Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 49


    క్రమం తప్పని ఒక ఒరవడిలో నడుస్తోంది!

    మౌంటెనీరింగ్ లో ప్రభుత్వ డిప్లొమా పొందానని, ప్రభుత్వ స్కూల్ నుంచి డిప్లొమా రావాలంటే సంవత్సరాలు పడుతుందని, అందుకే ఒక ప్రయివేట్ స్కూల్ నించి అది తీసుకుని వచ్చేశానని వ్రాసింది ఆమని.

    ఐఎఎస్ చేయటానికి ఢిల్లీలో కోచింగ్ బాగుంటుంది కాబట్టి ఢిల్లీ వెళ్ళిపోతున్నానని వ్రాసింది. "ఈ వార్తలన్నీ మమ్మీకి చెప్పండి! త్వరలో టార్గెట్ ని కొట్టేస్తానేమో! వెంటనే వచ్చేస్తానని చెప్పండి" అని చాలా కబుర్లు వ్రాసింది ఆమని!

    అవన్నీ చదివి చలించిపోయింది గాయత్రి.

    చాలా జాగ్రత్తగా ఆలోచించి మాటలు పొందిక చేసి జాబు వ్రాయించింది. కలెక్టర్ అయ్యే సుముహూర్తం దగ్గరలో వుందంటున్నావుగా! అంతవరకూ అమ్మగారి గురించి మర్చిపోవే ఆమనీ! ప్రస్తుతం ఇంటి పెత్తనం అంతా ఈ అక్కగారిదే అని గుర్తుంచుకో! నేనేమీ దిగులుగా లేను.

    బాగానే వున్నాను, నువ్వు వస్తావు కదా! అప్పుడు మన జాయింట్ కబుర్లు అన్నీ గుర్తు చేసుకుందాంలే! నీ ప్రయత్నాలలో ఏ మాత్రం వెనుక అడుగు పడకుండా చూసుకో! అదే అందరికీ కావాలి!

    ఎంత దూరాన వున్నా అమ్మ ఎదురు చూస్తోంది అందుకే! అని వ్రాసింది.

    ఫాంహౌస్ లో కార్యక్రమాలు తగ్గించుకుంది.

    దాన్ని అమ్మేసి బరువు తగ్గించుకోవటం మంచిది అని సలహా యిచ్చాడు వాల్మీకి! "అది మన ఆస్థి! మామగారు శ్రమించి రూపొందించిన స్వప్నం. దాన్ని అమ్మివేయటం ఏమిటండి? దానిలో మీ వ్యక్తిత్వం ఉంది.

    మీ గౌరవం ఉంది. నా యిల్లు అది! ఇది పుట్టిల్లు!

    ఆడపిల్లకు పుట్టిల్లు పరాయిచోటు అవుతుంది. కాని భర్త యిల్లు బరువు ఎందుకు అవుతుంది?" అని బదులిచ్చింది గాయత్రి.

    "సరే మీ అమ్మగారి చాదస్తం సెంటిమెంట్స్ అన్నీ వచ్చాయి. కాదనను. శక్తి ఉంటే సమర్ధించుకో! నేను మాత్రం వ్యాపారం పనులు తగ్గించుకుని ఇంటి దగ్గర ఎక్కువ సమయం గడపాలను కుంటున్నాను.

    "ఏదయినా సలహాలు సహాయం అలాంటివి కావాల్సి వస్తే అడుగుతుంటాను. అందుబాటులో ఉండేలోగా నీ కార్యక్రమాలు రూపొందించుకో!" అన్నాడు.

    ఆ మాటలలో కవ్వింపు ఉంది. గాయత్రికి అర్ధమయింది.

    కాని తల్లి మరణం తరువాత ఆమెలో వచ్చిన మార్పులో వాస్తవం ఉంది. అది పిల్లలు పుట్టరు అని తెలిసిన తరువాత ఇల్లాలి ఆలోచనలు.

    భర్తతో ఏకాంతాన్ని కోరుతుంది. కాని అతనితో కలియటానికి సిగ్గుపడుతుంది ఎలాగూ ఫలించదు కదా! ఈ ప్రయత్నాలెందుకు అంటుంది నిరాశ నిండిన కంఠస్వరంతో! పిల్లలు పుట్టరని తెలిశాక ఇల్లాలు భర్త దగ్గర ఉండే తీరులో అనివార్యంగా వచ్చే మార్పు అది!

    దానిని వాల్మీకి ఒప్పుకోలేదు "గాయత్రి! దాంపత్యం లోక సహజమయిన ధోరణికి నీవు రాకపోతే ఇంకా దిగులుతో కృంగి పోతున్నావనే కదా అర్ధం?" అని తర్కించాడు.

    "మీ కోరికలు నేను కాదనను! కాని కాయని చెట్టుకి దోహదం ఎందుకు?"

    "అలా అనటం ఇన్ ఫీరియారిటీ అవుతుంది. నువు అలా కాకూడదు. మాములుగా అయిపోవాలి! డాక్టర్ చెప్పింది అసత్యం అని నేను అనను.

    కాని డాక్టరుకన్నా భగవంతుడు శక్తివంతుడు!

    అద్భుతాలు జరుగుతాయని కాదు కాని మనిషి సహజమయిన రీతిలో జీవితాన్ని గడపటం మానసికంగా ఆరోగ్యదాయకం!

    కృంగిపోకుండా ఉండటానికి అదో దారి!" అన్నాడు వాల్మీకి.

    "ప్రతిసారీ మీరే నన్ను ఓడిస్తారు" అంటూ సహజ జీవితంలోకి రావటానికి ఒప్పుకుంది గాయత్రి మనిషి బాధలు మర్చిపోయేందుకు ఓషధులతో పనిలేదు! జీవితం ఇచ్చిన పిలుపు పెడచెవిన పెట్టకూడదు!

    భర్త ఎంత మంచివాడో ప్రతి సంఘటనలోనూ మరింతగా అర్ధం చేసుకుంటోందామె! ఇంటిలో మామూలు వాతావరణం వచ్చింది.

    పనివారు కూడ ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు.

    సుమిత్రగారి జ్ఞాపకాలు సంవత్సరం తరువాత క్రమంగా దూరం కావటం ప్రారంభించినాయి. ఆమె ఉండగా నాటిన చిన్ని చిన్ని గులాబీలు ఇప్పుడు ఇప్పుడు పొదలుగా మారాయి! పలుకుబడి మరింత అయింది.

    గాయత్రి చేతులకు నిండుగా గాజులుంటాయి కాని ఎముకలు ఉండవు.

    పెట్టిన కొద్దీ పొంగింది సిరిసంపద!!

    ఇప్పుడామె తల్లి కన్నా ఐశ్వర్యవంతురాలు! సుమిత్రగారి కన్నా గాయత్రిలో దానగుణం ఎక్కువ అని చెప్పుకుంటున్నారు.

    వారి కులదైవం జగదీశ్వరస్వామి సంకల్పం అన్నట్లు తిరిగి బ్రహ్మోత్సవాలు వచ్చాయి! దారువేట! దొంగల దోపిడి!

    ఉజ్జీల పండుగ! దంపతులు ఇద్దరూ పెళ్ళినాటి జిల్లుమనిపించే ముచ్చట్లు జ్ఞాపకం చేసుకుంటూ ఆ పారిజాతం చెట్టుక్రిందే కూర్చున్నారు.

    ఈసారి చలువ పందిళ్ళు చలివేంద్రాలు కాకుండా వచ్చిన భక్తులు అందరు ఎన్నివేలమందికి అయినా పెరుగు పులిహోర అన్నం పొట్లాలు యిచ్చే ఏర్పాటు చేయించింది గాయత్రి!

    జనం బాగా పొంగి వచ్చారు.

    పెళ్ళికి ముందు తిరునాళ్ళలో ముగ్గురూ ఆ చెట్టుక్రింద కూర్చున్నప్పుడు ఆమని ఎన్ని పోకిళ్ళు పోయిందో చెప్పుకున్నారు దంపతులు.

    "పిచ్చిపిల్ల ఎక్కడుంటుంది ఇప్పుడు? ఏం చేస్తూ ఉంటుంది?" అంది గాయత్రి.

    "ఏం చేస్తుంది? చదువుతూనో తన పటాలాన్ని వేసుకుని నగరం మీద సంచారం చేస్తూనో ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ కృష్ణవేణమ్మ పొంగి వారినంత సందడి" అన్నాడు వాల్మీకి.

    "కొంచెం పాదాలు ముందుకు పెట్టండి ధర్మతల్లి!" ఆ మాటలు విన్పించిన దిక్కుకు చూచారు. ఒక నవ వధువు నిలిచి ఉంది.

    "మీ దయతో పెళ్ళి అయిందమ్మా నాకు భర్తని కొనుక్కునేందుకు డబ్బు అంతా మీరే యిచ్చారు. రేపు మీ దయవల్ల కాపరానికి పోతున్నాను.

    ఒకసారి మీ పాదాలు కళ్ళకు అద్దుకుని వెడతాను" అంది జాలిగా!

    "నాకు వద్దులే! స్వామి నాకు యిచ్చాడు. అదే నేను మీకు యిచ్చాను ఆ స్వామికే మ్రొక్కుకుని వెళ్ళు!" అంటూ గుళ్ళో తెచ్చుకున్న అక్షతలు ఆ పిల్ల తలమీద వేసింది గాయత్రి.

    అది చూచిన ఆ పిల్ల తల్లి గబగబ వచ్చి కూతుర్ని రెక్కపుచ్చుకుని ఈడ్చుకుపోయింది! గుడి మలుపుకి తీసుకుపోయి మందలించింది.

    "శుభమా అని పెళ్ళి చేస్తే పోయిపోయి గొడ్రాలకి మ్రొక్కుతావా?"

    "పిచ్చిగా వాగకు. ఆమె దయవల్లనే కదా పెళ్ళి చేయగలిగారు?" అంటూ కూతురు ఎదురు తిరిగింది.

    "అవును వారు సంపన్నులు. ఇంత పారేశారు. మన పబ్బం గడిచింది. అంత మాత్రంచేత గొడ్రాలకి మ్రొక్కి నీ సౌభాగ్యం అర్పించుకుంటావుటే వెర్రి నా కూతురా! రక్తం చిమ్మి రెక్కలు అమ్మి వారి రుణం తీర్చుకుందాం. ఆ తల్లి రుణం మర్చిపోలేం.

    అలాగని ఇలాంటి అవాంతరాలు చేయకూడదు. పద పద" అంటూ కూతుర్ని వెంటపెట్టుకు పోయింది తల్లి.

    ఆ మాటలు గాయత్రికి విన్పిస్తూనే ఉన్నాయి. అలాగే భర్త ఒడిలో వాలిపోయింది.

   
                                16


    కళ్ళు తెరిచి చూచేవేళకు ఆమె హాస్పిటల్ లో ఉంది.

    రెండురోజుల తరువాత స్పృహ వచ్చింది. బాగా షాక్ తిన్నందువల్ల ఇలా అయిందని విశ్రాంతి అవసరమని డాక్టర్ సలహా యిచ్చాడు.

    క్రమంగా ఆమెకు జరిగిన సంగతి అంతా జ్ఞాపకం వచ్చింది. సిగ్గుతో కుంచించుకుపోయిందామె. గొడ్రాలు అనే పేరుకన్నా మరణమే మేలు.

    తల ఎత్తి భర్త వంక చూచేందుకు మనసు రాలేదు. కారణం ఏదయినా పిల్లలు పుట్టకపోతే ఆ బాధా ఆ అవమానం భర్తకన్నా భార్యని ఎక్కువగా కృంగదీస్తుంది.

    వాస్తవానికి గాయత్రీ చేసిన పొరపాటు ఏమీలేదు.

    ఆమె చాలా తప్పు చేసిన దానిలా బాధపడింది.

    వాల్మీకి చూచేందుకు వచ్చినప్పుడు తలఎత్తి అతనివంక చూడలేక నిద్రపోతున్నట్లుగా నటించింది. ఎంతకాలం అలా ఉండగలదు.

    భర్త వింటూ ఉండగా గొడ్రాలు అనిపించుకున్న దురదృష్టవంతురాలు!

    ఆమె త్వరగానే కోలుకుంది. హాస్పిటల్ నించి డిశ్చార్జి చేశారు.

    విడుదల చేస్తూ డాక్టర్ కొన్ని సూచనలు ఇచ్చాడు.

    గాయత్రిని ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వవద్దు!

    ఆమె మనసు గాయపడేలా ఎవరూ మాటాడవద్దు! తీరిక లేకుండా ఏదో ఒక పని కల్పించుకుని వ్యాపకాలు కల్పించుకోవటం మంచిది. ఆమెను రెచ్చగొట్టాలని కాని గతాన్ని జ్ఞాపకం చేయాలని కాని ఎవరూ ప్రయత్నించవద్దు!

    "గాయత్రి! పుస్తకాలు చదవటం టివి చూడటంలాంటివి అలవాటు చేసుకో! శ్రమ కలిగించే పనులేవీ చేయకు" అని చెప్పాడు ఇంటికి వచ్చాక.

    "గొడ్రాలిమీద ఇంత శ్రద్ధ చూపుతారెందుకు? సృష్టి చేయలేనిది ప్రాణం కాదు. అది ఉత్త కట్టె! తిండి ఖర్చు తప్ప మరో ప్రయోజనం లేని బ్రతుకు నాది!"

    "అలా అనకు గాయత్రీ! నువ్వు ప్రేమించగలవు. నాకు ఒంటరితనంగా అలసటగా బాధగా ఉన్న సమయాల్లో నన్ను సేద తీర్చగలవు.

    నా మీద అమృతం కురిపిస్తావు! నేను జీవించి ఉండటం అవసరమయితే నువ్వు జీవించి ఉండటం కూడా అవసరమే!
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS