Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 52


    "ఏం... రాకూడదా?" నేలచూపులు చూస్తూ అంది.
    
    "రాకూడదని కాదు. పరీక్షలు... చదువుకోవాలి" గొణుగుతున్నట్టుగా అన్నాడు.
    
    "తనూ ఓ పరీక్షలో అడుగుపెట్టిన అమ్మాయే. తనూ ఫలితం తెలుసుకోవాలని ఆరాటపడుతూంది. "పోనీలెండి మరోసారి వెళదాం."
    
    "మీ ప్రశ్నకి జవాబు అడగలేదు."
    
    బిడియంగా నవ్వింది "మీరు చెబితే వినాలనిపించింది"
    
    "అడగొచ్చుగా?"
    
    "ప్రిపేరయి వుండకపోతే హర్టవుతారని."
    
    ఎంత మార్పు ఈ అమ్మాయిలో! తనకంటే అంతా అల్పులే అని భావించడమే అలవాటైన ప్రబంధ, తన విషయంలో మాత్రం కాస్త వెసులుబాటుని ప్రదర్శిస్తూంది. ఇది స్నేహం కోసమేనా?    
    
    చెప్పాడు బికినీ గురించి చెబుతుంటే గిల్టీగావుంది. అది ప్రణయ నుంచి తెలుసుకున్నదన్న భావం కావచ్చు.
    
    అంతా విన్న ప్రబంధ విస్మయంగా అడిగింది. "నిజానికి ఇది మీకు ముందే తెలుసునన్నమాట."
    
    "లేదు తరువాత తెలుసుకున్నాను."
    
    "ఇంత స్వల్ప వ్యవధిలో.... నేన్నమ్మను!"
    
    ప్రణయ చెప్పింది అనాలనుకున్నాడు కాని ఆమె ప్రసక్తి తీసుకురావడం సవ్యంగా అనిపించలేదు
    
    "మీకు నిజంగా ముందే తెలుసు"
    
    "తెలిస్తే అడిగినవెంటనే చెప్పేవాడినిగా?"
    
    "అందరిముందూ కాక ఒంటరిగా ఇక్కడ కలుసుకున్నాక చెప్పాలని ఆగి వుండొచ్చుగా?"
    
    "అదేం కాదు" టక్కున అన్నాడు "నిజంగా నాకు తెలీదు."
    
    'అవును, నిజమే' అని ఆదిత్య అంటే ఆమె ఆనందపడేదేమో! "పాపం శ్రమ పెట్టానన్నమాట!"
    
    "లేదు ప్రబంధా! మరో కొత్త విషయం తెలుసుకునే అవకాశం కలిగించారు మీరు"
    
    "అంటే నేను బకాయి పడిపోయానన్నమాట"
    
    "ఏమిటి?" విస్మయంగా అడిగాడు.
    
    "మీరు చెప్పగలిగితే నేనేమిస్తానూ అని మీరు అడిగారుగా?"
    
    "గుర్తుంది."
    
    "ఏమిస్తాననుకుంటున్నారు?"
    
    నవ్వేడు మృదువుగా "అదీ నాకు అర్ధంకాలేదు."
    
    "నిజమా?"
    
    "అవును ప్రబంధా! మరోలా అనుకోకండి. మీరు బహుశా చాలా విషయాల్లో నాకన్నా ముందున్నారని బోధపడింది. మరో పజిల్లాంటిది అది. విన్నాకనే."
    
    "నిజంగా అర్ధం కాలేదా?"
    
    "నేను అబద్దం చెప్పడంలేదు"
    
    "అసలేమనిపించింది?" అడిగింది ఉత్సుకత చూపుతూ.
    
    "ఏదో బూతు పదంలా..."
    
    ప్రబంధ తల వాలిపోయింది సిగ్గుతో నిజమే దూకుడుగా తను అనేసింది కాని సామాన్యంగా స్నేహితురాళ్ళని మాత్రమే అడిగే ఆ పజిల్ ఆదిత్యతో చెప్పాల్సింది కాదు! నిజంగా అదేమిటో తెలిస్తే....?
    
    చెంపలు ఎరుపెక్కిపోతుంటే గొణుగుతున్నట్టుగా అంది. "మరిచి పోండది!"
    
    "అదేం కుదరదు అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను."
    
    "వద్దు"
    
    ప్రబంధ ఎందుకలా కంగారుపడుతున్నదీ అర్ధంకాలేదు. విడిచి పెట్టేవాడేమో, ఆ కంగారే మరింత వుత్సాహాన్ని కలిగించింది.
    
    "ప్లీజ ప్రబంధా!"
    
    "నేను చెప్పలేను."
    
    "అంటే నిజంగా అది వల్గర్ పజిలా?"
    
    "ఛ ఛ!"
    
    "అయితే జవాబు విడమర్చి చెప్పొచ్చుగా."
    
    "నేను చెప్పను. మీరు అర్ధం చేసుకోవాలి" నేలచూపులు చూస్తూ అంది. "పోనీ ఓ హింట్ ఇవ్వనా?"
    
    "అది బెటర్."
    
    "మినిట్ లో ఒకసారి వచ్చేది, మూమెంట్ లో రెండుసార్లు వచ్చేది, హండ్రడ్ ఇయర్స్ లో ఒక్కసారీ రానిది ఏమిటి?"
    
    ఎక్కువ వ్యవధి అవసరం లేకపోయింది. టక్కున చెప్పాడు "ఎం" అని.
    
    "నేను అడిగిన పజిల్ నీ ఇలాగే ఆలోచించి చూడండి"
    
    ఆలోచనల్లో మునిగిపోయాడు. క్రమంగా బోధపడిపోయింది. ఉద్విగ్నంగా పక్కకు చూశాడు. కానీ ఆమె లేదక్కడ.
    
    వెళ్ళిపోతూంది కారులో.
    
    ఆదిత్య ఫాలభాగం పైన స్వేదం పేరుకుంది. తను పొరపాటు పడుతున్నాడా? మరోసారి పజిల్ ని మననం చేసుకున్నాడు.
    
    'షాక్' లో అయితే చివరిదాన్ని...అంటే 'షాక్'లో ఆఖరి అక్షరం 'కె'
    
    ఇన్ స్ట్రుమెంట్ గా అయితే ముందు వుండేదాన్ని అంటే మొదటి అక్షరం 'ఐ'
    
    'మిస్'లో మిస్ చేసుకోకూడని రెండింటినీ అంటే రెండక్షరాలు 'ఎస్...ఎస్' మొత్తం కలిపితే కె.ఐ.ఎస్.ఎస్.
    
    తను ఇవ్వాలనుకున్నది 'కిస్'
    
    ప్రణయ గుర్తుకొచ్చింది అసంకల్పితంగా.
    
    ప్రబంధలో ఇలామ్టి మార్పుకి కారణం ఆమె తనపైన ఇలామ్టి అభిమానాన్ని పెంచుకుంటోందా?
    
    ఆందోళన కాదు, అలజడి రేగింది. ఇది అదృష్టమో, లేక దురదృష్టమో తేల్చుకోలేకపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS