Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 50

   
    
    మరోసారి ఆదిత్యని అడగాలనుకుంటుండగా దూరంగా వెళ్ళిపోతున్నాడు ఆదిత్య. "అవును సూరీ...ప్రశ్న అదే... ఆలోచించండి....కలుస్తాను ఆ టైంకి."
    
    సీరియస్ గా స్నేహితులంతా ఓ బండరాయి మీద చతికిలబడ్డారు. అంతకంటే సీరియస్ గా ప్రశ్నని మననం చేసుకున్నారు.
    
    అయిదు నిమిషాల తర్వాత అరిచాడో ఇంజనీరింగ్ విద్యార్ధి "అర్ధమయింది."
    
    "ఏమిటీ?" ఉత్సాహంగా చూశారంతా.
    
    "ఆదిత్య అడిగింది గడియారం పదమూడు గంటలు కొట్టేది ఏ టైంకి అని-అవునా?"
    
    "అవును."
    
    "ఇప్పటికి నాకు బోధపడింది."
    
    "ఏమిటి?"
    
    "ఆదిత్య అడిగిన ప్రశ్న?"
    
    "ఏడ్చినట్లుంది." గావుకేక పెట్టాడు సూరి వుక్రోషంగా.
    
    అప్పుడు టైం సాయంకాలం అయిదు గంటలు.
    
                                                             * * *
    
    "వాటె సర్ ప్రయిజ్!" ఇంట్లోకి వచ్చిన ఆదిత్యని చూస్తూ సాదరంగా ఆహ్వానించింది ప్రణయ.
    
    నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాడు.
    
    "ఏమిటి రెండు రోజులక్రితం అంతర్దానమైపోయిన మీరు ఇలా కటాక్షించేశారు? పోటీకి ప్రిపేరయ్యానని చెప్పటానికా?" తనూ ఎదురుగా కూర్చుంది ప్రణయ.
    
    టైం లేదు. తొందరగా వెళ్ళిపోవాలి. ఆ ధ్యాసలో వుండటంతో యధాలాపంగా అన్నాడు- "ఏమిటి, మధ్యాహ్నం క్లాసులకి అటెండ్ కాలేదా?"
    
    "ఏం నా కోసం చూశారా?"
    
    "మరే..."
    
    "బ్రహ్మాండంగా..." క్షణమాగి అంది. "అబద్దం చెప్పేశారు."
    
    "అదేమిటి?"
    
    "రెండు రోజులుగా నేను కాలేజీకి వెళ్ళడం లేదు."
    
    "అదేం?"
    
    "మీరెంత కలవరపడతారో చూద్దామని కాదు, ఒంట్లో బాగోలేక ఇప్పుడు అర్ధమయింది."
    
    ఇబ్బందిగా తల వంచుకున్నాడు ఏమని?"
    
    "అసలు మీరు నా విషయం పట్టించుకోనేలేదు అని."
    
    "సారీ!"
    
    "మధ్య సారీ దేనికి?"
    
    "పట్టించుకోనందుకు."
    
    నిట్టూర్చింది ప్రణయ "ఆదిత్యా! ఓ విషయం చెప్పనా? అడిగితే వచ్చే స్పందన కాదు ఇష్టమంటే, అడక్కుండా ఏర్పడే ప్రతిస్పందన. అదిగో అలా ఫీలవద్దు."
    
    చాలాసేపు నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    నిజమే తన జీవితంలో అతిముఖ్యమైన సంఘటనగా నిలిచిపోయేది కాని గుర్తుంచుకోదగ్గ క్షణం కాని జరిగింది రెండు రోజుల క్రితం.
    
    రోహిత్ పైన గెలుపు సాధించిన నిన్ను గెలుచుకుంటానని ఇంచుమించు సూటిగా అన్నది అప్పుడే. ఆ తరువాత చిత్రంగా ఆమెకు దూరమయ్యాడు. దూరమైందీ ప్రిపరేషన్ కే నిజానికి వారం గడువు కావాలన్నాడు కూడా ఆ ప్రిపరేషన్ కూడా ఆమెకు దగ్గర కావడానికే అని ఇప్పుడుకాదు కనీసం నిన్నయినా చెప్పి వుండాల్సిందనుకున్నాడు.
    
    "కాఫీ తాగుతారా?" అడిగింది ప్రణయ వాతావరణాన్ని తేలికపర్చుతూ.
    
    "వద్దు వెళ్ళాలి."
    
    "అప్పుడే?" విస్మయంగా చూసింది.
    
    "అవును ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి."
    
    "అది చెప్పడానికే వచ్చారా?" నవ్వేసింది మామూలుగా.
    
    "కాదు."
    
    "ఇదేమిటి?" అంత మొహమాటపడిపోతున్నారు?"
    
    చాలామంది దగ్గర నిబ్బరంగా నిలబడగలిగే ఆదిత్య ప్రణయముందు ఎందుకిలా బిడియపడతాడో అతడికీ బోధపడని విషయమే. కాని ఒక్కోమారు చాలా ధైర్యాన్ని నటిస్తుంటాడు. అది నటనేనా?"
    
    "ఆదిత్యా! ఈ నిశ్శబ్ధాన్ని భరించలేకపోతున్నాను."
    
    "సరే అడిగేస్తున్నాను."
    
    "ఏమిటీ?"
    
    "మీకు తెలిసేవుంటుంది." టాపిక్ నెలా ప్రారంభించాలా అని అరక్షణం ఆలోచించి నెమ్మదిగా అన్నాడు- "ఆడవాళ్ళు వేసుకునే బికినీ వుంటుంది చూశారూ..."
    
    "విభ్రమంగా అంది ప్రణయ- "భలేవారే చూడకపోవడమేమిటి?"
    
    "అహ- మీరు చూసి వుండరని కాదు."
    
    "ఏ కంపెనీది అయితే బెటరో తెలుసుకోవాలనుకుంటున్నారా?"
    
    తత్తరపడిపోయాడు ఆదిత్య.
    
    "అయినా అది ఎవరికి కావాలట?"
    
    ప్రణయ ఆట పట్టిస్తూందని తెలిసిపోయింది. నేను మిమ్మల్ని అడిగేది ఆ వివరాలు కాదు. అసలు బికినీలు మొదట ఏ దేశంలో ఎలా ప్రారంభమయ్యాయా అని?"
    
    అరనిముషంపాటు నిశ్శబ్దంగా వుండిపోయింది. "క్రీస్తుశకం 1940లో సముద్ర తీరంలో నివసించే ఫ్రెంచి స్త్రీలు తమ శరీరాల్ని ఎక్కువగా సూర్యరశ్మికి ఎక్స్ పోజ్ చేయడాన్ని ఇష్టపడేవారు. ఇది అవకాశంగా తీసుకున్నాడు ఫ్రాన్స్ దేశానికి చెందిన జాకెస్ హీమ్. 1946లో ఓ బేతింగ్ సూట్ మార్కెట్లో ప్రవేశపెట్టాడు. ఈ సూట్ రెండు పీసెస్ గా వుండేది పైన సన్నగా ఉండే బ్రాసరీ- దిగువ అంటే బొడ్డుకి దిగువ భాగంలో రెండు త్రిభుజాలాంటి ముక్కలు, వెనుకా ముందూ కలుపుతూ నడుంపైన ఇంచుమించు నూలుపోగుల్లా మాత్రం కవర్ చేస్తుండేవీనూ ఒక విచిత్రమైన ప్రయోగంలా విడుదల చేసిన ఈ సూట్ స్త్రీలు ధరించే అన్ని వస్త్రాలలో అతి చిన్నది, అణువంతదీ అన్న భావం వచ్చేట్టు దాన్ని ది వరల్డ్స్ స్మాలెస్ట్ బేతింగ్ సూట్ గా అభివర్ణిస్తూ దానిపేరు అటోం అని నిర్ణయించాడు. అదే ఆ తరువాత బికినీగా నామాంతరం పొందింది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS