శ్లో|| కారూణా మాపి దారుణా మశ్మనాం వేశ్మనా మపి
నృసింహభారతేర్ద్రవ్య మయ్యో అయ్యో వృధావృధా. 507
అహోబలపండితుఁడు.
ఆంధ్రశబ్దచింతామణి సూత్రములకు భాష్య మొనరించిన గాలి యహో బలపండితుఁడు మైదవోలున నుండఁగా గుండ్లకమ్మ వఱద వచ్చి కొంపలు కూలి పంటలు పాడ్వడి తిన నన్నమును గట్ట గుడ్డయు లేని దుర్దశ వాటిల్లెను. అపుడు నరసారావుపేట మల్రాజువారి సంస్థానమున కరుగుదెంచి యీ క్రింది సీస పద్యమును జెప్పి వారివలన నొక యగ్రహరముం బడసి యాతఁ డచ్చటకు నివాసము మార్చుకొనేనట!
సీ|| జానకీపతి లేఁత సజ్జరొట్టెలపాలు
కొంపలకప్పెల గొడ్లపాలు
సంవాసములు దొంగజాగిలంబుల పాలు
నయనముల్ జాగరణంబుపాలు
కలపుస్తకపుఁద్రాళ్ళు కట్టే మోపులపాలు
పొలు పైన చేతులు ముండ్లపాలు
భూరిసంధ్యావిధుల్ బురదనీళులపాలు
నాలుక దీనోక్తి నటనపాలు
గీ|| ఘనతరస్నేహ మతి నీచజనముపాలు
చిత్త మే వేళ నతిదీర్ఘ చింతపాలు
హరిహరీ! దేహ మంతయు నలఁతపాలు
మైదవోలున నుండుట మాకుఁజాలు. 508
అతని ప్రతిజ్ఞ
క|| నెట్టన నభినవనన్నయ
భట్టాచార్యాభిధాన పటుబిరుదాంకం
బిట్ట ట్టనక వహించిన
దిట్టఁడ! నమఁ బోలఁగల సుధీవరు లేరే? 509
అడిదము సూరకవి
క్రై 1750 ప్రాంతములం దీ కవిరత్నము విశాఖపట్టణపు మండల మందలి విజయనగర సంస్థానపుం బ్రభువగు పూసపాటి చినవిజయ రామరాజు గారియెద్దఁ గవీశ్వరుఁడుగా నుండెను. ఆంధ్ర చంద్రాలోకము, కవిసంశయ విచ్చేధము, కవి జనరంజనము, మొదలగునవి యితని కృతులు. ఈతని చాటువులు:-
చ|| గడియకు నూఱుపద్దేములు గంటము లేక రచింతుఁ దిట్టఁగాఁ
దొడఁగితినా పఠాలుమని తూలి పడుం గులశైలరాజముల్
విడిచి యను గ్రహించి నిఱుపేద ధనాధీపతుల్యుఁ జేతు, నే
నడిదమువాఁడ! సూరనసమాఖ్యుఁడ! న కొకరుండు సాటియే? 510
చ|| గరిసెలు వ్రాఁత గాని మఱి గంపెఁ డేఱుంగము మన్యదేశముల్
తిరిగి యభీష్టవస్తువులు తెచ్చి భుజింతుము సర్వకాలము
సురుచిరసత్కవిత్వనిధి సూరకవీంద్రున కేల కల్గేఁ గం]
చరమును రేగ మేక మెడచన్నుల వంటివి రెండు మాన్యముల్! 511
ప్రశ్నోత్తరరూపముగాఁ దనవృత్తాంతముఁ జెప్పుకొన్న పద్యము:-
క|| ఊరెయ్యది ? చీపురువలె
పేరో? సూరకవి; యింటి పే?
మీరాజు? విజయరామ మ
హారా; జతఁ డేమి సరసుఁడా?భోజుఁడయా. 512
రాజును బొగడిన పద్యములు
శా|| డిల్లీలోపల గోలకొండపురి నిండె నీ ప్రశంసల్ గుఱాల్
బల్లాలం బోడిపించి హుమ్మన యరబ్బా నెక్కి పైకొంచుబా
దుల్లాఖానునిఁ బాఱఁదోలితివి నీదో శ్శక్తి సూబాలకు
మళ్ళింపం దరమౌనే శ్రీ విజయరామా! మండలాదీశ్వరా! 513
ఉ|| పంతము నీకే చెల్లె నొక పాటియమీరుఁడు నీకు సాటియా?
కుంతముఁ గేలఁబూని నినుఁ గొల్వనివాఁడు ధరాతలాన భూ
కాంతుఁ డో'కండు లేఁడు కటకంబు మొదల్కొని గోలగోండవ
ర్యంతముఁజూడ శ్రీ విజయరామనృపాలక ! మండలాధిపా! 514
విజయరామరాజుగా రేదో కారణమున సూరకవిగారియెడ నాగ్రహమూని యస్థానమునుండి తొలగించిరట! బాదుల్లాఖానుతో నొకసారి యుద్దము సేయుఁ బోయి పరాభూతులై యారాజుగారు తిరిగి వచ్చుచుండఁగా సూరకవి తన గ్రామము ప్రక్కత్రోవలోఁ బనసచెట్టెక్కి విస్తళ్ళకై యాకులు గోసి కొనుచుఁ జూచి యెదురుపోయి పల్లకీ నాపి తన కసి తీఱునట్టు చుఱుకుగా నీ పద్యమును జెప్పెనట--
గీ|| మెత్తనైయున్న యరటాకుమీఁదఁ గాక
మంటమీఁదను జేల్లునే ముంటివాఁడి
బీదలై యున్న సర్దార్ల మీఁదఁ గాక
కలదె క్రొవ్వాఁడి బాదుల్ల ఖాను మీఁద? 515
పొనుగుపాటి వెంకటమంత్రి యనుని యోగిమీఁద సూరకవి చెప్పిన పద్యములు:--
క|| ఘనకులమునఁ బిదమినదు
ర్మనుజుం డిల నింద్యుఁడగు వమన మూర్ధ్వముఖం
బున వెడలి మంచిదగునా
విను మవహిత పోన్గుపాటి వెంకటమంత్రీ! 516
క|| కినుక మెయిఁ దన్ను లాడఁగ
మొనకట్టిన సరియె గుఱ్ఱము గాడిదయు
ఘనుఁ డల్పుఁడు సరి యగుదు రె
విను మవహిత! పోన్గుపాటి వెంకటమంత్రీ! 517
క|| సామజము చెఱకు మేసిన
దోమలు పదివేలు చేరి త్రోలం గలవా?
గ్రామపతి తగవు దప్పిన
గ్రామములో నున్నవారు కా దనఁగలరా? 518
క|| ఇత్తడి పుత్తడి యగునా?
తొ త్తది నగ లెన్ని యిడిన దొరసా నగునా?
యుత్తమకులుఁ డౌనా దౌ
లత్తునఁ దాఁ దిరిగినను గులాము గులామే! 519
క|| బలవంతుఁడు బలహీనుఁడు
పొలియుదు రిది తప్ప? నల్లపూసలు ముత్యాల్
దొలఁగుఁగద! మగఁడు పోయిన
వెలఁదు కకు బోన్గుపాటి వెంకటమంత్రీ! 520
క|| జలచరము లభ్ది బోడమవే?
జలరాశికి మోదకరుఁడు చంద్రుం డొకఁడే
కుల ముద్దరింప నొకఁడే
విలసద్యశ! పోన్గుపాటి వెంకటమంత్రీ! 521
క|| వలరాచపనికిఁ గాదా
వెలవెలఁదుక పాన్పు నెక్క విటుఁడు సహించు
జల మేల కార్యవాదికి
విలసద్యశ! పొన్గుపాటి వెంకటమంత్రీ! 522
క|| వరదానాచారంబుల
గరిమగను వనీవకులును కర్మఠులును భూ
సురమణి యని నిన్నందురు
విరచితవృష! పొంగుపాటి వెంకటమంత్రీ! 523
