Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 49


    "విషయం తెలుసుకున్న నాన్నగారు కృంగిపోయారు. మానసిక క్షోభను అనుభవిస్తూ జీవచ్చవంగా బతుకు వెళ్ళదీశారు. కనీసం నీకయినా మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామని ఒక సంబంధాన్ని ఖాయం చేశారు. సాయంత్రం పెళ్ళి అనగా ఇంట్లోంచి చెప్పాపెట్టకుండా ఉడాయించావు నువ్వు."
    "నువ్వు ఇంట్లో లేకపోవడంతో నాన్నగారు ఖంగారు పడ్డారు. అప్పుడు ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. పెళ్ళికొడుకు డాక్టర్ అశోక్ నా గురించి అంతా తెలుసుకున్నారు. మంచి మనసుతో, అదే ముహూర్తానికి నన్ను పెళ్ళి చేసుకున్నారు!
    "ఆదర్శం అంటే నీలా చెప్పా చెయ్యకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం కాదే! డాక్టర్ అశోక్ ఆస్తి, అంతస్థు, చదువు అన్నీ ఉండికూడా నాలాంటి విధి వంచితను జీవితంలోకి ఆహ్వానించారంటే, ఆయనే నిజమైన ఆదర్శవాది. కాదనగలమా? ఇందాక వచ్చింది ఎవరో పరాయి వ్యక్తి అనుకున్నావు. నీ ఆలోచన నీతో మరోసారి తప్పటడుగు వేయించింది. అతనే మీ బావ అశోక్!" ఉమ కళ్ళల్లో కించిత్తు గర్వం తొణికిసలాడింది.
    తను అప్పటివరకు తన అక్క బావల గురించి చెడుగా ఊహించింది. తన తొందరపాటుకు సిగ్గుపడింది. వెంటనే పశ్చాత్తాపంతో ఉమ చేతులు పట్టుకుంది అనూష.
    "పిచ్చిదానా! తొందరపడి నిర్ణయం తీసుకోవడం నీకు అలవాటేగా! అయినా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నువ్వు ఒక ఇంటిదానివైతే నాన్నగారికి మనశ్శాంతి కలగజేసిన దానివవుతావు" అనునయంగా అంది ఉమ.
    అనూష ఆలోచనలో పడింది.
    ఇప్పటివరకు తను 'నా' అన్నవాళ్ళనందరినీ దూరం చేసుకుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తనేం పోగొట్టుకుందో తెలుస్తున్నది.
    ఆ ఆలోచనతో అనూష కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గుండె నెవరో ఒక్కసారిగా పిండినట్టయింది. భారంగా శ్వాస పీల్చింది.
    "చెల్లీ! నాన్నగారు నీ గురించే బాధపడుతున్నారమ్మా! నీ ప్రవర్తనకు సమాజంలో తలెత్తుకు తిరగలేక ఆశ్రమ జీవితం గడపాలని వెళ్ళిపోయారు. ఇవిగో నీకివ్వమన్న ఆస్థి తాలూకు వీలునామా కాగితాలు" అంటూ తెచ్చి ఆమె చేతిలో పెట్టింది ఉమ.
    జీవితం తనను శపించింది. తన వాళ్ళందరికీ తను దూరమయింది. తను తన గమ్యాన్ని చేరలేకపోయిందా?
    రకరకాల ఆలోచనలు ఆమె చుట్టూ పరిభ్రమించాయి.
    "ఇక నేను వెళతానే అక్కా!" అంది స్థిర నిశ్చయంతో అనూష.
    "అనూ! నిజానిజాలు తెలుసుకున్నావుగా! ఇప్పటికైనా వచ్చి ఇక్కడే ఉండిపోతే, నాన్నగారిని ఎలాగోలా బ్రతిమిలాడి ఇంటికి తీసుకువద్దాం" అంది అనురాగంతో భుజం నిమురుతూ ఉమ.
    "లేదక్కా! తప్పో, ఒప్పో ఒక నిర్ణయం తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళాను. నా గమ్యం నేను చేరుకునేవరకు ఈ ఒంటరి పోరాటం తప్పదు!" అనూష గొంతు వణికింది.
    ఆమె పట్టుదల మొదటినుంచి తెలిసిన ఉమ, దూరమవుతున్న అనూషను బేలగా చూస్తూ ఉండిపోయింది.


                            *    *    *    *


    ఆ సమయంలో అనూష తన గదికి రావడం ఆనంద్ కు ఆశ్చర్యం కలిగించింది.
    అతను మౌనంగా ఉండటంతో తనే చొరవగా లోపలికి వచ్చి కూర్చుంది అనూష.
    "నీతో సీరియస్ గా మాట్టాడాలని వచ్చాను" అంది.
    "మీ ఇంటికి వెళ్ళావా? ఇంటి విషయాలేమిటి? అంతా బాగున్నారా?"
    అతని ప్రశ్నలకు అనూష ముక్కుమీదకు కోపం వచ్చింది. తన మాటలు అతనికి జోక్ లా వున్నాయి. కాకపోతే అతను తన గురించి ఆలోచించకుండా, ఇంటి గురించి, ఆ ఇంటిలో వుండేవారి మంచి చెడుల గురించి అడుగుతున్నాడేమిటి?
    "మహానుభావా! అందరూ బాగున్నారు. ఇంటి విషయాలు అంటూ ఏమీ లేవు. అయితే, నేను చెప్పబోయే విషయం విని నువ్వు ఖంగారు పడవద్దు. జాగ్రత్తగా విను!" అతని ప్రశ్నలకు అంతే వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది అనూష.
    "అలాగే మేమ్ సాబ్! మీరు ఏం చెప్పినా ఓపికగా వింటాడీ భావుకుడు" అంటూ బుద్ధిగా కూర్చున్నాడు ఆనంద్.
    "ఆనంద్! ఈ ఒంటరి ప్రయాణంలో అలసిపోయాను. 'నా' అన్నవారినందరినీ దూరం చేసుకున్నాను. ఒక్కసారి వెనుదిరిగి చూస్తే నాకేమీ కనిపించడంలేదు. అంతా అగాధంలా వుంది! నేనేమీ సాధించలేదనిపిస్తున్నది. అన్నీ పోగొట్టుకున్నాననే నిరాశ నన్ను వెంటాడుతున్నది." ఆమె గొంతు ఆర్ద్రమయింది.
    ఆనంద్ ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు.
    అనూష ఒంటరిగా సమాజంలో అడుగుపెట్టింది. ధైర్యంగా తన కాళ్ళమీద తను నిలచి జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నది. కాని, ఇప్పుడు ఎందుకిలా డీలా పడిపోయినట్టు? ఇంటి దగ్గిర పరిస్థితులకు ప్రభావితం అయిందా? లేక, కొత్త సమస్యలేమైనా ఎదురయ్యాయా? ఆనంద్ కు అర్థం కావడంలేదు.
    "ఆనంద్! లోకంలో అందరూ సుఖపడుతున్నప్పుడు నేను మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలనుకోకూడదు?" అనూష మళ్ళీ ఆత్రుతగా అడిగింది.
    "భలేదానివే! ఇప్పుడు నిన్ను సుఖంగా ఉండొద్దని ఎవరన్నారు? అయినా, నీ దారికి ఇప్పుడెవరడ్డు వచ్చారు?"
    "ఒకళ్ళు అన్నారని కాదు ఆనంద్! ఇప్పటివరకూ నేను నా గురించి ఆలోచించుకోలేదు. నేను స్త్రీని అనే విషయాన్నే మరచిపోయాను. ఇప్పుడిప్పుడే నాలో కూడా స్వార్థంతో కూడిన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. నాకంటూ భర్త, పిల్లలు, ఇల్లు, వాకిలీ కావాలనిపిస్తున్నది. నా కోర్కె అత్యాశేమీ కాదుగా?" ఆమె మాటలలో ఆమె పడుతున్న ఆవేదన వ్యక్తమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS