అందరూ నాకు కొత్తే. అసలు మద్రాసు నగరమే ఒక మహా సముద్రంలా కనిపించేది. అప్పుడు నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. నాకంటే జనార్ధనరావు రెండు మూడేళ్ళు పెద్ద అనుకుంటాను. మాపత్రిక, గొడవలు నీ కొద్దులే.
జనార్ధనరావు బాగా పద్యాలు రాసేవాడు.మేమిద్దరం ఎప్పుడూ వాదించుకొనేవాళ్ళం.జనార్ధనరావు తన అభిప్రాయాల్ని ఎవరిమీదా బలవంతంగా ఎప్పుడూ రుద్దేవాడు కాడు. మేమిద్దరం ఏనాడూ మాటా మాటా అనుకొని ఎరగం. బక్కపలచగా, ఎర్రటి వొళ్ళూ, సూటి ముక్కు, సూదుల్లాంటి కళ్ళు, గంభీరమైన ముఖం అతడిది. సంగీత విద్వాంసుడని అనడం కాదుగానీ బాగా పాడేవాడు.
జనార్ధనరావుకి కోపం రావడం నేనెప్పుడూ చూడలేదు. నన్నూ నా రచనల్నీ మెచ్చుకొని ఎంతో కోపరేట్ చేసేవాడు. మా ఇద్దరి మధ్య అరమరికలు, అభ్యంతరాలు వుండేవికావు. రహస్యాలులేవు. ఒక ప్రాణం, రెండు శరీరాలుగా అయిపోయాం.
ఇద్దరం ఇంచుమించు సమ వయస్కులం. మా ఇద్దరికీ ఆడంబరమంటే ఇష్టంలేదు.ఇద్దరం సాహిత్య మంటే పడి చచ్చేవాళ్ళం.
డబ్బు లేకుండా బతకడం కష్టం అని ఇద్దరికీ తెలుసు. కానీ ఆ డబ్బుఎలా ఆర్జించాలో ఇద్దరికీ తెలీదు. నేనా టెక్నిక్ ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాననుకో.
సాహిత్యానికే మా జీవితాలను అంకితం చెయ్యాలనుకున్నాం. ఏ ఎండకా గొడుగు పట్టడమంటే ఇద్దరికీ పరమ అసహ్యం.
జనార్ధనరావు గురించి నేను చెప్పడానికింకా ఏముంది? ఎంతయినా చెప్పచ్చు.
'నేను ఉదయిని ప్రారంభిస్తాను. నువ్వూ మద్రాసురా' అని పల్లవి పాడాడు జనార్ధనరావు. అతని పాట పూర్తయ్యేదాకా నేను చెన్నపట్నం వెళ్ళడం పడింది కాదు.
ఆఖరి రోజుల్లో_ఒక మూడు రోజులు కాబోలు_జనార్ధనరావు మా ఇంట మంచం పట్టాడు. 'మీరెంత బాధపడుతున్నారో, ఆరోగ్యం వుండి కూడా నేనూ అంత బాధపడుతున్నాన'ని అతనితో అన్నాను.
జనార్ధనరావుకి క్షయ వ్యాధి వచ్చింది. అతడ్ని చంపింది ఆ వ్యాధి కాదు. దారిద్ర్యమే అతని ప్రాణాలు తీసింది.
నా సంగతి సరేసరి. నేను కటిక దరిద్రం అనుభవిస్తూ వుండే రోజులవి. అతను కోరినట్లు నేను మద్రాసు చేరుకోగలిగి వుంటే జనార్ధనరావు తప్పకుండా జీవించేవాడే.
ఆకస్మికంగా, ఆశ్చర్యకరంగా మాకు అతని మరణ వార్త వినిపించింది. ఆంధ్రపత్రికలో ఈ వార్త ఇతరులకేమీ కాదు. కానీ నా వంటి వాళ్ళను స్తంభీభూతుల్ని చేసిన ఆశనిపాతం, తీరని నష్టం. దారుణమైన విపత్తు ఈ వార్త.
నేను మాత్రం జనార్ధనరావు చనిపోయాడని ఆక్రోశించాను. అతడి మరణం అనేక ఆలోచనలు రేపింది. ఎటు చూసినా అతడు మరణించాడనే వగపు మాత్రం మిగిలింది. అయినా_అతడు చనిపోయాడంటే నమ్మలేకుండా వుండేవాడ్ని.
'ఉదయిని' అంటే సాహిత్య స్వరూపాన్ని తీర్చి దిద్దడానికి జనార్ధనరావు ప్రతిజ్ఞ పట్టిన పత్రిక, దానికోసమే బలైపోయాడతడు. అతడికొక తర్పణం విడిచాను.
'తల వంచుకు వెళ్ళిపోయావా నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్నే వదిలి'
__అంటూ ఓ అంకితం గీతం రాశాను. నా 'మహాప్రస్థానం' కవితా సంపుటి అతనికి అంకితమిచ్చాను." అని చెప్పారు శ్రీశ్రీగారు.
"అంటే జనార్ధనరావుగారు పోయిన తర్వాతే మీరు మద్రాసు వచ్చారన్న మాట" అన్నాను.
"అవును. నేను 1938లో మద్రాసు వచ్చాను" అని మళ్ళీ సిగరెట్ వెలిగించారు.
ఒక నిముషం ఇద్దరం ఏమీ మాట్లాడలేదు. నాకు ఏమీ తోచడంలేదు. 'మద్రాసు చేరుకుంటాం ఇక' అనుకుంటూ, "ఏవండీ" అని పిలిచాను.
"ఇక మరేమీ నన్నిప్పుడు అడగకు సరోజా! కాస్త జరుగు" అన్నారు.
"దేనికి?" అన్నాను.
"అబ్బ! చెప్పినపని చెయ్యి సరోజా! జరగమన్నాను_జరుగు" అన్నారు. జరిగాను.
అంతే_ఆ కాస్త స్థలంలోనూ కాళ్ళు ముడుచుకొని, నా తొడ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నారు.
"ఏవండీ_నిద్రేనా?" అని అడిగాను.
"లేదు సరోజా! ఏమిటి చెప్పు?" అని అడిగారు.
"ఏవండీ. మన ఇంటి పేరు శ్రీరంగం కదా? శ్రీరంగం అంటే వైష్ణవులై వుండాలని అందరూ అనుకోవడం కద్దు. మనింటికా పేరు ఎందుకొచ్చిందండీ. ఇంతకీ మీరు శ్రీరంగం వెళ్ళి చూశారా?" అని అడిగాను.
"అబ్బబ్బ! నీకన్నీ ధర్మసందేహాలే సరోజా!" అని విసుక్కున్నారు.
"అబ్బ! చెబుదురూ. మరోగంట, గంటన్నరలో సెంట్రల్ స్టేషన్ వచ్చేస్తుంది. నాకు నిద్ర రావడం లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వను. చెప్పండి" అన్నాను.
"నేను 1975 వ సంవత్సరంలో తిరుచినాపల్లి వెళ్ళాను సరోజా! ఎందుకని అడగవేం! ప్రత్యేకించి శ్రీరంగం వెళ్ళడం కోసం మాత్రం కాదు. రేడియో ప్రోగ్రాం కోసం వెళ్ళాను.
తెల్లవారకుండానే తిరుచినాపల్లి స్టేషన్లో దిగాను. పది గంటలకి రేడియో స్టేషన్ కి వెళ్ళాలి. ఇంకా బోలెడంత టైం వుంది. ఆ దగ్గర్లోనే శ్రీరంగం వుందని చెప్పారు. ఇంత దూరం వచ్చిన తర్వాత, దగ్గిర్లోనే వున్న మా ఊరు చూసి తీరాల్సిందే అనుకున్నాను. ఒక జట్కాలో బయలుదేరాను. కొత్తవాడ్ని. పైగా అరవం బాగా రానివాడ్ని. కాబట్టి మూడు రూపాయలకి దమ్మిడి తగ్గనన్నాడు జట్కావాడు. రానూ పోనూ కూడా కాదు. కేవలం ఈ ఊరి నుండి తీసుకువెళ్ళి ఆ ఊరిలో దించడానికి మాత్రమే. 'సరే'నని జట్కాలో కూర్చున్నాను.
