Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 51

"బావా.... ఏసిపి వీరేష్ కు పిచ్చి ఎక్కిందట... కాళ్ళూ చేతులూ అన్నీ బాగానే వున్నాయట... కొన్ని నెలల పాటు అతను హాస్పిటల్ లోనే విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. బహుశా అందువలనే ధీరజ కూడా అతనికి దూరంగా వుంటుందనుకోవాలి. అతను బతికి వున్నా నోరు మెదిపి ఏ సాక్ష్యం చెప్పలేడు. అతను ఇప్పుడు చచ్చిన శవంతో సమానం. అతని గురించి మనం భయపడడం అనవసరం..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
అంతలోనే....
ఆ రోజు దిన పత్రికను పట్టుకుని వగరుస్తూ వచ్చారు కార్యకర్తలు.
"జయచంద్ర గారూ... కొంపలు అంటుకున్నాయి సర్... మీ గురించి పేపర్లో ఏం వ్రాశారో చూడండి."
పేపర్ అందుకుని మెయిన్ హెడ్డింగ్ చూసిన మరుక్షణం సత్యమోహన్ ఖంగుతిన్నాడు.
అది చదివిన జయచంద్ర కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అయింది.
అప్పటికే నగరంలోని ప్రజలంతా ఆ పేపర్లలోని వార్తను గురించే చర్చించుకోసాగారు.
జయచంద్ర మండిపోతూ పత్రిక ఆఫీసుకు ఫోన్ చేయబోయాడు.
అప్పుడే ఫోన్ రింగయింది.
జయచంద్ర రిసీవర్ తీశాడు.
"ఎలా వుంది... నా షాక్ ట్రీట్ మెంట్..."
మాట్లాడుతుంది ధీరజ అని అర్దమయింది అతనికి.
"ఓహో... దీని వెనుక నువ్వు వున్నావు అన్నమాట..."
"అన్నమాట కాదు... ఉన్నమాటే చెబుతున్నాను. మర్యాదగా రాజీనామా చేయడం ఒక్కటే ప్రస్తుతం మీకు వున్న దారి... అప్పుడు అయినా ప్రజలు క్షమిస్తారో లేదో..."
"నాన్ సెన్స్... నీ అంతం చూస్తాను..."
"ఇంకొక విషయం చెప్పడం మరచిపోయాను జయచంద్ర... నీ ఎన్నిక సక్రమం కాదని, ఆనందరావు చేత ఎన్నికల పిటిషన ను పెట్టించి నీ పరువు ప్రతిష్టలను గంగలో కలుపబోతున్నాను. నీ పలుకుబడీ, డబ్బు, నీ క్రిమినల్ లాయర్ తెలివితేటలు నిన్ను ఎలా రక్షిస్తాయో నేనూ చూస్తాను..." అని ధీరజ ఫోన్ పెట్టేసింది.
జయచంద్ర రియాక్షన్ వూహించుకుని నవ్వుకుంది.
అతని విషయం తెలుసు కాబట్టి ఎందుకు అయినా మంచిది అని ధీరజ వెంటనే హాస్పిటల్ కు బయలుదేరింది.
కానీ... హాస్పిటల్ కు వెళ్లేసరికే బెడ్ మీద ప్రాణాలతో వుండవలసిన సుధాకర్ విగతజీవుడై కనిపించాడు.
హాస్పిటల్ స్టాప్ కళ్ళు కప్పి... ఎవరో అతనికి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపినట్టు స్పష్టంగా అర్దమవుతుంది నెగిటివ్స్ రహస్యం తెలిసే అవకాశం చేజారిపోయిందని బాధపడాలో....తన వలనే నిండు జీవితాన్ని సుధాకర్ పోగొట్టుకున్నాడని బాధపడాలో అర్ధం కాని డైలమాలో పడిపోయింది ధీరజ.
అతని మరణం ధీరజను కుంగదీయడంతో పాటు ఆమెలో పట్టుదల, కసి పెరిగాయి.
పరోక్షంగా అతని చావుకు కారకుడు జయచంద్రే కాబట్టి అతని అంతు చూడాలని నిర్ణయించుకున్నది. ఘాటయిన విమర్శలతో ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. నగరంలో అల్లర్లను లేపి ప్రశాంతత లేకుండా తన రాజీకీయ హత్యలతో శవరాజకీయాలను నడిపే ఎమ్.ఎల్ ఏ. జయచంద్ర ను చూసీ చూడనట్టు వదిలివేయడం వెనుక ముఖ్యమంత్రి హస్త కూడా వుందేమో అని అనుమానించవలసి వస్తుందని ధీరజ రెచ్చగొడుతూ పత్రికలలో ఎడిటోరియల్ లో వ్రాసింది.
నగరంలో జరిగిన అల్లర్లకు జయచంద్ర మనుషులే కారకులు అని నిరూపించే కొన్ని ఫోటోలను కూడా ప్రచురించడంతో ప్రజలు అతనిని అసహ్యహించుకోవడం మొదలు పెట్టారు.
ధీరజ కలం ప్రతిభకు ముఖ్యమంత్రి సయితం చలించిపోయాడు.
జయచంద్ర పై చర్యలు తీసుకొనడానికి సరయిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన.
అదే సమయంలో ధీరజ వాసిన విషయాలపై స్పందించినట్టుగా అప్పటి కప్పుడు పోలీసు వున్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అయన.
ఆ క్షణం నుంచీ హయచంద్ర అక్రమ వ్యాపారాలపై దాడులు ప్రారంభం అయ్యాయి.
అతని అనుచరులు ఎక్కడ ఏ చిన్న నేరం చేసినట్టు తెలిసిన వెంటనే కస్టడీలోకి తీసుకుంటున్నది పోలీస్  డిపార్ట్ మెంట్.
స్వచ్చందంగా తనంతట తనే ఎమ్.ఎల్.ఏ. పదవికి రాజీనామా చేయమని ముఖ్యమంత్రి కోరడంతో జయచంద్రకు రాజీనామా చేయక తప్పలేదు.   
                                                         *    *    *    *
రోడ్డుకు అడ్డుగా పెట్టివుంచిన రెండు లారీలను గమనించగానే కెనెటిక్ హోండాను ఆపి ధీరాజ కిందకు దిగింది.
కొంచెం కూడా ముందుకు వెళ్ళే వీలు లేకుండా పూర్తిగా కవర్ చేస్తున్నాయి అవి.
ఆ వెహికల్స్ లో ఎవరూ లేరు. చట్టు పక్కల కూడా నరమానవుడు అన్నవాడు లేడు.
వాటిని అడ్డు తొలగించకపోతే ముందుకు వెళ్ళడం కష్టం.... అందుకే తనే లారీ కాబిన్ లోకి ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేసి పక్కకు తీసే ప్రయత్నం చేసింది.
ఇంజను పనిచేయటం లేదు... అనుమానంగా రెండవ లారీ ఇంజన్ కూడా పరిశీలించి చూసింది. అదీ చెడిపోయింది.
చెడిపోవడం కాదు కావాలనే చెడగొట్టారని అర్ధం అయింది.
ఉన్నట్టుండి ఆమె రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఏదో ప్రమాదం జరగబోతుందనే ఊహ ఆమె మనసులో మెదిలింది....
ఎవరివో అడుగుల  చప్పుడు... చాలా స్పష్టంగా, దగ్గరగా వినిపించాయి.
శత్రువుల ట్రాప్ లో చిక్కుకున్నానని అర్ధం కావడంతో చటుక్కున వెనుదిరిగింది ధీరజ.
ఆమె కంటికి కబీర్ దాదా కనిపించాడు.
అతని వెనుకనే పదిమంది అనుచరులు.
ధీరజకు వెంటనే నోటమాట రాలేదు.
"ప్రతిసారీ నా చేతిలో చిక్కినట్టే తప్పించుకుపోతున్నావు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను" వికటంగా నవ్వూతూ అన్నాడు కబీర్ దాదా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS