Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 50

సతీష్ చూపులు మరలా ఆమె వక్షద్వయంవైపు మరలాయి.
ఎంతో దగ్గరగా కనిపిస్తున్న అవయవ సంపదను తిలకిస్తూ గుటకలు వేస్తున్నాడతను.
ధీరజ అది గమనించినా గమనించనట్టే వుంది.
"ఏం చేయాలో చెప్పండి మేడమ్..."
"ఎస్... ఆ రోజు నాకు ఫోన్ చేసిన తరువాతనే మా అంకుల్ చంపపడ్డాడు. అంతే అయన చెప్పింది నిజమే అనుకోవాలి"
"ఏమిటది?"
"సూట్ కేసు.... నన్ను చంపబోతున్నారు.... హోటల్ అశోకా ఇంటర్నేషనల్... ఈ మూడు మాటలు మాత్రం చెప్పిపెట్టేశాడు. తన దగ్గరున్న సూట్ కేసు మీ హోటల్ లోనే ఎక్కడో పెట్టాడు.
తనని చంపబోతున్నారని చెబుతూ అది ఎక్కడ దాచానో చెప్పాలనుకున్నాడు. కానీ ఫోన్ కట్ అయిపోయింది. అంతే ఏదో సూట్ కేసు మీ హోటల్ లోనే దాచాడు అని అర్దమవుతుంది కదూ" అన్నదామె.
"నిజమే మేడమ్.... మీరు చెబుతుంటే గుర్తుకు వస్తుంది. ఆ సూట్ కేసు కోసం చాలమంది ఎంక్వయిరీ కూడా చేశారు. కానీ ఎక్కడా దొరకలేదు. ఆ సూట్ కేసు గొడవే మాకు తెలియదు"
"బాగా ఆలోచించు సతీష్... ఆ రోజు ఏం జరిగిందో మరొకసారి గుర్తుకు తెచ్చుకో"
అతని చేతిని పట్టి కుదుపుతూ ప్రశ్నించింది ధీరజ.
ఆ స్పర్శకు పులకించిపోయాడు.
"ఎస్ మేడమ్... ఆ రోజు అకతను మమ్మల్ని దాటుకుని పరుగు తీసుకుంటూ మెట్లపైకి వెళ్ళడం చూశాను. వెళ్ళేటప్పుడు అతని చేతిలో సూట్ కేసు వున్నమాట నిజమే.
కానీ కిందకు వచ్చేటప్పుడు అతని చేతిలో ఏమీలేదు... అంతే మధ్యలోనే మాయం చేశాడు" ఆలోచిస్తూ అన్నాడతను.
"సతీష్... ఆ సమయంలో కారిడార్ లో ఎవరెవరున్నారు?"
"ఎవరూ లేరు"
"ఏదైనా రూ తెరచి వుందా?"
"లేదు"
"ఎవరూ ఎదురు కూడా రాలేదు అంటున్నావు... మరి ఏమయి వుంటుంది?
"నాకూ అదే అర్ధం కావడంలేదు. మాసిన బట్టలు తెసుకువేళ్ళే  ట్రాలీ ఒక పక్కగా ఆగి వుంది. అది తప్ప నరమానవుడు అన్నవాడు ఎవరూ ఎదురుపడలేదు"
"ఏమిటి ఏమన్నావు... ట్రాలీనా..."
"అవును... ఎందుకలా అడిగారు? గదులు ఖాళీ మాసిన దుప్పట్లు మార్చుతూ వుంటాము. ట్రాలీని నెట్టుకుంటూ వెళ్ళి మాసిన దిప్పట్లను దానిలో వేసి తీసుకువెళ్ళి సర్వీస్ రూమ్ లో గుట్టగా పడవేస్తాం. వారానికి ఒకసారి ఆ దుప్పట్లను వాష్ చేయటానికి తీస్తాం"
"సతీష్ !పద! అర్జెంట్ గా వెళదాం"
"ఎక్కడుకు?"
"సర్వీస్ రూంకు వెళ్ళాలి"
ఎందుకో అర్ధంకాకపోయినా ఆమెను తీసుకు వెళ్ళాడు.
ఆ దుప్పట్ల గుట్టను చూపించాడు.
వాటిని అటూ ఇటూ చూడాగానే దుపట్లకింద ఒక సూట్ కేస్ కనిపించింది.
ధీరజ ఆతురతగా దాన్ని అందుకుంది.
సతీష్ ఆమెననుసరించాడు.
రూమ్ కు వెళ్ళిన వెంటనే డి.ఐ జి .కి ఫోన్ చేసిందామె.
అతనికంతా అయోమయంగా వుంది.
"థాంక్స్ మిస్టర్ సతీష్! నువ్వు ఇచ్చిన క్లూ వలనే ఈ సూట్ కేసు దొరికింది. కారిడార్ లో పారిపోతుండగా ఒక వైపు వున్న ట్రాలీ కనిపించిందతనికి. వెంటనే ఆ దుప్పట్ల మధ్యలో సూట్ కేసు ని దాచేసి వుంటాడు. ఎందుకంటే అలాంటి అవకాశం తప్ప ఇంకేమీ వుండదని అనిపించింది.
అందుకే తప్పనిసరిగా ఆ దుప్పట్ల గుట్టలోనే సూట్ కేస్ వుండి వుంటుందని వూహించాను" ధీరజ చెబుతుండగానే తలుపు చప్పుడు అయింది.
సతీష్ తలుపు తెరిచాడు.
డి.ఐ.జి. లోనికొచ్చాడు.
పోలీసులను చూసి బిత్తరపోయాడతను.
"వెరీవెల్ ధీరజా! ఎంతో తెలివిగా సూట్ కేస్ రహస్యాన్ని కనిపెట్టావు"
డి.ఐ.జి సూట్ కేసు తెరిచి చూశాడు. అన్నీ కొత్త వందరూపాయల నోట్లే! అందరి కళ్ళూ జిగేల్ మన్నాయి. ఆ నోట్లను పెరిశీలనగా చూశాడు. మచ్చుకుమచ్చు అసలు నోటు అనిపించేలా వున్న నకిలీనోట్లు అవి. ఇరవై లక్షలు ఖరీదుచేసే కరెన్సీ అది.
అది పోలీసుల వ్యవహారం అని తెలియడంతో సతీష్ నోరు మెదపకుండా చల్లగా జారుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా జయచంద్రకు తెలియకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు డి. ఐ. జి .
వెళుతూ ధీరజ ముందు జాగ్రత్తగా సతీష్ కు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చింది ముందు జాగ్రత్తగా... అతను హడలిపోయాడు.
ముక్కుమీద వేలు... మరొక వేలు నోటి మీద వేసుకుని తను ఏమీ చెప్పనన్నట్టు బుద్దిమంతునిలా తల ఊపాడు సతీష్!

                        *    *    *    *
"ఆ నెగిటివ్ లు మనచేతికి వచ్చేవరకూ నాకు వేసుకుని మనశ్శాంతి లేదు. పరిశీలకుల బృందం నగరంలో పాదం మోపే లోపలే వాటిని మనం చేజిక్కించుకోవాలి. లేదంటే మన ప్రయత్నం అంతా బూదిడిలో పోసిన పన్నీరైపోతుంది."
జయచంద్ర తెగబాధపడిపోసాగాడు....
సత్యమోహన్ ఆ విషయాన్నిగూర్చే అలోచిస్తున్నాడు.
ఓ నిమిషం తరువాత....
కబీర్ దాదాకు ఫోన్ చేసి పిలిపించాడు అతను.
"హాస్పిటల్ లో వున్న సుధాకర్ ను అనుక్షణమూ గమనిస్తూ వుండు. వాడు పెదవి విప్పితే తప్ప ఆ నెగిటివ్స్ ఎక్కడ దాచాడో మనకు తెలియదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ నెగిటివ్ లు నాకు కావాలి...." అన్నాడు  సత్యమోహన్.
"అలాగే సర్..." సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS