Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 49


    విజయ్ రాజ్ చేతిమీదవున్న పచ్చబొట్టు టక్కున గుర్తుకువచ్చి ఈ తఫాకి ఈ కేసులో పచ్చబొట్టు పొడిచేవాళ్ళ వేషం వేద్దామనుకున్నారు. ఈ దిక్కుమాలిన అయిడియా కూడా దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకే వచ్చింది.


    (కీజీ గర్ల్స్, పన్నీటి కెరటాలు, మారణజ్వాల, ఈమూడు నవలలో ఇన్ స్పెక్టర్ వర్ధనరావు, హెడ్ కానిస్టేబుల్ అహోబిలం మారువేషాలు వాళ్ళ తమాషాలు వుంటాయి. కోటీ యాభై లక్షలు వాళ్ళు వున్న నాలుగో నవల)


    ఈ వేషం వేసేముందు పచ్చబొట్టు పొడిచే ఒకతని దగ్గరకి వెళ్ళి చూశారు. వచ్చినవాళ్ళు ఇన్ స్పెక్టర్ కానిస్టేబుల్ అని తెలియక 'ఇది ఆకులు మూలికలతో చేసిన పసరు. ఇవేమో సూదులు. ఈ సూదులలో పొడిచి బొమ్మనిగాని పేరునిగాని పచ్చబొట్టుగ చేయాలి. ఈ పసరుని యీ విధంగా వాడాలి. సూదితో పొడిస్తే కాస్త చురుకు పుట్టుద్ది. తప్పదు." అంటూ వివరంగా చెప్పాడు.


    "చాలు మేము వచ్చిన పని తేలిగ్గానే అయింది." అన్నాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.


    "పచ్చబొట్టు పేరుగా పొడిపించుకోరా!" తెల్లబోయి అడిగాడు పచ్చబొట్టు పొడిచే అతను.


    "మేమిపుడు మామూలు దుస్తులలో వున్నాము. డ్యూటీలో వుంటే లాఠీతో డొక్కలో పొడుస్తాము. డ్యూటీలో భాగంగా ఇహపై సూదితో పొడుస్తాము." ముక్కు ఎగబీలుస్తూ చెప్పి ఇవతలకి వచ్చాడు వర్ధనరావు.


    పచ్చబొట్టు పొడిచేవాడికి తన దగ్గరకి వచ్చిందెవరో తెలియలేదు. వివరంగా పచ్చబొట్టు గురించి అడిగి ఏదేదో ఆ తర్వాత మాట్లాడివెళ్ళి  పోవటం విచిత్రంగ అనిపించింది. వీళ్ళెవరో కొత్తరకం పిచ్చాళ్ళనుకుని సర్దుకున్నాడు.


    బాస్ గాడిని పట్టటానికి పోలీస్ డ్రస్ తో వెళితే లాభంలేదు. పోనీ మామూలు డ్రస్ తో వెళదామా అంటే ముఖాలు గుర్తుపడతారు. పచ్చబొట్టు పొడవటానికి మారువేషాలు వేస్తే తప్పేంటి? అనుకుని ఇన్ స్పెక్టర్ వర్ధనరావు హెడ్ కానిస్టేబుల్ అహోబిలం మారువేషాలు వేసుకున్నారు.


    ఇప్పుడు దిగ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఎర్రపంచె కట్టుకుని బాగా పొడుగు చేతులు వున్న ఆకుపచ్చ రంగు చొక్కాని పంచెలోకి దోపి పంచె జారకుండా బెల్టు పెట్టుకుని నల్లటి శాలువాని బుజాన వేసుకుని ముతక చెప్పులు, చేతికర్ర పచ్చబొడిచే సామాగ్రీ వున్న పచ్చగుడ్డ మూటని చంకకి తగిలించుకుని విచిత్ర వేషధారణలో వుండేదేగాక ముఖం కూడా మార్చేసుకున్నాడు. వెనుకవేపు ముడివున్న విగ్గు. మెలికపెట్టిన పెద్దసైజు మీసాలు నుదురంత రాచుకున్న విబూది. రెండు కనుబొమల మధ్య అర్థరూపాయి సైజు కుంకం బొట్టు. కంటికింద అతికించుకున్న కుంకుడు గింజంత సైజు పులిపిరికాయ. చాలా విచిత్రమైన వేషం కట్టాడు.

    
    హెడ్ కానిస్టేబుల్ అహోబిలం కూడా దుస్తుల విషయంలో కాస్త రంగు మార్పుగ అదే గెటప్ తో వున్నాడు. కీర్తిశేషులు మహా హాస్యనటులు రేలంగి, రమణారెడ్డిగార్లు మారువేషాలు వేస్తే ఎలా వుంటారో అలా వున్నారు.


    ముందుగా ఒక ఫోటో స్టూడియోకెళ్ళి ఆ వేషాలతో ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఊరుమీద పడ్డారు.


    వాళ్ళు ఏవిధంగా ప్రవర్తించాలి. ఎలా మాట్లాడాలి అన్నది ముందే మాట్లాడుకున్నారు.


    "పచ్చబొట్లు పొడుస్తాం హా..." అంటూ గొంతెత్తి అరిచాడు వర్ధనరావు.


    "పచ్చ పచ్చగా పలు రంగులతో పొడుస్తాం. హూ..." అంటూ అహోబిలం ఆ వెంటనే అరిచాడు.


    "హా...హూ..." అనేవి మాట చివర యాసగా అదో విధంగా వాడాలని వాళ్ళు ముందే అనుకున్నారు.


    అరగంటపైనే వాళ్ళావిధంగా అరుస్తూ తిరిగారు. వాళ్ళని పిలిచినా వాళ్ళుగాని వాళ్ళ ముఖం చూసిన పాపానగాని ఎవరూ పోలేడు.


    ఉదార పోషణార్థం బహుకృతవేషం అన్నారు.


    కోయ దొరలు జాతకం చెప్పేవాళ్ళు. పగటి వేషగాడు, గంగిరెద్దుమేళం. బుడబుక్కలవాడు. తలోరకం వేషం కడతారు. పచ్చబొట్టు పొడిచేవాళ్ళు మాత్రం ఏ వేషము కట్టరు.


    మాజీ ముఖ్యమంత్రిగారే అన్ని వేషాలు కట్టినప్పుడు పచ్చబొట్టు పొడిచేవాళ్ళు కడితే తప్పేమిటి? అన్న కొత్త ఆలోచనతో పచ్చ పచ్చగా పలురకాల రంగులతో వేషం కట్టారు వీళ్ళు.


    "సార్!" ఎవరూ దగ్గరగా లేకుండా చూసి వినయంగా పిలిచాడు అహోబిలం.


    "నీకేం చెప్పాను. అహ నీకేం చెప్పాను!" కోపంగా అడిగాడు వర్ధనరావు.


    "ఏం చెప్పారో గుర్తులేదు సార్!"


    "గుర్తులేదు. నా కొంపలు ముంచటానికి మా బాగా చెప్పావ్!" చావు కబురు చెప్పినంత తేలికగా చెప్పావు. నేనేం చెప్పాను?"


    "గుర్తులేదు సార్!" తగ్గిపోతూ చెప్పాడు అహోబిలం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS