్రబంధ."
    
    "వ్వాట్?"
    
    క్షణంపాటు ప్రణయ కళ్ళలో విస్మయం మెరిసి మాయమవటం స్పష్టంగా కనిపించింది. "ప్రబంధ...ప్రబంధ మిమ్మల్ని కలిసి ఈ ప్రశ్న అడిగిందా?"
    
    చెప్పాడు లైబ్రరీలో తన దగ్గరకు రావడం గురించి.
    
    "వెరీగుడ్" నవ్వేసింది ప్రణయ. "ఇప్పుడు తనూ మీ స్నేహం సంపాదించుకోగలిగిందన్నమాట!"
    
    ఎందుకో ప్రణయ నవ్వులో పూర్వపు లాలిత్యం కనిపించలేదు. ఆ తరువాత జరిగింది చెప్పడం మానేశాడు కావాలనే.
    
    ప్రణయ సంస్కారం గురించి ఆదిత్యకి తెలుసు కాని ఎందుకో చెప్పాలనిపించలేదు.
    
                                                        * * *
    
    సరిగ్గా అన్న టైమ్ కే హాస్పిటల్ కి వచ్చింది ప్రబంధ రావటమే కాదు అతనితో చాలా కలుపుగోలుగా మాట్లాడుతూంది.
    
    ప్రబంధని పూర్వం యూనివర్శిటీలో చూసిన పరిచయంలేని ఆదిత్య ఆమెను తొలిసారి కలుసుకున్నది క్విజ్ కాంపిటీషన్ లో సూరిని ఓ ఆపదనుంచి రక్షించాలని ఆ పోటీలో సైతం అడుగుపెట్టాడే తప్ప ప్రబంధ మీద గెలుపు సాధించాలనే దుగ్ధతో కాదు. ఆ తరువాత మరోసారి పోటీలో కలిసినా ప్రత్యర్ధిగానే మిగిలిపోయాడు తప్ప ఆమె గురించి అంతగా పట్టించుకోలేదు.
    
    అలాంటి అమ్మాయి ఈ రోజు చాలా ఆసక్తిగా తనతో పరిచయాన్ని పెంచుకుంటూ దగ్గరౌతుంది.
    
    "అనితా! డాక్టర్సంతా టైమ్ కి అటెండవుతున్నారా?" అడిగింది ఈ రోజూ తెచ్చిన ఆపిల్ పళ్ళబుట్ట అందిస్తూ.
    
    "నిన్న మీరు చేసిన హడావుడికి చాలా కంగారు పడిపోయారంతా ఓ రకంగా నా ఇమేజ్ పెరిగిపోయింది. విచిత్ర మేమిటంటే ఒకరిద్దరు హౌస్ సర్జన్స్ నా దగ్గర వాళ్ళ కష్టాల్ని వెళ్ళబోసుకోవడమూ మొదలుపెట్టారు. బహుశా మీ ద్వారా ఏదో రికమండేషన్ చేయించుకోవాలనుకుంటున్నారేమో కూడా!"
    
    "దానికేముంది?" తప్పకుండా సహాయంచేద్దామని ధీమా ప్రకటించేసింది. "ఇంకేమన్నా కావాలా?" అంది పళ్ళబుట్టని ఖాళీచేసి అనిత వెనక్కిస్తుంటే.
    
    "నిన్న మీరిచ్చినవే మిగిలిపోయినవి మరొకరివ్వడంలో తప్పులేదు. అది కూడా నీ ఇమేజ్ ని పెంచేదేగా!" ఒక్క వాక్యంలో తన కేరక్టరేమిటో చెప్పింది ప్రబంధ.
    
    ఆ విషయం అనిత కాదు, ఆదిత్య గుర్తించాడు. ఒకవేళ ప్రబంధపైన పూర్వపు అభిప్రాయమే వుంటే అది అహంగా అనుకునేవాడేమోకాని, ఇప్పుడిప్పుడే ఆమెపై వున్న అభిప్రాయం మారిపోవడంతో పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు.
    
    ఒక ముఖ్యమంత్రి ఒక్కగానొక్క కూతురికి, పైగా ఎందరో ఆమె పరిచయం కోసం వెంపర్లాడుతుంటే అందర్నీ కాదని ఆమె తనతోనే కాకా తన చెల్లెలు అనితతో కూడా చనువుగా వుండటం ఆదిత్యకి చాలా నచ్చింది.
    
    "మరి వెళదామా?" అంది ప్రబంధ. ఎందుకో అతడితో ఒంటరిగా మాట్లాడాలని ఆమెకు చాలా ఆసక్తిగా వుంది.
    
    "వెళ్ళన్నయ్యా! ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయిగా!" చెప్పింది అనిత.
    
    అనిత కూడా వాళ్ళకి ఏకాంతాన్ని వ్వాలనుకుంటే అది ఆమె తప్పుకాదు. ప్రేమ అనే పదం గురించి ఆమెకు పెద్ద అవగాహన లేదుగాని ప్రణయకన్నా ఆదిత్యపైన ప్రబంధే ఎక్కువ ఇష్టాన్ని ప్రకటించటం అర్ధం చేసుకుంది.
    
    ఆదిత్య ప్రబంధతోపాటు వార్డు బయటికి నడిచాడు. హాస్పిటల్ విద్యుద్దీపాల కాంతిలో సన్నని కాలి బాటపైన అతనితోబాటు నడుస్తుంటే చాలా వుత్సాహంగా వుంది ప్రబంధకి. కారు పార్కింగ్ దాకా నిశ్శబ్దంగా వుండిపోయింది.
    
    "బీచ్ కి వెళదామా?"
    
    ఇప్ప్దుడా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS