సినిమా సగం కాకుండానే బోర్ కథ అంటూ లేచాడు గిరిధర్.
సినిమా నిజానికి ఎంతో బాగుంది. తన చికాకునంతా మరిచిపోయి చూస్తున్నది పారిజాత.
అయినా అతడితో లేవక తప్పింది కాదు.
అతడు తిన్నగా ఓ హోటల్ కు తీసికెళ్ళాడు.
రూమ్ బుక్ చేస్తూ మేనేజరుతో పారిజాతను తన భార్యగా చెప్పుకొన్నాడు.
రూమ్ కి వస్తూనే నిలదీసింది పారిజాత. "ఏమిటిది, గిరిధర్? ఈ హోటల్ కి తీసుకు రావడమేమిటి? రూం తీసుకోవడమేమిటి? ఈ రాత్రి ఎంతేసపు ఉండాలిక్కడ?"
గిరిధర్ బ్రతిమిలాడుతున్నట్టుగా "ఒక అర్ధగంట పారూ! నాకు బాగా ఆకలేస్తోంది. భోంచేసి వెళ్ళిపోదాం" అన్నాడు.
"పావుగంటలో ఇంటికెళ్లిపోతాం. హోటల్లో తినడం ఎందుకు?"
"ఆఁ ఈ టామప్పుడు వెడితే ఇంట్లో అమ్మ ఎటువంటి భోజనం పెడుతుందో తలచుకొంటే ఉన్న ఆకలి చచ్చిపోతుంది. ఎప్పుడూ చాలీచాలని జీవితాలు! ఈ దరిద్రమంటే నాకసహ్యం. అందుకే ఉద్యోగం వదిలేశాను! బాగా డబ్బు సంపాదించే ఆలోచనలో ఉన్నాను. బాగా సంపాదించి మీ నాన్న కలగన్నాడే పువ్వుల్లో పెట్టి పూజచేస్తాను! నువ్విక పట్టు పరుపుల మీద పవ్వళించాల్సిందే! నువ్వు నడవాల్సింది నేల మీద కాదు. పువ్వులమీద."
మితభాషిగా ఉండే గిరిధర్ ఇలా వాగుతున్నాడేమిటా అని చూడసాగింది పారిజాత. ఉద్యోగం వదులుకొన్నాడు! పిత్రార్జితం ఏమీ లేనివాడు. ఇతడు తనను పట్టుపరుపులమీద పడుకో బెట్టేంత గొప్పవాడు ఎప్పుడైపోతాడు!
అయిదు నిమిషాల తరువాత ఆ గదిలోకి భోజనానికి బదులు సీసాలూ, గ్లాసులూ వచ్చాయి.
పారిజాత పూర్తిగా బెదిరిపోయి పారిపోవడానికి అటు ఇటు చూసింది.
"పారిపోవాలని చూడకు! చంపేస్తాను!" గిరిధర్ హఠాత్తుగా కృరంగా నవ్వాడు.
పారిజాతకు భయంతో చెమట పట్టసాగింది.
గిరిధర్ ఎన్నో రోజులుగా దప్పిగొన్న వాడిలా గటగటా ఓ సీసా పట్టించేశాడు. మరో సీసాలోది గ్లాస్ లోకి వంపి పారిజాత పెదవుల దగ్గరికి తెచ్చాడు. "త్రాగు? ఈ రాత్రి స్వర్గం ఎలా ఉంటుందో చూసి వద్దువు!"
"ఛీ!" కోపంగా నెట్టే సరికి గ్లాస్ క్రింద పడి ముక్కలై పోయింది.
బేరర్ ని పిలిచి రూమ్ శుభ్రంచేయించాక తిరిగి తలుపులు మూసి వచ్చి "పొగరుకేమీ తక్కువ లేనట్టుందే! మొగుడి మాటంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తావా?"
"నువ్వింకా మొగుడివికాలేదు. నీ నిజ స్వరూపం తెలిశాక నిన్ను పెళ్ళాడడం కల్ల. నిన్ను పెళ్ళాడేకన్నా బండెడు రాళ్ళు కట్టుకు బావిలో పడితే సుఖపడతాను!"
"ఎలా తప్పించుకొంటావే ముద్దుగుమ్మా! ఈ రాత్రికి నాదానివి!" అతడికి బాగా నెత్తికెక్కి పోయింది నిషా. మత్తుగా పారిజాత మీదికి వచ్చాడు "పతివ్రత వేషాలెయయ్కు. చంపేస్తాను. ఆ మనోహర్ గాడికి డబ్బుందనే కదా నువ్వు ప్రేమించింది! ఆ డబ్బు నేనూ కుప్పలుగా సంపాదిస్తానే! కానీ పెట్టుబడిగా నిన్నే ఉపయోగిస్తాను. నీ అందం మీద లక్షలు సంపాదిస్తాను!"
గిరిధర్ చెంప ఛెళ్ళుమంది "మీదికి రాకు!" గర్జిస్తున్నట్టుగా అంది.
"ఇట్లా మొండి వేషాలు వేశావంటే ఏ బ్రోతల్ హౌసు కో ఓ పాతికవేలు తీసుకుని అమ్మేసి పీడా వదిలించుకుంటాను!" కసిగా పారిజాతను చుట్టివేశాడు గిరిధర్. గిరి ధర్ కు కండబలం బాగానే ఉంది. అతడి చేతిలో పిట్టపిల్లలా గింజుకోసాగింది పారిజాత.
ఓ అయిదు నిమిషాలు గడిచాయి. క్రిందామీదాపడి అలిసి పోయింది పారిజాత. పూర్తిగా అతడి చేతికి చిక్కిపోయే క్షణంలో టేబిల్ మీద సీసా చేతికందింది. ఎత్తి బలంగా గిరిధర్ ముఖానికేసి కొట్టింది.
గిరిధర్ ముఖమంతా రక్తమయం అయిపోయింది. మొద్దు బారిపోయిన మనిషిలా నిలబడిపోయాడు.
దొరికిన ఈ అవకాశం వృధా పరచకుండా బోల్టుతీసి బయటపడి పరిగెత్తి రోడ్డుమీదికి వచ్చింది పారిజాత.
అక్కడున్న ఓ టాక్సీ వాడికి కోమలమ్మ ఇంటి అడ్రస్ చెప్పి సీట్లోకి చేరగిలబడిన కాస్సేపటికి పారిజాతకు స్పృహ తప్పిపోయింది.
మరునాడు ఉదయం గిరిధర్ వచ్చాడు. "రాత్రి పారు వచ్చిందా? నాతో పోట్లాడి పారిపోయి వచ్చింది!" అన్నాడు. అతడి నుదుటికి అయిన గాయానికి కట్టుకట్టించుకొన్నాడు.
