Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 49

"లేదండీ! నేను ఒక్కదాన్నే అలా చూసి ఇలా వచ్చేస్తాను." అంది ఆశగా శ్రీమహాలక్ష్మి.
అయిష్టంగా ముఖం పెట్టింది ఆమె.
అక్కడే వున్న ఆమె స్నేహితురాలు "పోనీలేవే పాపం! అలా చూసి ఇలా వెళ్ళిపోతానంటోంది కదా! ఒక్కసారి చూపిస్తే నీ సొమ్మేం పోయిందే. శ్రీదేవిని చూడటంగానీ, చూపెట్టడంగానీ అందరికీ సాధ్యం అవుతుందా! ఆమె మీ మేనత్త కూతురు గాబట్టి, మాలాంటి వారికి చూసే యోగమయినా పట్టింది. చేతుల్లో వున్న పని ఈ ఒక్కసారికీ చూపిద్దూ! ఆ అమ్మాయెంతో మోజుపడి అడుగుతోంది." అంది ఆమెతోపాటు వున్న ఇంకొకామె.
"సరే! మాతో రా! అలా చూసి ఇలా వెళ్ళిపోవలసిందే. శ్రీదేవితో మాటలూ గీటలూ పెట్టుకున్నావంటే వూరుకోను. ఈ సంగతి ఎవరితోనన్నా చెప్పినా వూరుకోను. జనం వచ్చి మా యింటిమీద పడతారు." అయిష్టంగా ముఖం పెట్టి ఈ మాట అని, ఆమె ముందుకు సాగింది. స్నేహితురాలు ఆమె పక్కనే నడువసాగింది.
శ్రీమహాలక్ష్మికి వాళ్ళతోపాటు వెళ్ళాలనే వుంది. తమ్ముడు బస్సు దగ్గరకి వెళ్ళాడు, తల్లి హోటల్లోకి వెళ్ళింది. ఏం చెయ్యాలో పాలుపోక మళ్ళీ వాళ్ళని అక్కడ ఆపి, తన విషయం చెప్పుకొచ్చింది శ్రీమహాలక్ష్మి.
"సరేలే! మీ అమ్మ హోటల్లోకి వెళ్ళిందన్నావు కదా! హోటలు వాడిని కూరలు పచ్చళ్ళూ కొనుక్కొని బయటకి రావటానికి ఐదునిమిషాల పైనే పడుతుంది. మీ అమ్మ ఎలా వుంటుందో, ఏ చీర కట్టుకుందో చెప్పు మీ అమ్మ బయటకు వస్తే, మీ అమ్మ కంగారు పడకుండా నీ విషయం చెబుతుంది. నా స్నేహితురాలు ఇక్కడే వుంటుంది. మనిద్దరం వెళదాం పద. శ్రీదేవిని అలా చూసి ఇలా వచ్చేద్దువు గాని. నీవు మళ్ళీ ఇక్కడికి రాంగానే, నా స్నేహితురాలు మా యింటికి వస్తుంది" అంటూ ఉపాయం చెప్పింది ఆమె.
శ్రీమహాలక్ష్మికి ఆమె చెప్పింది బాగా నచ్చింది. తన తల్లి ఆనవాళ్ళు, కట్టుకున్న చీరరంగూ రెండూ ఆమెకి చెప్పి, మొదటి ఆమెతో కలిసి పరుగులాంటి నడకతో ప్రక్కసందులోకి దారితీసింది శ్రీమహాలక్ష్మి.
ప్రక్కసందులోని మూడో యింట్లోకి ఏ అనుమానమూ రాకుండా తీసుకెళ్ళింది శ్రీమహాలక్ష్మిని ఆమె.
ఆ తరువాత ఆ యింటి తలుపులు నిశ్శబ్దంగా మూసుకుపోయాయి.
వాళ్ళిద్దరూ మోసకత్తెలు. ఆ విషయం తెలియని శ్రీమహాలక్ష్మి సినిమా తారను చూడాలనే పిచ్చి వ్యామోహంతో, పల్లెటూరి అమాయకత్వంతో, చాలా తేలికగా వాళ్ళు వేసిన వలలో చిక్కుకుపోయింది.
హోటల్ దగ్గర వున్న ఆ రెండో మోసగత్తె ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లు ఇంకా అక్కడే నుంచుని వుంది. వకుళాంబ హోటల్లోకి వెళ్ళి వాళ్ళని వంట పదార్థాలను గురించీ అడుగుతూ వుంటే వాళ్ళు నవ్వటం, దాంతో ఈవిడకి కోపం వచ్చి వాళ్ళతో పోట్లాడటం మొత్తానికి హోటల్ లోపల అనవసరంగా పదినిముషాలు గడిచిపోయింది.
వాళ్ళతో పోట్లాడి బయటకి వచ్చేసింది వకుళాంబ.
సుందరాచారి వందరూపాయల నోటు తీసుకుని ఎదురువచ్చాడు.
కొడుకుని చూస్తూనే "అక్కయ్య ఏదిరా?" అంది ఆమె.
"బాగుంది! నాకేమి తెలుసు! అక్కయ్య నువ్వూ ఇక్కడ వుంటాము. డబ్బులు నన్ను తెమ్మని బస్సు దగ్గరికి పంపించావు కదా! అక్కయ్యేదని నన్ను అడుగుతావేమిటి?" చిరాకుపడుతూ అన్నాడు సుందరాచారి.
"అదెక్కడికి పోయిందో, ఏమిటో!" అంటూ గాభరాగా నలువైపులకీ చూసింది శ్రీమహాలక్ష్మి కోసం వకుళాంబ.
అక్కడ హోటల్స్, షాపులు వుండటం వల్ల బజారు కాస్త సందడిగానే వుంది. ఎవరి పని వారికి ముఖ్యం అన్నట్లు వాళ్ళ మానాన వాళ్ళు నడిచిపోతున్నారు. ఒకరి విషయం మరొకరు పట్టించుకునే స్థితిలో లేరు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS